https://oktelugu.com/

Konda Surekha Comments : కొండా సురేఖ కామెంట్స్.. పవన్, బాలకృష్ణ మాట్లాడరెందుకు? కారణం ఏంటి?

తెలుగు రాష్ట్రాల్లో కొత్త వివాదం ముదురుతోంది. చిత్ర పరిశ్రమకు చెందిన అక్కినేని కుటుంబం పై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ముప్పేట దాడి కొనసాగుతోంది. అయితే ఇంతలా వివాదం జరుగుతున్నా చిత్ర పరిశ్రమకు చెందిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది.

Written By:
  • Dharma
  • , Updated On : October 4, 2024 / 11:07 AM IST

    Konda Surekha Comments

    Follow us on

    Konda Surekha Comments : అక్కినేని కుటుంబం పై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేకెత్తిస్తున్నాయి. పెను దుమారానికి దారితీస్తున్నాయి. దీనిపై రాజకీయ సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఆమె తీరును తీవ్రంగా తప్పు పడుతున్నారు. అయితే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు కొండా సురేఖ ప్రకటించారు. కానీ సినీ ప్రముఖులు మాత్రం శాంతించలేదు. దాదాపు తెలుగు చిత్ర పరిశ్రమ అంతా స్పందించినా.. ఏపీ డిప్యూటీ సీఎం తో పాటు టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించకపోవడం హాట్ టాపిక్ అవుతోంది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి పవన్ ఎందుకు స్పందించలేదు అన్న చర్చ అయితే నడుస్తోంది. కేటీఆర్ పై కామెంట్స్ చేసిన తరుణంలో కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సమంత, నాగచైతన్య విడాకులకు కేటీఆర్ కారణమని ఆరోపణలు చేశారు. దీనిపై అక్కినేని కుటుంబంతో పాటు సమంత కూడా తీవ్రంగా స్పందించారు. దాదాపు టాలీవుడ్ ప్రముఖులంతా దీనిని ఖండిస్తూ అభిప్రాయాలను తెలియజేశారు. బాలీవుడ్ తో పాటు తమిళ, మలయాళ ఇండస్ట్రీలతో పాటు పలువురు ప్రముఖులు దీనిపై స్పందించారు. సినీ తారల జోలికి రావొద్దు అంటూ హెచ్చరించారు. చిరంజీవితో పాటు మెగా కుటుంబం అంతా దీనిపై స్పందించినా..పవన్ ఇంతవరకుస్పందించకపోవడం మాత్రం ఓకెంత ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది.

    * హైడ్రాను అభినందించిన పవన్
    కొద్ది రోజుల కిందటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని పవన్ కళ్యాణ్ కలిశారు. ఈ సందర్భంగా ఆత్మీయంగా సన్మానం కూడా పొందారు. హైడ్రా కూల్చివేతలను ఆహ్వానించారు. రేవంత్ రెడ్డి ని అభినందించారు. అయితే అదే క్యాబినెట్ కు చెందిన ఓ మహిళ మంత్రి.. చిత్ర పరిశ్రమకు చెందిన కుటుంబంతో పాటు నటి పై అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. ఈ తరుణంలో ముందుగా పవన్ స్పందిస్తారని అంతా భావించారు. కానీ ఈ వివాదం జరిగి సదరు మంత్రి తన మాటలను ఉపసంహరించుకున్నా.. పవన్ నుంచి ఎటువంటి ప్రకటన లేకపోవడం విశేషం. సాధారణంగా మహిళల అభ్యున్నతి, గౌరవ మర్యాదల గురించి పవన్ గట్టిగానే మాట్లాడతారు. అటువంటిది సమంత వివాదంలో ఎందుకు మాట్లాడలేదు అన్నది ఇప్పుడు ప్రశ్న.

    * బాలయ్య స్పందించక పోవడానికి అదే కారణం
    నందమూరి బాలకృష్ణ మౌనం వెనుక కూడా అనేక రకాల చర్చ నడుస్తోంది. నందమూరి, అక్కినేని కుటుంబాల మధ్య సంబంధాల గురించి తెలియంది కాదు. ఆ రెండు కుటుంబాల మధ్య మంచి సన్నిహిత సంబంధాలు కొనసాగుతూ వచ్చాయి. అయితే రేవంత్ రెడ్డి తో బాలకృష్ణకు ఉన్న అనుబంధంతోనే ఆయన మాట్లాడడం లేదన్న ప్రచారం సాగుతోంది. మరోవైపు ఇటీవల ఏఎన్ఆర్ కుటుంబంతో బాలకృష్ణకు గ్యాప్ ఏర్పడింది. అది కూడా కారణం అయి ఉంటుందన్న చర్చ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ ఎపిసోడ్ ను ముగించాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక విజ్ఞప్తి వచ్చింది. కానీ రగడ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.