https://oktelugu.com/

TS DSC: డీఎస్సీ, గ్రూప్‌ 2, 3 పరీక్షలు వాయిదా పడతాయా.. నిరుద్యోగుల పోరాటం ఫలిస్తుందా?

ముఖ్యంగా డీఎస్సీ పరీక్షలు జూలై 18 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఆగస్టు 5 వరకు నిర్వహించేందుకు ఉన్నత విద్యాశాఖ డీఎస్సీ నోటిఫికేషన్‌ సమయంలోనే స్పష్టం చేసింది. కానీ, టెట్‌ పరీక్ష ఫలితాలు జూన్‌ చివరి వారంలోనే వచ్చినందున తమకు డీఎస్పీ ప్రిపరేషన్‌కు గడువు కావాలని అభ్యర్థులు కోరుతున్నారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో విద్యార్థి సంఘాలు ఏబీవీపీ, బీఆర్‌ఎస్‌వీ ఆందోళన చేశాయి.

Written By:
  • Raj Shekar
  • , Updated On : July 11, 2024 / 09:15 AM IST

    TS DSC

    Follow us on

    TS DSC: సాధారణంగా నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫకేషన్ల కోసం పోరాటం చేస్తుంటారు. ప్రభుత్వంలో ఉన్న వివిధ శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆందోళనలు చేస్తారు. కానీ, తెలంగాణలో మాత్రం విచిత్ర పరిస్థితి నెలకొంది. ఇప్పటికే విడుదలైన ఉద్యోగ నోటిఫికేషన్ల పరీక్షలు వాయిదా వేయాలని పోరాడుతున్నారు. పది రోజులుగా ఉపాధ్యాయ ఉద్యోగార్థులు డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని ఆందోళనలు చేస్తున్నారు. ఇక విద్యార్థి సంఘాలు.. టీజీపీఎస్సీ ప్రకటించిన గ్రూప్‌ 2, 3 పరీక్షలు వాయిదా వేయాలని పట్టుపడుతున్నాయి..

    తగ్గేదే లేదంటున్న ప్రభుత్వం..
    ముఖ్యంగా డీఎస్సీ పరీక్షలు జూలై 18 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఆగస్టు 5 వరకు నిర్వహించేందుకు ఉన్నత విద్యాశాఖ డీఎస్సీ నోటిఫికేషన్‌ సమయంలోనే స్పష్టం చేసింది. కానీ, టెట్‌ పరీక్ష ఫలితాలు జూన్‌ చివరి వారంలోనే వచ్చినందున తమకు డీఎస్పీ ప్రిపరేషన్‌కు గడువు కావాలని అభ్యర్థులు కోరుతున్నారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో విద్యార్థి సంఘాలు ఏబీవీపీ, బీఆర్‌ఎస్‌వీ ఆందోళన చేశాయి. తర్వాత డీఎస్సీ అభ్యర్థులే రంగంలోకి దిగారు. ఉన్నతవిద్యాశాఖ కార్యాలయం ఉట్టడికి యత్నించారు. కానీ ప్రభుత్వం మాత్రం డీఎస్సీ పరీక్షల వాయిదాపై ఎలాంటి ఆలోచన చేయడం లేదు. ఒకవైపు డీఎస్సీ అభ్యర్థులు ఆందోళన చేస్తుండగానే షెడ్యూల్‌ మరోమారు ప్రకటించింది. జూలై 11వ తేదీ నుంచి హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని ప్రకటించింది. షెడ్యూల్‌ ప్రకారం జూలై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌ పద్ధతిలో పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేసింది.

    ఆందోళనలపై సీఎం ఆగ్రహం..
    ఇక డీఎస్సీ, గ్రూప్‌ 2, 3 పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్థి సంఘాలు చేస్తున్న ఆందోళనలపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. సంఘాల ఆందోళనల వెనుక భారీ కుట్ర ఉందని ఆరోపించారు. నిరుద్యోగులను బీఆర్‌ఎస్‌ రెచ్చబొడుతోందని పేర్కొన్నారు. ఉద్యోగుల పక్షాన పోరాడాలనుకుంటే.. కేటీఆర్, హరీశ్‌రావు ఆమరణ దీక్ష చేయాలని సూచించారు. నిరుద్యోగులను రెచ్చగొట్టడం మానుకోవాలన్నారు. షెడ్యూల్‌ ప్రకారమే పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేశారు.

    సోషల్‌ మీడియాలో ప్రచారం..
    ఇదిలా ఉంటే.. తెలంగాణలో గ్రూప్‌ 2, 3 పరీక్షలు వాయిదా వేసినట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. గ్రూప్‌–2 పరీక్ష నవంబర్‌ 17, 18వ తేదీకి, గ్రూప్‌–3 పరీక్ష నవంబర్‌ 24కు వాయిదా వేశారన్న వార్తలు సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవుతున్నాయి. వీటిపై తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీజీపీఎస్సీ) స్పందించింది. గ్రూప్‌ 2, 3 పరీక్షలు వాయిదా వేయలేదని స్పష్టం చేసింది. పరీక్షలు వాయిదా వేసినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది. సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని తెలిపింది. షెడ్యూల్‌ ప్రకారంగానే పరీక్షలు జరుగుతాయని తెలిపింది. పరీక్షల నిర్వహణకు ఇప్పటికే జిల్లాల వారీగా పరీక్ష కేంద్రాలను గుర్తించినట్లు పేర్కొంది. మరోవైపు పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేయాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది.

    పోస్టులు పెంచాలని…
    డీఎస్సీ, గ్రూప్‌ 2, 3 పరీక్షలు వాయిదా వేయాలని, ఇటీవల ప్రభుత్వం చేపట్టిన ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులతో ఖాళీ అయిన పోస్టులను కూడా డీఎస్పీలో కలపాలని విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ ఉద్యోగార్థులు కోరుతున్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య కూడా దీనిపై ప్రభుత్వానికి విన్నవించారు. ఇక గ్రూప్‌–2 పరీక్ష కూడా వాయిదా వేసి పోస్టుల సంఖ్య పెంచాలని గతకొద్ది రోజులుగా నిరుద్యోగులు నిరసన తెలుపుతున్నారు. ఇటీవల టీజీపీఎస్సీ కార్యాలయం ముట్టడికి కూడా యత్నించారు. ఎన్నిలక సమయంలో గ్రూప్‌–2 పోస్టులు 2 వేలకు పెంచుతామని కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చిందని గుర్తు చేస్తున్నారు. ఆమేరకు పోస్టులు పెంచిన తర్వాతనే పరీక్ష నిర్వహించాలని నిరుద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు.

    షెడ్యూల్‌ ప్రకారమే డీఎస్సీ, గ్రూప్‌ 2 పరీక్షలు..
    తెలంగాణలో గత ప్రభుత్వం 5వేల పైచిలుకు పోస్టులతో 2023 సెప్టెంబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక దానికి కొనసాగింపుగా పోస్టులను 11 వేల పైచిలుకు పోస్టుతలో మరో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తర్వాత టెట్‌ నిర్వహించింది. ఈ క్రమంలో పరీక్షలు జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు నిర్వహించాలని నిర్ణయించింది. ఈమేరకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో ఉపాధ్యాయ ఉద్యోగార్థులు డీఎస్పీ వాయిదాకు పట్టుపడుతున్నాయి. ప్రభుత్వం మాత్రం షెడ్యూల్‌ ప్రనకారం డీఎస్పీ పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపుతోంది. ఈమేరకు గురువారం(జూలై 11న) హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌లో ఉంచుతామని తెలిపింది. ఇక తెలంగాణలో 783 పోస్టులతో గ్రూప్‌–2 నోటిఫికేషన్‌ను టీజీపీఎస్సీ గతేడాది ప్రకటించింది. 2023, జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులు స్వీకరించింది. ఈ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5.51 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.ఇప్పటికే మూడు సార్లు ఈ పరీక్షలు వాయిదా పడగా.. ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ వాయిదా వేయబోమని టీజీపీఎస్సీ తేల్చి చెప్పింది. ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్‌ 2 పరీక్షలు జరగనున్నాయి.