Wine Shops Closed: వీకెండ్ రాగానే మద్యం తాగాలని చాలామందికి ఆసక్తి ఉంటుంది.రకరకాల మానసిక ఒత్తిళ్లు.. శారీరక అలసట ఉన్నవారు సైతం ఈవినింగ్ రెండు పెగ్గులు తాగనిది మనసున పట్టదు. అయితే ప్రతిరోజు మద్యం తాగేవారికి మద్యం షాపులు బంద్ అనే వార్త చాలా కష్టంగా ఉంటుంది. అందుకే కొన్ని ప్రత్యేక రోజుల్లో వైన్ షాపులు బంద్ చేసే విషయాన్ని ముందే ప్రకటిస్తారు. ప్రతి ఏడాదిలో అక్టోబర్ రెండు, స్వాతంత్ర, గణతంత్ర దినోత్సవం రోజున మద్యం షాపులు బందు చేస్తారు. అయితే వినాయక నిమజ్జనం సందర్భంగా కూడా వైన్ షాపులు మూసివేనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో వైన్ షాపులను ఒకటి నుంచి మూడు రోజులపాటు మూసివేయనున్నారు. మరి ఎక్కడ ఎన్ని రోజులు వైన్ షాప్ లు మూసివేయనున్నారు.. ఇప్పుడు తెలుసుకుందాం..
వినాయక నిమజ్జనం హైదరాబాదులో ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడ వేలకొద్దీ వినాయక విగ్రహాలు నిమజ్జనం జరుగుతూ ఉంటాయి. ప్రధానంగా హైదరాబాద్ లోని ట్యాంక్ బండి వద్ద విగ్రహ నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వినాయక విగ్రహాలు ఊరేగింపుగా ఇక్కడికి వస్తాయి. వీటిలో ఖైరతాబాద్ వినాయక విగ్రహం ఇక్కడికి రావడానికి ఎక్కువగా సమయం తీసుకుంటుంది. ఈ సందర్భంగా పోలీసులు పకడ్బందీగా బందోబస్తు నిర్వహిస్తారు. ఇప్పటికే నిమజ్జనం కు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇందులో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురు కాకుండా జాగ్రత్తలు పడుతున్నారు.
నిమజ్జనం రోజున హైదరాబాదులో సెలవులు ప్రకటించనున్నారు. అలాగే వైన్ షాప్ లు కూడా మూసివేనున్నారు. ఈసారి వైన్ షాప్ లను సెప్టెంబర్ 6వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 7 వ తేదీ ఉదయం 6 గంటల వరకు మూసివేయనున్నారు. అలాగే తెలంగాణలోని మిగతా ప్రాంతాల్లో కూడా వైన్ షాపులు మూసివేయనున్నారు. అదిలాబాద్, కరీంనగర్, సిద్దిపేట వంటి జిల్లాలో రెండు రోజులపాటు వైన్ షాపులు మూసి ఉండనున్నాయి. ఇక్కడ 4 వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ఆరవ తేదీ ఉదయం 6 గంటల వరకు మూసి ఉండనున్నాయి. హైదరాబాద్ మినహా మిగతా ప్రాంతాల్లో 5వ తేదీ నిమజ్జనం కార్యక్రమం నిర్వహించనున్నారు. అందుకే ఈ ప్రాంతాల్లో రెండు రోజులపాటు వైన్ షాపులు మూసివేయనున్నట్లు కలెక్టర్లు అధికారికంగా ప్రకటన జారీ చేశారు.
నిమజ్జనం రోజున వైన్ షాపులు ఓపెన్ చేస్తే అనుకోని సంఘటనలు జరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తుంటారు. అందుకే ప్రతి ఏడాది నిమజ్జనం రోజున వైన్ షాపులను మూసివేస్తారు. అయితే ఈసారి జిల్లాల్లో రెండు రోజులపాటు వైన్ షాపులు మూసివేయనున్నారు. హైదరాబాదులో మాత్రం ఒకరోజు వైన్ షాపులు మూసి ఉంటాయి.