IPL Player Transfers : ఐపీఎల్ లో గొప్పగా ఆడిన ప్లేయర్లకు ఎంతైతే విలువ ఉంటుందో.. ఆడని ప్లేయర్లకు కూడా అదే స్థాయిలో తిరస్కారం ఉంటుంది. ఒకప్పుడు మేము పరుగులు చేశాం.. టైటిల్స్ అందించాం.. ఇది మా ట్రాక్ రికార్డు అంటే కుదరదు. కచ్చితంగా ఆడాల్సిందే.. పరుగులు తీయాల్సిందే.. జట్టును విజయాల బాట పట్టించాల్సిందే. ఇలా చేస్తేనే యాజమాన్యాలు కోట్లు కుమ్మరిస్తాయి. ముద్దులతో ముంచెత్తుతాయి. అలాకాకుండా కోట్లు తీసుకుని సరిగ్గా ఆడక పోతే చేతులెత్తేస్తాయి. మరో మాటకు తావు లేకుండా బలవంతంగా వదిలించుకుంటాయి. ఇప్పుడు ఈ ఇద్దరి ఆటగాళ్ల విషయంలో జరుగుతోంది కూడా అదే.
2024 ఐపీఎల్ సీజన్లో కోల్ కతా జట్టు విజేతగా నిలవడానికి శ్రేయస్ అయ్యర్ మాత్రమే కాదు.. వెంకటేష్ అయ్యర్ కూడా కారణమే. కాకపోతే క్రెడిట్ మొత్తం సో కాల్డ్ మీడియా సంస్థల వల్ల గౌతమ్ గంభీర్ ఖాతాలోకి వెళ్లిపోయింది. వెంకటేష్ అయ్యర్ చూపించిన ప్రతిభ మేనేజ్మెంట్ కు తెలుసు కాబట్టి.. మెగా వేలంలో అతడిని ఏకంగా 23.75 కోట్లకు అంటిపెట్టుకుంది.. ఒక రకంగా వెంకటేష్ అయ్యర్ ను సారథి గా నియమిస్తానని కూడా షారుక్ ఖాన్ మాట ఇచ్చినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. చివర్లో రహానే రావడంతో అయ్యర్ ఒక సాధారణ ఆటగాడు గానే మిగిలిపోయాడు. కారణాలు తెలియదు కాని 2025 సీజన్లో మాత్రం అయ్యర్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. పైగా కొన్ని మ్యాచ్లు మాత్రమే ఆడాడు. అతడి నిరాశ జనకమైన ఫామ్ వల్ల మేనేజ్మెంట్ పక్కన పెట్టింది. 23.75 కోట్ల ఆటగాడు కాబట్టి… గాయం అయిందని సాకు చెప్పింది. మేనేజ్మెంట్ పక్కన పెట్టిన తర్వాత కోల్ కతా ఆడిన ఏ మ్యాచ్ లోనూ అయ్యర్ కనిపించలేదు. కనీసం డ్రెస్సింగ్ రూమ్ లో కూడా దర్శనమివ్వలేదు.
అయ్యర్ జాడ కనిపించకపోవడంతో.. అప్పట్లోనే అతడు వచ్చే సీజన్ కల్లా జట్టులో ఉండడం కష్టమేనని జాతీయ మీడియా కథనాలను ప్రసారం చేసింది. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు అతడు ఆ జట్టును వదిలే సంకేతాలు కనిపిస్తున్నాయి. అతని స్థానంలో ఇషాన్ కిషన్ కి షారుక్ ఖాన్ జట్టుతో జత కట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే సీజన్లో అయ్యర్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఆడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.. 2026 సీజన్ ప్రారంభం కంటే ముందు మినీ వేలం జరుగుతుంది. ఆ వేలంలో షారుక్ ఖాన్ జట్టు అయ్యర్ ను వదిలించుకునే అవకాశం కనిపిస్తోంది. అయ్యర్ కూడా అదే విధంగా సంకేతాలు ఇచ్చాడు. మరోవైపు కావ్య జట్టు నుంచి కిషన్ బయటికి వస్తాడని ప్రచారం జరుగుతోంది. అతనిపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నప్పటికీ 2025 సీజన్లో గొప్ప ఇన్నింగ్స్ ఆడ లేకపోయాడు. రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో సెంచరీ చేసిన అతడు.. ఆ తదుపరి ఆ మ్యాజిక్ ప్రదర్శించలేకపోయాడు. దీంతో అతడిని జట్టు నుంచి బయటికి పంపించడానికి కావ్య సుముఖత వ్యక్తం చేశారని తెలుస్తోంది.. అయితే అటు షారుక్, ఇటు కావ్య జట్ల నుంచి అయ్యర్, కిషన్ బయటికి వెళ్లడంపై ఎటువంటి అధికారిక ప్రకటనలు రాలేదు. కాకపోతే జాతీయ మీడియాలో మాత్రం కథనాలు వస్తున్నాయి..
అయ్యర్ ఇటీవల సీజన్లో 11 మ్యాచులు ఆడాడు. కేవలం 142 పరుగులు మాత్రమే చేశాడు. అతడిని షారుక్ ఖాన్ జట్టు 23.75 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంది. ఇక కావ్య జట్టు కిషన్ కోసం ఏకంగా 11.25 కోట్లు వెచ్చించింది. అతడు 14 మ్యాచ్లలో 354 పరుగులు చేశాడు. సీజన్ మొత్తంలో ఒక్క సెంచరీ చేసిన అతడు.. మిగతా మ్యాచ్లలో నిలకడ కోల్పోయాడు.. అయితే వచ్చే సీజన్లో భీకరమైన బ్యాటింగ్ లైనప్ కోసం కోల్ కతా యాజమాన్యం పకడ్బందీగా అడుగులు వేస్తోంది.. మరోవైపు హైదరాబాద్ కూడా మిడిల్ ఆర్డర్లో బంతి, బ్యాట్ తో సహకారం అందించే ఆల్ రౌండర్ కోసం అన్వేషిస్తున్నది.. అందువల్లే ఈ రెండు జట్లు మార్పులు చేర్పులకు సిద్ధమయ్యాయని తెలుస్తోంది.. ఒకవేళ ఈ ఇద్దరు ఆటగాళ్లు అటూ ఇటూ తమ స్థానాలు మార్చుకొని.. పూర్వపు లయను అందుకుంటే మాత్రం సరికొత్త చరిత్ర సృష్టించిన వాళ్ళు అవుతారని మాజీ క్రికెటర్లు పేర్కొంటున్నారు.