Jagan Government: ఒక చాన్స్.. ఒకే ఒక చాన్స్.. ఖడ్గం సినిమాలో కథానాయికలో ఒకరైన సంగీత పలికే డైలాగు ఇది. అచ్చం మూడేళ్ల కిందట ఏపీ సీఎం జగన్ రాష్ట్ర ప్రజలను ఇదే కోరిక కోరారు. అద్భుత పాలన అందిస్తానని హామీ ఇచ్చారు. ఒకసారి చాన్స్ ఇవ్వాలని వేడుకున్నారు. ఆయన విన్నపాన్ని మన్నించిన ప్రజలు అంతులేని.. ఊహించని విజయం అందించారు. సీన్ కట్ చేస్తే ఈ నెల 30 నాటికి ఒక్క చాన్స్ ఇచ్చి మూడేళ్లు పూర్తవుతుంది. తాను చెప్పిన అద్భుత పాలన అందించకపోగా.. రాష్ట్రాన్ని దివాళా దిశగా నడిపారు. అప్పులు చేయడం.. లేకుంటే పన్నులు బాదడం, ప్రశ్నించే వారిపై కక్షలకు దిగడంతోనే మూడేళ్ల పాలనను ముగించుకున్నారు. మూడేళ్ల పాలనలో చెప్పుకోవడానికి ఒక్క మైలు రాయి లేదు. అన్నీ కోర్టు చీవాట్లు.. వైఫల్యాలు.. అప్పులు…అవినీతి తప్ప ఇంకేమీ లేదు. ప్రజలు అధికారం ఇవ్వడం అంటే..ఏపీని తనకు రాసిచ్చేసినట్లుగా ఫీలయ్యే ముఖ్యమంత్రి.. ఆయన అండతో సంపాదించేసుకోవాలనే అనుచరులు… ఉద్యోగులకు జీతాలివ్వకపోయినా ఠంచన్‌గా లక్షలకు లక్షలు జీతాలు తీసుకునే సలహాదారులు… ఇలా ఏపీ భవిష్యత్ అంధకారంలోకి జారిపోయింది. మరో రెండేళ్లకు ఎక్కడ తేలుతుందో కానీ..అనుభవించాల్సింది మాత్రం ప్రజలే. ప్రజలకు మంచి చేయకపోయినా పర్వాలేదు.. కనీసం చెడు చేయకుండా ఉంటే చాలు అనేది ఓ నానుడి. వివిధ పథకాల కింద ప్రజలకు నగదు బదిలీ చేస్తామని సగటున ఒక్కో కుటుంబానికి రూ. మూడు నుంచి ఐదు లక్షలు ఏడాదికి ప్రయోజనం చేకూరుస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. నేరుగా నగదు బదిలీ చేయడం ద్వారా ఏకంగా మూడేళ్లలో రూ.1.40 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లో జమ చేసినట్లుగా ప్రకటించుకుంటున్నారు. అయితే ఈ మూడేళ్లలో ప్రభుత్వం చెప్పిన లెక్క ప్రకారం.. ఏటా రూ. లక్షల్లో లబ్ది చేకూరలేదు.. వేలల్లోనే చేకూరింది. అదీ కూడా అందరికీ కాదు.. వైసీపీకి ఓటు వేసిన వాళ్లకి.. ఓటు వేస్తారని భావిస్తున్న వాళ్లకే.
గత పథకాలకు మంగళం
గత ప్రభుత్వాలు ప్రవేశ పెట్టిన పథకాలకు మంగళం పలికారు. రాయితీ, రుణ పథకాలను, స్వయం ఉపాధి మార్గాలను నిలిపివేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన అన్న క్యాంటీన్ల దగ్గర్నుంచివిదేశీ విద్యాపథకం వరకూ అన్నింటినీ రద్దు చేశారు. కాలేజీ ఫీజులు తగ్గించేసి.. భారం దించేసుకున్నారు. కానీ విద్యావ్యవస్థే కుప్పకూలే పరిస్థితి. పథకాలను శాచురేషన్ స్థాయిలో అమలు చేయాలని లక్ష్యమని జగన్ చెప్పుకునేవారు. ఇప్పుడు ఆ మాట చెప్పడం లేదు. నిజానికి ఏ ఒక్క పథకం కూడా అర్హులకు పూర్తి స్థాయిలో ఉందడం లేదు. ఎందుకంటే అర్హులనే కేటగిరీనే ఎవరూ అర్హులు కాకుండా చేశారు. పథకాల అమలు ఓ ప్రహసనంగా మారిపోయింది. ప్రభుత్వం చెప్పే లెక్కలకు నిజంగా విడుద ల చేసే దానికి అసలు పొంతనే ఉండదు. విభజిత ఆంధ్రప్రదేశ్ కోలుకుంటున్న తరుణంలో అధికారాన్ని అందిపుచ్చుకున్న జగన్ తాను తీసుకున్న నిర్ణయాలతో ఏపీ భ విష్యత్ అంధకారంలోకి నెట్టారు. రూ. పది కోట్ల విలువైన ప్రజావేదికను కూల్చివేతతో విధ్వంసాన్ని ప్రారంభించారు. రూ. పది లక్షల కోట్ల విలువైన రాష్ట్ర ప్రజల ఆస్తి అమరావతిని నిర్వీర్యం చేసేశారు. మూడు రాజధానుల పేరుతో భారీ డ్రామా నడిపారు. రివర్స్ టెండర్ల పేరుతో మొత్తం అభివృద్ధిని నిలిపివేశారు. పోలవరం సహా ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తిచేసిన దాఖలాలు లేవు. ఏపీకి ఆర్థికంగా అండదండలు ఇచ్చే అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యంచేశారు. పెట్టుబడులు రాకుండా చేశారు. చివరికి అప్పుల పాలు చేశారు. దేన్ని పడితే దాన్ని అమ్ముకునే దుస్థితి వచ్చింది. చివరికి విశాఖలో పురాతన భవనాలు, విజయవాడ బెరం పార్క్ కూడా తాకట్టు పెట్టేశారంటే.. ఇక పెట్టుకోవడానికి ఏమీ లేవనుకోవాలి. ఏడాదిలో 300 రోజులకుపైగా ఓడీలో ఉండే ప్రభుత్వం.. ఏటా రూ. లక్ష కోట్లకుపైగా అప్పు చేసే ప్రభుత్వం ఇదే. ఎంత వడ్డీ.. ఎంత కమిషన్ అన్న దానితో సంబంధం లేకుండా ఎంత ఇస్తే అంత తెచ్చుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఫలితంగా ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. దివాలా అంచున్న ఉన్న ఐదు రాష్ట్రాల్లో ఏపీ ఒకటని కేంద్రం లెక్కవేసిందంటే ఏ స్థాయి ప్రమాదంలో ఉందో అవగతం చేసుకోవచ్చు.
ఉత్సవ విగ్రహాలుగా స్థానిక సంస్థలు
స్థానిక సంస్థల ప్రాభవాన్ని పెంచుతానన్న జగన్.. దానిని మరింతగా దిగజార్చారు. పంచాయతీలను, సర్పంచ్ లను ఉత్సవ విగ్రహాలుగా మార్చారు. రాజ్యాంగం వారికి కల్పించిన హక్కులను సైతం కాలరాశారు. తన మానస పుత్రికలైన వలంటీరు, సచివాలయ వ్యవస్థలకు అగ్రతాంబూలం ఇచ్చారు. సర్పంచ్ల అధికారాల్ని వీఆర్వోలకు కట్టబెడుతూ నిర్ణయం తీసుకున్నారు. వివాదాస్పదమైన ఈ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. సచివాలయాల పర్యవేక్షణ బాధ్యత పంచాయితీరాజ్ పరిధిలో నుంచి తప్పించి రెవెన్యూ శాఖకు బదలాయించారు. ఆ జీవో రాజ్యాంగ విరుద్ధంగా ఉందని హైకోర్టు కొట్టి వేసింది. ఈ ఒక్కటే కాదు ఎస్ఈసీ దగ్గర్నుంచి ప్రతి ఒక్క వ్యవస్థతోనూ ప్రభుత్వం ఓ ఆట ఆడుకుంది. యూనివర్శిటీ వైఎస్ చాన్సలర్లయితే… ఇక వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల కన్నా దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. పోలీసుల సంగతి చెప్పాల్సిన పని లేదు. హత్యలు చేసిన అధికార పార్టీఎమ్మెల్సీని కాపాడటానికి కట్టు కథలు కూడా చెబుతున్నారు. ప్రస్తుతం ఏపీలో ఏ ఒక్క వ్యవస్థ అయినా సక్రమంగా పని చేస్తుందా అనేది… ఎవరికి వారు విశ్లేషించుకుంటే… ఎస్ అనే సమాధానం దేనికీ లభించదు. వ్యవస్థల్ని మనం కాపాడితే.. మనల్ని వ్యవస్థలు కాపాడతాయంటారు. కానీ.. ఇప్పుడు నిర్వీర్యమైన వ్యవస్థలే.. తర్వాత వారి మెడకు చుట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read: Naga Chaitanya Satires On Samantha: సమంత పై సెటైర్లు వేసిన నాగ చైతన్య
దొడ్డిదారిన జీవోలు
రాజ్యాంగబద్ధమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అన్నివర్గాల ప్రజల అభిప్రాయాలను తీసుకోవాలి. కానీ అటువంటి వాటికి జగన్ సర్కారు ఇష్టపడడం లేదు. ఇష్టారాజ్యంగా కొత్త జిల్లాలను ఏర్పాటుచేశారు. ప్రజల మనోభావాలు అసలు పట్టించుకోలేదు. కోన సీమ జిల్లాకు ఆలస్యంగా పేరు పెట్టి… విద్వేషాలు రెచ్చగొట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే .. జీవోలను రహస్యంగా ఉంచడం వల్ల ఎన్ని అడ్డగోలు నిర్ణయాలు తీసుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రభుత్వం చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి. చెప్పేదానికి చేసే దానికి పొంతన ఉండదు. కానీ మీడియా ముందుకు ఆదర్శాలు వల్లే వేస్తారు. మూడు రాజధానుల నిర్ణయమూ అంతే. ఏ మాత్రం ప్రాణికత లేదని బీసీజీ కంపెనీ.. బొత్స కమిటీలతో పని పూర్తి చేశారు. పని పూర్తి చేయడం అంటే… ఏపీని సర్వనాశనం చేయడం అన్నమాట. తాను జైలు జీవితం గడిపాను.. వారెందుకు గడపకూడదో అనుకున్నారేమో కానీ.. టీడీపీ నాయకులను విడిచిపెట్టలేదు. టీడీపీ కీలక నాయకులుగా ఉన్న అచ్చెన్నాయుడు. ధూళిపాళ్ల నరేంద్ర, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమా , నారాయణ దగ్గర్నుంచి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని ఎవర్నీ వదిలి పెట్టలేదు. చివరికి కరోనా నిబంధనల ఉల్లంఘన అంటూ చంద్రబాబును అరెస్ట్ చేయడానికి కూడా కర్నూలు నుంచి హైదరాబాద్‌కు పోలీసులు వెళ్లారు. ఎవరి పైనా నిర్దిష్టమైన సాక్ష్యాలు ఉండవు. ఎవరి కేసులూ నిలబడవు. ఎవరికీ నోటీసులు ఇవ్వరు. రాత్రికి రాత్రి వచ్చి కిడ్నాప్ చేసినట్లుగా తీసుకెళ్లడమే పని. సొంత ఎంపీనీ వదల్లేదు. ఏదైనా టాపిక్‌ను డైవర్ట్ చేయాలనుకున్నప్పుడో… మరో ఏదైనా సమస్యను చిన్నది చేయాలనుకున్నప్పుడో… ప్రభుత్వం టీడీపీ నేతల అరెస్టు వ్యూహాలను అనుసరించింది. టీడీపీ నేతల్ని అరెస్ట్ చేస్తున్నారు కానీ… వారు అక్రమాలు చేశారనేలా… ఆధారాలను ప్రజల ముందు ఉంచలేకపోతున్నారు. కోర్టుల సంగతేమో కానీ.. రాజకీయనేతల్ని అరెస్టులు చేసినప్పుడు… వారిని రాజకీయ కక్షతో కాదు.. నిజంగానే నేరం చేసినందుకు అరెస్ట్ చేస్తున్నామని ప్రజల్ని నమ్మించగలగాలి. లేకపోతే అది రాజకీయ కక్ష సాధింపుల అరెస్టులు అనుకుంటారు. ఏపీలో అదే జరుగుతోంది.
ప్రజలకు బాదుడే..
అటు ప్రజలను ప్రశాంతంగా ఉంచడం లేదు. పన్నుల పేరిట బాదేస్తున్నారు. ఎప్పుడో ఎన్టీఆర్ హయాంలో చేపట్టిన గ్రుహ నిర్మాణానికి ఓటీఎస్ పేరుతో వసూలుకు దిగారు. జగనన్న శాశ్వత గ్రుహహక్కు కింద వారిచ్చిన డాక్యుమెంట్లు ఇప్పుడు ఎందుకూ పనికి రావు. చెత్తపన్ను పేరుతో పిండేస్తున్నారు. ఆస్తి పన్నును వేలల్లో వసూలు చేస్తున్నారు. ఇళ్ల స్థలాలిచ్చామని చెప్పి.. ఇళ్లు కట్టుకోవాల్సిందేనని చెబుతూ పేదల్ని అప్పుల పాలు చేస్తున్నారు. ఎనభై శాతం ఇళ్ల స్థలాలు ఎందుకూ పనికి రావు. అక్కడ రోడ్లు .. నీరు మౌలిక సదుపాయాలు కల్పించుకోవాలంటే .. ముఫ్పై వేల కోట్లు కావాలి. ఒక్క పైసా కూడా కేటాయించలేదు. కానీ ప్రజల్ని ఇళ్లు కట్టుకోమని ఒత్తిడి చేస్తున్నారు. కట్టిస్తామని చెప్పి కట్టించడం లేదు. చివరికి గత ప్రభుత్వం కట్టిన టిడ్కో ఇళ్లూ ఇవ్వలేదు. మద్యం ధలను షాక్ కొట్టేలా పెంచుతామనిచెప్పి.. పెంచి… పేదల్ని నిలువుదోపిడి చేస్తున్నారు. సొంత బ్రాండ్లు మాత్రమే అమ్ముతూ ఆరోగ్యానికి కూడా గ్యారంటీ లేకుండా చేస్తున్నారు. సొంత ఓటర్లను మద్యం ధరలను పెంచి దోచుకునే సీఎం దేశంలో మనకు మరెక్కడా కనిపించరు.
Also Read: Ambassador : దేశాన్ని ఏలిన అంబాసిడర్ మళ్లీ మార్కెట్లోకి.. డిజైన్ పూర్తి.. ఎప్పుడంటే..?
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Three years for a single chance jagan government that issues to the people
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com