Emergency Movie : ఆ సినిమాపై రేవంత్ రెడ్డికి ఎందుకు అంత కోపం.. తెలంగాణలో ప్రదర్శించకుండా నిషేధం

ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ఎమర్జెన్సీ అనే సినిమా రూపొందింది.. ఈ సినిమా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో విధించిన అత్యవసర పరిస్థితికి దారి తీసిన సంఘటనలు, ఎమర్జెన్సీ సమయంలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు.. ఇందిరా గాంధీ మరణం వంటి విషయాలను ఈ సినిమాలో చూపించారు.

Written By: Anabothula Bhaskar, Updated On : August 30, 2024 2:11 pm

Emergency  Movie

Follow us on

Emergency  Movie :అప్పట్లో అంటే భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు రజాకార్ పేరుతో ఓ సినిమా నిర్మితమైంది. నాటి నిజాం ప్రభుత్వ హయాంలో జరిగిన అకృత్యాలను వివరిస్తూ నిర్మించిన సినిమా అది. దానిని తెలంగాణలో విడుదల కాకుండా అప్పటి ప్రభుత్వ పెద్దలు అడ్డుకున్నారు.. అప్పట్లో అది పెద్ద సంచలనమైంది. సరిగ్గా ఇన్నాళ్లకు తెలంగాణ రాష్ట్రంలో ఓ సినిమా విడుదల కాకుండా ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.

ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ఎమర్జెన్సీ అనే సినిమా రూపొందింది.. ఈ సినిమా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో విధించిన అత్యవసర పరిస్థితికి దారి తీసిన సంఘటనలు, ఎమర్జెన్సీ సమయంలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు.. ఇందిరా గాంధీ మరణం వంటి విషయాలను ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల విడుదలైన ట్రైలర్ లో అవే విషయాలను వెల్లడించారు.. పైగా కంగనా బిజెపి ఎంపీ కావడంతో.. ఒక్కసారిగా ఈ సినిమాపై వివాదం నెలకొంది. అయితే ఈ సినిమాను తెలంగాణలో ప్రదర్శించకూడదని మాజీ ఐపీఎస్ అధికారి తేజ్ దీప్ కౌర్ మీనన్ ఆధ్వర్యంలో తెలంగాణ సిక్కు సొసైటీ ప్రతినిధుల బృందం సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని కలిసింది. సిక్కు సమాజాన్ని కించపరిచే విధంగా ఈ సినిమాలో దృశ్యాలు ఉన్నాయని.. ఈ సినిమా స్క్రీనింగ్ నిలిపివేయాలని 18 మంది సభ్యులు ప్రతినిధి బృందం షబ్బీర్ అలీకి వినతి పత్రం అందించింది..”ఈ సినిమాలో సిక్కులను తీవ్రవాదులుగా చూపించారు. దేశ వ్యతిరేకులుగా చిత్రీకరించారు. ఇది సరైన చర్య కాదు. పైగా సిక్కుల సమాజ ప్రతిష్టను దెబ్బతీస్తుంది. ఈ విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని” వారు షబ్బీర్ కు విన్నవించారు. ఈ విషయాన్ని షబ్బీర్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో.. తెలంగాణ రాష్ట్రంలో ఈ చిత్రాన్ని ప్రదర్శించకుండా నిషేధం విధించే అంశాన్ని పరిశీలిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

కంగనా స్వీయ దర్శకత్వంలో..

ఎమర్జెన్సీ సినిమాలో కంగనా కీలకపాత్రలో నటిస్తోంది.. ఈ సినిమాను ఆమె తన స్వీయ దర్శకత్వంలో రూపొందించింది.. ఈ సినిమాలో ఆమె స్వర్గీయ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ పాత్రను పోషించింది. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరిగింది. కంగనా ఎంపీగా పోటీ చేయడంతో కొద్దిరోజులు షూటింగ్ కు అంతరాయం ఏర్పడింది. ఒకవేళ ఆమె గనుక ఆ సమయంలో షూటింగ్ లో పాల్గొని ఉంటే ఈపాటికి ఈ సినిమా విడుదలయ్యేది. ఇక అనేక అవాంతరాలు ఎదుర్కోవడంతో ఈ చిత్రం పలుమార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు సెప్టెంబర్ 6న విడుదల కానుంది. ఈ సినిమా ను విడుదల చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ” ఎమర్జెన్సీ కాలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందిరా గాంధీ ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో తెలుసు.. ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 99 పార్లమెంటు స్థానాలను గెలుచుకుంది. ఉప ఎన్నికల్లోనూ సత్తా చాటింది. దీనిని జీర్ణించుకోలేక బిజెపి ఏవేవో ప్రయత్నాలు చేస్తోంది. ఇవన్నీ సరికాదు. ఈ సమయంలో ఇందిరా గాంధీ ప్రతిష్టను కించపరిచే విధంగా సినిమాను తీయడం దారుణం. వెంటనే ఈ సినిమాను విడుదల చేయడం మానుకోవాలి. విడుదల కాకుండా నిషేధం విధించాలని” కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు..”తెలంగాణ రాష్ట్రంలో ఎమర్జెన్సీ సినిమాను విడుదల చేయకుండా నిషేధం విధిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఇదే నిర్ణయాన్ని మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అమలు చేస్తే బాగుంటుంది. ఇలాంటి సినిమా వల్ల వివిధ వర్గాలలో వైషమ్యాలు చోటుచేసుకునే ప్రమాదం ఉంది. సిక్కు సమాజం కూడా అదే విషయాన్ని వ్యక్తం చేసిందని” కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.