ABN channel ban: రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నయితే రాజకీయ పార్టీలు ఉన్నాయో.. అంతకు మించిన సంఖ్యలో న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. స్థూలంగా చెప్పాలంటే ఒక్కో రాజకీయ పార్టీకి ఒక్కో న్యూస్ ఛానల్ ఉంది. కొన్ని రాజకీయ పార్టీలు అయితే అనుబంధంగా యూట్యూబ్ ఛానల్స్ కూడా నిర్వహిస్తున్నాయి. ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం.. అడ్డగోలుగా కథలను, కథనాలను ప్రసారం చేయడం అలవాటుగా మారింది. మీడియాలోకి రాజకీయ పార్టీలు ప్రవేశించడంతో .. మీడియా తన విలువను కోల్పోయింది.
ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రజ్యోతి పత్రిక అధిపతి వేమూరి రాధాకృష్ణ నైని బ్లాక్ వ్యవహారం మీద సంచలన విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఇది అటు ప్రభుత్వంలో, ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్ లో సంచలనం సృష్టించింది. దీనిపై రకరకాలుగా చర్చలు జరిగాయి. ఇది ఇలా కొనసాగుతుండగానే ఏబీఎన్ న్యూస్ ఛానల్ ఇటీవల ఓ డిబేట్ నిర్వహించింది. ఇందులో భారత రాష్ట్ర సమితి నుంచి ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు పాల్గొన్నారు. చర్చ జరుగుతుండగానే రవీందర్ రావు సహనాన్ని కోల్పోయారు. రాయడానికి వీలు లేని భాషలో మాట్లాడారు. దీంతో డిబేట్ నిర్వహిస్తున్న ఏబీఎన్ ప్రెజెంటర్ వెంకటకృష్ణ వెంటనే గెట్ అవుట్ ఆఫ్ మై డిబేట్ అంటూ రవీందర్రావును హెచ్చరించారు. అంతేకాదు రవీందర్రావు మైక్ కూడా చేశారు.
ఈ పరిణామాన్ని భారత రాష్ట్ర సమితి తీవ్రంగా పరిగణించింది. తమ అధికారిక ప్రసారాలు, ఇతర కార్యక్రమాలకు ఏబీఎన్ న్యూస్ ఛానల్ ప్రతినిధులను పిలవకూడదని తీర్మానం చేసింది. దీంతో తెలంగాణలో కలకలం నెలకొంది. ఏబీఎన్ ను గులాబీ పార్టీ పక్కన పెట్టడం ఇదే తొలిసారి కాదు. అయితే గతంలో తెలంగాణ ఏర్పడిన తొలి రోజుల్లో ఏబీఎన్ ప్రసారాలను పరోక్షంగా కెసిఆర్ నిలుపుదల చేసినట్టు అప్పట్లో రాధాకృష్ణ ఆరోపించారు. దీనిపై సుప్రీంకోర్టు దాకా వెళ్లారు రాధాకృష్ణ. ఆ తర్వాత పోరాడి మరి ఛానల్ పై నిషేధాన్ని ఎత్తి వేయించారు. ఆ తర్వాత కెసిఆర్, రాధాకృష్ణ మధ్య సానుకూల వాతావరణం ఏర్పడింది. అప్పట్లో కెసిఆర్ నిర్వహించిన ఆయత చండీయాగానికి రాధాకృష్ణను కెసిఆర్ ఆహ్వానించారు. రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి ఆఫీస్ కాలిపోతే పరామర్శించడానికి కేసీఆర్ స్వయంగా వెళ్లారు. అయితే ఇప్పుడు ఏబీఎన్ ను పక్కన పెట్టడంతో మరోసారి చర్చ మొదలైంది. అయితే ఈసారి గులాబీ పార్టీ మాట మీద నిలబడుతుందా? అనే ప్రశ్న అందరిలోనూ వ్యక్తమవుతోంది. ఈ ప్రశ్నకు సమాధానం కాలమే చెబుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.