HomeతెలంగాణTelangana: కొట్లాడి సాధించిన తెలంగాణలో కొలువు లేదు.. యువత ప్రాణాలకు దిక్కులేదు

Telangana: కొట్లాడి సాధించిన తెలంగాణలో కొలువు లేదు.. యువత ప్రాణాలకు దిక్కులేదు

Telangana: నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో యువత ఆకాంక్షలు నెరవేరడం లేదు. ఈ క్రమంలో నిరాశ చెందుతున్న యువత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలా ఓ కఠిన నిర్ణయం తీసుకొని ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఎన్నికల ముంగిట ఇది ప్రభుత్వానికి కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఉపాధ్యాయ నియామక పరీక్ష డీఎస్సీతో పాటు గ్రూప్‌-2 పరీక్షకు సన్నద్ధమవుతున్న ఓ అభ్యర్థిని బలవన్మరణానికి పాల్పడటం రాష్ట్రంలో కలకలం రేపింది. పోటీ పరీక్షలు వరుసగా వాయిదా పడుతుండడంతో మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్య చేసుకుందని తోటి విద్యార్థులు చెబుతున్నారు.

మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరుకు చెందిన మర్రి ప్రవల్లిక (23) చిక్కడపల్లి ఠాణా అశోక్‌నగర్‌లోని బృందావన్‌ బాలికల హాస్టల్‌లో ఉంటూ గ్రూప్స్‌నకు శిక్షణ తీసుకుంటోంది. శుక్రవారం రాత్రి ఆమె తన గదిలో ఉరి వేసుకుంది. ఈ విషయం తెలిసి అశోక్‌నగర్‌లోని హాస్టళ్లలో ఉంటూ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు, ఓయూ విద్యార్థి, కాంగ్రెస్‌, బీజేపీ, టీజేఎస్‌ నాయకులు తరలివచ్చారు. నిమిషాల వ్యవధిలోనే చేరుకున్న వందలాది విద్యార్థులు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, టీఎస్ పీఎస్సీ వైఫల్యం వల్లే పరీక్షలు వాయిదా పడుతున్నాయని మండిపడ్డారు. ప్రవల్లిక మృతదేహాన్ని చూసేందుకు అనుమతివ్వాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అసలు విషయం బయటకు రాకుండా పోలీసులు డ్రామాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూసైడ్‌ లెటర్‌ ఉందని తెలియడంతో.. దానిని చూపేవరకు మృతదేహాన్ని తీసుకెళ్లనివ్వమని బీష్మించారు. దీంతో పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఓ దశలో అక్కడ ఏం జరుగుతుందో అర్ధం కానంతగా అలజడి నెలకొంది. హాస్టల్‌ వద్దకు విద్యార్థుల రాక పెరుగుతుండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పరిస్థితి చేయి దాటిపోతుందని గుర్తించి అదనపు బలగాలను రప్పించారు. హాస్టల్‌లోకి మీడియాతో సహా ఎవరినీ అనుమతించలేదు. వివరాలు వెల్లడించేందుకూ విముఖత వ్యక్తం చేశారు. కాగా, విద్యార్థులు అర్థరాత్రి ఒంటి గంట దాటినా తమ ఆందోళనలను కొనసాగించారు.

కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలి: విద్యార్థులు

సంవత్సరాల తరబడి ప్రిపేరవుతుంటే అదేమీ పట్టించుకోకుండా, పేపర్‌ లీకేజీలు.. పరీక్షలు రద్దు చేస్తూ విద్యార్థుల జీవితాలతో సర్కారు చెలగాటమాడుతున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల వెతలు అర్ధం చేసుకోకుండా వ్యవహరించడం తగదంటూ మండిపడ్డారు. టీఎస్ పీఎస్సీ నిర్లక్ష్యం వల్లే పోటీ పరీక్షలు రద్దవుతున్నాయని ఆరోపించారు. కేసీఆర్‌, కేటీఆర్‌ డౌన్‌డౌన్‌ అంటూ టీఎస్ పీఎస్సీ కి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. కేసీఆర్‌ వచ్చి నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ ఎంపీ డాక్టర్‌ కె. లక్ష్మణ్‌ హాస్టల్‌ వద్దకు వచ్చి నిరసన తెలిపారు.

తల్లిదండ్రుల రాకకు నిరీక్షణ

ప్రవల్లిక మృతి విషయాన్ని పోలీసులు ఆమె తల్లిదండ్రులకు తెలియజేశారు. వారు వచ్చేందుకు 3 గంటలకుపైగా సమయం పట్టే అవకాశం ఉండడంతో మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించాలని భావించారు. అప్పటికే భారీగా విద్యార్థులు చేరుకుని నిరసన తెలుపుతుండడంతో నిర్ణయం మార్చుకున్నారు. సూసైడ్‌ లెటర్‌ కూడా తల్లిదండ్రులకు మాత్రమే చూపిస్తామని విద్యార్థి నేతలతో పేర్కొన్నారు.

ప్రభుత్వ హత్యే: ప్రతిపక్షాలు

ప్రవల్లిక ఆత్మహత్య విషయం తెలిసిన సికింద్రాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌, బీజేపీ నాయకులు వినయ్‌కుమార్‌, టీజేఎస్‌ నగర అధ్యక్షుడు నర్సయ్య తదితరులు హాస్టల్‌ వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. పరీక్షలు వాయిదా వేసినందుకే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిందని అనిల్‌కుమార్‌ ఆరోపించారు. ఇది ప్రభుత్వ హత్య అని బీజేపీ నేత వినయ్‌కుమార్‌ పేర్కొన్నారు. నిరుద్యోగులకు తీరని అన్యాయం చేస్తోన్న కేసీఆర్‌ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని, అసమర్థ టీఎస్ పీఎస్సీని రద్దు చేయాలని ఓయూ విద్యార్థి నేతలు డిమాండ్‌ చేశారు. పరీక్షల నిర్వహణ బాధ్యతలు యుపీఎస్సీకి అప్పగించాలని లేనిపక్షంలో కొత్త బోర్డు ఏర్పాటు చేయాలన్నారు.

తెలంగాణ వచ్చినా ఆగని ఆత్మహత్యలు..

‘‘తెలంగాణ తెచ్చుకొని పదేళ్లయినా.. నిరుద్యోగుల ఆత్మహత్యలు రాష్ట్రంలో ఆగడం లేదు. కేసీఆర్‌.. నీ కుటుంబంలో నీ బిడ్డ ఏడాది ఖాళీగా ఉంటే ఎమ్మెల్సీగా నియమించావు. ప్రవల్లిక ఆత్మహత్య నీకు కనిపించడం లేదు. గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ రెండు సార్లు రద్దయ్యింది. గ్రూప్‌-2 వాయిదా పడింది. టీఎస్ పీఎస్సీ పేపర్లను జనార్దన్‌రెడ్డి రెండు సార్లు లీకేజీ చేయించారు. అనితా రామచంద్రన్‌ ఇక్కడకు వచ్చి చూడు. నిరుద్యోగుల దుస్థితి ఎలా ఉందో.. కేసీఆర్‌ వల్ల పదేళ్లలో ఒరిగేందేం లేదు. కేటీఆర్‌ నువ్వు ఐటీ శాఖ మంత్రివి అయితే ఇక్కడకు రా.’’ అని ఓ విద్యార్థి నేత తీవ్రంగా విమర్శించారు.

ప్రభుత్వానికి సిగ్గుచేటు

‘‘విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్రమైన నిర్లక్ష్యం, దగాకు గురయ్యారు. ఈ రోజు ఓ నిండు ప్రాణం పోయింది. తెలంగాణ ప్రభుత్వానికి ఇంతకంటే సిగ్గుచేటు మరొకటి ఉండదు. సీఎం నిర్లక్ష్యం.. కళ్లుండి చూడలేకపోడం, చెవులుండి వినలేకపోవడం వల్ల వందలాది మంది విద్యార్థులు చనిపోతున్నారు. ప్రవల్లిక ఆత్మహత్యపై సిటింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి. కలిసి కొట్లాడుదాం.. ఆత్మహత్యలు చేసుకోవద్దు. అధైర్య పడొద్దు’’ అని పీడీఎస్ యూ నాయకుడు సూచించారు. కాగా, ప్రవళిక ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో చిక్కడపల్లి పరిసర ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత విధించారు. ముందు జాగ్రత్తగా ప్రైవేట్ హాస్టళ్ళల్లో పోలీసులతో పహారా ఏర్పాటు చేశారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular