AP SSC Results: ‘నాడు నేడు’తో ప్రభుత్వ పాఠశాలల్లో రూపురేఖలు మార్చాం. మౌలిక వసతులు మెరుగుపరిచాం. రాయితీలు కల్పించాం. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరిక పెరిగింది. అడ్మిషన్లు పెరిగాయి…ఇలా ఒకటేమిటి ప్రభుత్వం ఎన్నోరకాల ఆర్భాటపు ప్రకటనలు చేసింది. కానీ విద్యాబోధన విషయానికి వచ్చేసరికి మాత్రం విఫలమైంది. పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతంలో గతంలో ఎన్నడూలేని విధంగా ఘోరమైన రికార్డు సృష్టించిన రాష్ట్ర ప్రభుత్వం.. అందులోనూ కొన్ని అంశాలను తొక్కిపెట్టింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఎంతమంది పాసయ్యారు? ఉత్తీర్ణత శాతం ఎంత? అన్న విషయాలను అధికారికంగా వెల్లడించలేదు. ఆ లెక్కలు ఇంకా తీయలేదని పేర్కొంటోంది. పదో తరగతి ఫలితాల్లో సగటు ఉత్తీర్ణత 67.20 శాతం రావడమన్నది గత 15 ఏళ్లలో ఎప్పుడూ లేదు. సమైక్యాంధ్రలో కానీ, రాష్ట్ర విభజన తర్వాత కానీ దాదాపు 90శాతం ఫలితాలు వచ్చాయి. రాష్ట్ర విభజన అనంతరం గత టీడీపీ హయాంలోను ఇదేవిధమైన ఫలితాలు వచ్చాయి.
2019లో పదో తరగతి పలితాల్లో 94.80శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. అంతశాతం ఉత్తీర్ణత అంటే అటు ప్రభుత్వ పాఠశాలలు, ఇటు ప్రైవేటు పాఠశాలల్లో కూడా 90శాతం పైన విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లే. అలా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఫలితాలు సాధిస్తేనే సగటు ఉత్తీర్ణత శాతం 94.80శాతం వస్తుంది. కానీ, ఇప్పుడు కేవలం 67.20శాతం ఉత్తీర్ణత అంటే.. అందులో ప్రభుత్వ పాఠశాలల శాతం లెక్కిస్తే మరీ ఘోరంగా ఉంటుందని అంచనా. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల్లో 50శాతం లోపే ఉత్తీర్ణతా శాతం ఉంటుందని విద్యా నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు రాష్ట్రంలోనే అత్యంత ఎక్కువ ఉత్తీర్ణత సాధించిన ప్రకాశం జిల్లాలో 78.30శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. అయితే అదే జిల్లాలోని కొన్ని మండలాల్లో చూస్తే.. ప్రభుత్వ పాఠశాలల్లో పాసైన వారి శాతం 20నుంచి 50శాతమే ఉంది. వాస్తవానికి ప్రభుత్వ-ప్రైవేటు విద్యాసంస్థల్లో ఉత్తీర్ణతా శాతంలో ఎప్పుడూ కొంత తేడా ఉంటుంది. ఐదారు శాతం ప్రైవేటు పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం ఎక్కువుగా ఉంటుంది. అంతకుమించి ఉండదు.
Also Read: CM Jagan On Meters: ఏపీలో ఉచిత విద్యుత్ ఎత్తేస్తారా? వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు
2019లో సగటు ఉత్తీర్ణత శాతం 94.80. ఫెయిలైంది కేవలం 5.20 శాతమే. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా 90శాతం కంటే అధిక ఫలితాలు సాధిస్తేనే సగటు ఫలితాలు ఆమేరకు వచ్చాయన్నది స్పష్టం. కానీ ఇప్పుడు మాత్రం ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణతా శాతం 50శాతం లోపే ఉండడంతో.. ప్రైవేటు పాఠశాలల్లో ఉత్తీర్ణతా శాతం సుమారు 90% ఉంటుందని అంచనా. అంటే తేడా 40శాతం. ప్రభుత్వ-ప్రైవేటు రంగాల మధ్య ఉత్తీర్ణతా శాతంలో ఇంత తేడా ఎప్పుడూ రాలేదు. మరి ఇప్పుడే ఇంత తేడా ఎందుకొచ్చింది? అన్న ప్రశ్నకు ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయులకు కేవలం బోధన పని మాత్రమే అప్పచెబుతారని విద్యా నిపుణులు చెబుతున్నారు.
వారికి ఇతరత్రా పనులుండవు. బోధన బాగా చేశారా? విద్యార్థులు బాగా చదువుతున్నారా? అంతా మంచి మార్కులు తెచ్చుకోగలుగుతారా? అన్నదే చూస్తారు. ఉపాధ్యాయులే కాకుండా.. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, యాజమాన్యం అన్నీ ఈ విషయాలనే ప్రధానంగా దృష్టి సారిస్తాయి. కానీ, ప్రభుత్వ ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు మాత్రం అంత ప్రశాంతంగా వాటి గురించి ఆలోచించే అవకాశాన్ని ఈ ప్రభుత్వం ఇవ్వలేదనే విమర్శలు వస్తున్నాయి. యాప్లు, మరుగుదొడ్ల ఫొటోలు, యాప్లో అటెండెన్స్, నాడు-నేడు పనులు వంటివి అప్పగించడం వల్లే వారు విద్యార్థులపై శ్రద్ధ చూపలేక పోయారనే విమర్శలు వస్తున్నాయి. పర్యవేక్షించాల్సిన విద్యాశాఖ కూడా.. ఇతరత్రా అంశాలపైనే దృష్టిపెట్టిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే పదో తరగతి ఫలితాలు దారుణంగా వచ్చాయని నిపుణులు చెబుతున్నారు.
ఇంగ్లీష్ మీడియంలో పరీక్షలు రాసిన విద్యార్థుల్లో 77.55శాతం ఉత్తీర్ణత సాధించారు. తెలుగు మాధ్యమంలో రాసినవారిలో 43.97శాతం మాత్రమే ఈ ఏడాది పాసయ్యారు. ఆంగ్ల మాధ్యమంలో 4,22,743 మంది పరీక్షలు రాగా.. వీరిలో 3,27,854 మంది ఉత్తీర్ణులయ్యారు. తెలుగు మాధ్యమంలో 1,88,543 మంది పరీక్ష రాయగా.. 82,984 మంది పాసయ్యారు. ఆంగ్ల మాధ్యమంలో ఇంతమంది ఉత్తీర్ణులవడం, తెలుగు మాధ్యమంలో తక్కువకావడం అన్నదానిలోను కీలక అంశం ఉందని విద్యా నిపుణులు చెబుతున్నారు. అంటే ఆంగ్ల మాధ్యమంలో ప్రైవేటు పాఠశాలలే ముందంజలో ఉన్నాయని స్పష్టమైందంటున్నారు.
Also Read:Janasena Compete Alone: జనసేన ఒంటరి పోటీనే ఖాయమవుతోందా?
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: The ap government has lied in declaring the results of the tenth class examination
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com