Telangana Politics Special Story: రాజకీయాలు అందరికీ ఒక పట్టానా అర్థం కానీ బ్రహ్మ పదార్థం. ఈ రంగంలో రోజు, రోజుకు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నాటకంలో ఒక ఎపిసోడ్ ముగిసిందనుకునే లోపు మరో ఎపిసోడ్ కు తెర లేవడం జరుగుతూనే ఉంది. అలాగే అన్ని పార్టీల్లో ఒకేవిధమైన సమస్య పొడసూపడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వీటిలో కొన్నిటికి నాయకులు కారణమైతే, మరికొన్ని పరిస్థితులు కారణమవుతాయి. పరిస్థితులు ఎప్పుడూ ఏ విధంగా మార్పులు చెందుతాయో అర్థం కానీ పరిస్థితి.
Also Read: పులివెందుల్లో ఓటమి అంచుల్లో వైఎస్.. చంద్రబాబు రంగంలోకి దిగారు.. ఆ తర్వాత ఏమైందంటే?
*అప్పుడు.. ఇప్పుడు..*
గడిచిన ఏడాది కాలంలో పరిస్థితి వేరు. ఈ నెల రోజుల్లో మారిన సమీకరణాలు వేరు. ఒక్కో ఇష్యూ తెరమీదకు వచ్చి అట్టే మాయమైపోతున్న తీరు పరికిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఎంత త్వరగా మార్పులు సంభవిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ ఏర్పడిన తరువాత మొట్టమొదటిసారిగా అధికారానికి వచ్చిన కాంగ్రెస్ ను ఏవిధంగా ముప్పుతిప్పలు పెడదామని చేసిన ప్రయత్నాలు వారికే చుట్టుకొని, చివరికి వారి సమస్యలు వారే పరిష్కరించుకునేందుకే తలప్రాణం తోకకు వచ్చినట్లయింది. పదేళ్లు పాలించిన ప్రభుత్వం, తమకు ఎదురులేదని, తాము తప్ప ఈ రాజ్యాన్ని పాలించే అర్హత ఎవరికి లేదని, ప్రజలకు వేరే ప్రత్యామ్నాయం లేదని విర్రవీగుతున్న సమయంలో, ఎవరూ ఊహించని ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. అధికార మత్తులో జోగుతున్న అప్పటి ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో తమ ప్రభుత్వంపై విశ్వాసం రోజు రోజుకు తిరిగిపోతున్నది అనే వాస్తవాన్ని గ్రహించలేకపోయారు. ఒకటి, రెండు రాజకీయ మార్పులు సూచనప్రాయంగా కనిపించినా, వాటిని పట్టించుకోలేదు. పర్యవసానంగా వెళ్ళూనుకొని ఉన్న భారీ వృక్షం ఒక్క గాలివానకు పడిపోయినట్లు పార్టీ కకావికలమైంది. ఆ వృక్షాన్ని నమ్ముకొని గూళ్లు కట్టుకొని జీవిస్తున్న కొన్ని పక్షులు విపత్తును ముందే గ్రహించి వేరే వృక్షాన్ని ఆశ్రయించగా, పసిగట్టలేని కొద్దిమంది మాత్రం అలాగే ఉండిపోయి పడిపోయిన శకలాలు మళ్ళీ జీవం పోసుకుంటాయేమోనని ఆశగా ఎదురుచూస్తున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని అస్థిర పర్చడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోగా, వారికే భూమరంగ్ అవుతున్నాయి. పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు, కార్యకర్తలను, నాయకులను కార్యోన్ముఖులను చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. సమస్యల మీద సమస్యలు చుట్టుముట్టడంతో పాటు ఇంటిపేరు పెద్దాయనకు తలనొప్పిగా పరిణమించింది. పార్టీలో పెద్దాయన తరువాత తామే అంటూ ప్రత్యక్షంగా ఇద్దరు, పరోక్షంగా నలుగురు ఆధిపత్యం చెలాయించేందుకు పోటీపడుతుండడంతో పెద్దాయన వారిని ఏవిధంగా సంజాయించాలనే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అధికారంలో ఉండగా చిన్న సమస్యలుగా వీటిని గోటితో తీసివేసిన పెద్దాయనకు అధికారం కోల్పోయిన మరుక్షణం ఈ సమస్యలే పెనుభూతాలుగా మారాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ఏవిధంగా మంత్రాంగం చేయాలనే విషయంలో పెద్దాయన ఫాంహౌస్ నుంచి సంధిస్తున్న ఒక్కో అస్త్రం కొద్దిదూరం ప్రయాణించి లక్ష్యాన్ని చేరుకునే లోపే అంతర్ధానం అవడం కనిపిస్తోంది.
లిక్కర్ కేసులో జైలుకు వెళ్లివచ్చిన తరువాత వ్యక్తిగతంగా ప్రజల్లోకవిత ప్రాభవం ఈమేరకు ఉందని పెద్దాయన పరీక్షించేందుకు చేసిన ప్రయత్నం పార్టీలో వేరేలా ప్రకంపనలకు దారితీసింది. జాగృతి పేరుతో కవిత దూకుడు పార్టీలో కొత్త సమస్యలను తెచ్చిపెట్టింది. కొన్ని విషయాలపై పార్టీ నాయకులన్నా ముందే స్పందించడం, కార్యక్రమాల నిర్వహణతో కంటిగింపయ్యింది. ఒక దశలో పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లుగా భావించే ఒకరిద్దరు నాయకులపై చేసిన వ్యాఖ్యలు గందరగోళ పరిస్తితులకు దారితీశాయి. పార్టీ వీడి కొత్త కుంపటి పెట్టే అవకాశాలున్నాయని కూడా ఊహాగానాలు ఊపందుకున్నాయి.
*అటకెక్కిన దీక్ష*
బీసీ రిజర్వేషన్లపై ఏకంగా 72 గంటల దీక్ష చేస్తానని ప్రకటించిన కవిత 24 గంటలు కాకముందే అకస్మాత్తుగా దీక్ష విరమించుకోవడం వెనుక పెద్దాయన ఆదేశాలున్నట్లు వార్తలు వచ్చాయి. అన్న చెల్లెళ్ళు రాఖీతో నైనా ఏకం అవుతారని భావించిన ఆ పార్టీ నాయకులు నిరాశకు గురయ్యారు. ప్రతీరోజు ఏదోవిధంగా వార్తల్లో వ్యక్తిగా మైలేజ్ అందుకున్న కవిత ఒక్కసారిగా మౌనం వహించడానికి కారణాలు ఏమై ఉంటాయనే విషయంలో చర్చ ఊపందుకుంది. ఆ తరువాత కొడుకు చదువుల కోసం 15 రోజులు అమెరికా ప్రయాణం పెట్టుకున్న కవిత తిరిగి వచ్చే వరకు పరిస్థితిపై వివిధ రకాలుగా చర్చించుకుంటున్నారు.
*అటు కాంగ్రెస్ లో..*
మంత్రి పదవి కోసం అంగలారుస్తూ నోటికి వచ్చిందలా మాట్లాడుతున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. రోజు, రోజుకు కొత్త రకం గళం విప్పుతున్న కోమటిరెడ్డి ఎపిసోడ్ ఎలా ముగుస్తుందని చర్చ కాంగ్రెసులో అంతర్గతంగా జరుగుతోంది. కానీ ఒక్క అన్న తప్ప ఎవరూ ఈ విషయంలో నోరు మెదపడం లేదు. కోమటిరెడ్డి కి మంత్రి పదవి ఇచ్చి ఊకోబెడతారా.? లేక ఆయనే విసిగిపోయి ఊకుంటారా..? అని కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
*గువ్వల ఎపిసోడ్*
కేసీఆర్ కు అనుంగు అనుచరుడైన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఎటు వెళ్తాడో అనే ఎపిసోడ్ మాత్రం వారం రోజులు షేక్ చేసింది. బిఆర్ఎస్ కు రాజీనామా చేసిన “గువ్వ”ల ఏ గూటికి చేరుతుందో అనే విషయంలో చర్చ ఊపందుకుంది. చివరకు ఊహించినట్లుగానే బీజేపీ లో చేరడంతో ఆ ఎపిసోడ్ కు తెరపడింది.
*బీజేపీ లో కూడా అదే తంతు..*
బీజేపీలో అధ్యక్ష ఎన్నికలు పార్టీలో విభేదాలను బహిర్గతం చేశాయి. కట్టర్ హిందుత్వ వాది ఆయన రాజా సింగ్ ఈ పరిణామాలతో పార్టీకి రామ్.. రామ్ చెప్పాల్సివచ్చింది. బయటికి వచ్చిన రాజసింగ్ మళ్లీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నా ఫలితం లేకపోవడంతో ఆయన అటు కాంగ్రెస్, బీఆర్ఎస్ లో చేరలేక, ఇటు బీజేపీకి దూరమై ఏకాకిగా మిగిలిపోయాడు.
అధికార పార్టీ నుంచి ప్రతిపక్షాల వరకు అన్ని పార్టీల్లో బేధాభిప్రాయాలు, అభిప్రాయ బేధాలు పొడసొపుతూనే ఉంటాయి. కొన్ని వాటంతట అవే సద్దుమణుగుతాయి. కొన్ని నాయకత్వ చొరవతో పరిష్కారమవుతాయి. ఏదోవిధంగా వార్తలకు ఎక్కాలని, ప్రతీ రోజు తనపేరు మారుమోగాలని ఒకటి, రెండు మీడియాలో కామెంట్ చేయడం, సోషల్ మీడియాలో వైరల్ కావడం, వాటిపై విశ్లేషణలతో హైలైట్ కావడం, వాటిని ఆధారంగా చేసుకొని ప్రత్యేక ఇంటర్వ్యూలు ప్రసారం చేయించుకొని తమకుతామే పెద్ద నాయకుడిగా ఊహించుకోవడం పరిపాటిగా మారింది. తద్వారా కొన్ని పెయిడ్ మీడియా వ్యవస్థలు సొమ్ము చేసుకునేందుకు ఉపయోగించుకుంటున్నాయి.