Telangana HYDRA : హైదరాబాద్ మహానగరం, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోని చెరువులను, కుంటలను, నాలాలను, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసింది. దీనికి సీనియర్ ఐపీఎస్ రంగనాథ్‌ను కమిషనర్‌గా నియమించింది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో అక్రమంగా నిర్మించిన వారి గుండెల్లో హైడ్రా దడ పుట్టిస్తోంది. హైడ్రా వ్యవస్థ ఏర్పాటు నుంచే దూకుడుగా వెళ్తోంది. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. ఇప్పటివరకు అలా.. వందలాది నిర్మాణాలను కూల్చివేయగా.. ప్రభుత్వానికి వెయ్యి ఎకరాలకు పైగా భూమిని రికవరీ చేశారు. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరినీ ఒకే తీరులో చూస్తే అక్రమ కట్టడాలు కనిపిస్తే వాటిని కూల్చుతూ ముందుకు సాగుతోంది.
ఇప్పటివరకు ఎలాంటి సిబ్బంది, ఎలాంటి అధికారాలు లేనప్పటికీ హైడ్రా ఓ స్థాయిలో దూసుకుపోయింది. తాజాగా.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హైడ్రాకు మరింత బలాన్ని చేకూర్చింది. నిన్నటి కేబినెట్‌లో హైడ్రాకు అడిషనల్ పవర్స్ ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దాంతో ఇప్పటికే ఎక్కడా తగ్గకుండా దూసుకెళ్తున్న హైడ్రా.. కేబినెట్ నిర్ణయంతో తన దూకుడును మరింత పెంచనుంది. ఇప్పుడు దానికి విస్తృత అధికారాలతో పాటు చట్టబద్ధతను కూడా ఇచ్చారు. చెరువులతోపాటు గ్రేటర్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను తొలగించే వరకూ హైడ్రాకు విశేష అధికారాలు అలానే ఉంటాయని కేబినెట్ స్పష్టం చేసింది. అయితే.. కేబినెట్‌లో మరో నిర్ణయం తీసుకున్నారు. హైడ్రా పరిధిని ఔటర్ రింగ్ రోడ్డు లోపల 27 అర్బన్, లోకల్ బాడీలకు విస్తరించింది. 51 గ్రామపంచాయతీలను కూడా కోర్ అర్బన్‌లో విలీనం చేస్తూ నిర్ణయం తీసకున్నారు. అలాగే.. ఇప్పటివరకు కేవలం ఒక్క కమిషనర్ రంగనాథ్ మాత్రమే అన్నీతానై ఇదంతా నడిపించారు. కానీ.. తాజాగా ప్రభుత్వం అదనంగా సిబ్బందిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి హైడ్రా ఆపరేషన్స్ కోసం 150 మంది అధికారులతోపాటు 964 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని కేటాయించారు.
ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. హైడ్రా ఏర్పాటు నుంచి రేవంత్ రెడ్డి సర్కార్ పలు విమర్శలు, పలు ప్రశంసలు ఎదుర్కొంటోంది. హైడ్రా ఆపరేషన్స్ బాగుందని చాలా వరకు వినిపిస్తుండగా.. మరికొంత మంది నుంచి మాత్రం పేదల కడుపు కొట్టడానికే హైడ్రా తెచ్చారనే విమర్శలు వచ్చాయి. అయితే.. చాలా జిల్లాల నుంచి కూడా హైడ్రాను తమ జిల్లాల్లోనూ ఏర్పాటు చేయాలనే డిమాండ్ వినిపించింది. అటు పొరుగు రాష్ట్రమైన ఏపీ నేతల నుంచి కూడా హైడ్రా పై ప్రశంసలు వచ్చాయి. అందులోభాగంగానే తాజాగా.. రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాకు విశేషాధికారాలు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే.. ఈ నిర్ణయంతో రేవంత్ రెడ్డి సర్కారుకు ప్లస్ కానుందా..? మైనస్ కానుందా..? అనే చర్చ సైతం జోరుగా నడుస్తోంది. పొలిటికల్ లీడర్లు హైడ్రాను ముందు నుంచీ వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ సైతం హైడ్రాపై అసంతృప్తితోనే ఉన్నాయి. పర్మిషన్లు తీసుకున్న వారి ఇళ్లను ఎలా కూల్చివేస్తారంటే నిలదీస్తున్నారు. వీటన్నింటి నేపథ్యంలో ముందు ముందు హైడ్రా పనితీరు ఇంకా ఎలా ఉండబోతోంది..? వచ్చిన అధికారాలను ఎలా వినియోగించుకోబోతోందో అని ఆసక్తి నెలకొంది.
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read More