Shivam dube : క్రికెట్లో అదృష్టానికి తావు లేదు. కేవలం కష్టాన్ని.. ప్రతిభను ప్రదర్శించే జట్లకు మాత్రమే విజయాలు లభిస్తాయి. అరుదైన సందర్భాలలో మాత్రమే క్రికెట్ లో అదృష్టానికి అవకాశం ఉంటుంది. అలాంటి వారిలో కొంతమంది పేర్లు ప్రముఖంగా వినిపిస్తుంటాయి. ప్రస్తుతం ఆ జాబితాలో టీమిండియా వర్ధమాన ఆటగాడు శివం దుబే చేరినట్టు కనిపిస్తోంది. అతనికి సంబంధించిన కొన్ని వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారితీస్తున్నాయి.
ఇటీవల శివం దుబేను పొగుడుతూ సూర్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అతడు తన లక్కీ చాంప్ అని పేర్కొన్నాడు. అతని ఆట తీరు బాగుంటుందని.. అతడు ఆడుతుంటే అద్భుతంగా ఉంటుందని పేర్కొన్నాడు. బంతితో.. బ్యాట్ తో అతడు ఆకట్టుకునే ప్రదర్శన చేస్తాడని వివరించాడు. సూర్య కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను జాతీయ మీడియా ప్రముఖంగా ప్రచురించింది. ఇక స్పోర్ట్స్ వెబ్ సైట్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూర్య కుమార్ యాదవ్, శివం దుబేకు బలమైన బాండింగ్ ఉందని చాలామందికి తెలుసు. అయితే అది బాండింగ్ మాత్రమే కాదని.. అంతకుమించిన అదృష్టమని ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
శివం దుబే ప్రస్తుతం టీమిండియా టి20 ఫార్మాట్లో తిరుగులేని ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు అతడు 31 t20 మ్యాచ్ లు ఆడాడు. అందులో ఒక్క మ్యాచ్ కూడా టీమిండియా ఓడి పోలేదు. టి20లో 2020లో కివీస్ జట్టుతో ప్రారంభమైన ఈ జైత్రయాత్ర నిర్విరామంగా కొనసాగుతోంది. 31 మ్యాచ్లలో ఏకంగా 25 మ్యాచ్ లను టీమిండియా విజయం సాధించింది. అన్ని మ్యాచ్ లలోనూ అతడు ప్రాతినిధ్యం వహించాడు. 31 మ్యాచ్లు టీమ్ ఇండియా ఆడగా.. 25 గెలిచింది. నాలుగు మ్యాచులు టై అయ్యాయి. రెండు ఫలితం తేలకుండా మిగిలిపోయాయి.. శివం దుబే సూర్య కుమార్ యాదవ్ కు మాత్రమే కాదు, మహేంద్ర సింగ్ ధోనీకి కూడా అత్యంత ఇష్టమైన ఆటగాడు. అందువల్లే అతడు చెన్నై జట్టులో చాలా రోజులుగా కొనసాగుతున్నాడు. ఇటీవలి ఐపీఎల్లో అతడు తన స్థాయికి తగ్గట్టు ఆడకపోయినప్పటికీ.. మేనేజ్మెంట్ అతడిని జట్టులో కొనసాగించే అవకాశం ఉంది. దీనిని బట్టి అతడు ఎలాంటి ఆటగాడో అర్థం చేసుకోవచ్చు.