Komati Reddy Brothers : తెలంగాణ కాంగ్రెస్ లో కోమటిరెడ్డి బ్రదర్స్ ‘హవా’కి రేవంత్ జమానా మొదలయ్యాక బ్రేక్ పడింది. స్వరాష్ట్రంలో కాంగ్రేస్ అధికారంలోకి వస్తే సీఎం కుర్చీ తమకేనంటూ ఉధృత ప్రచారం చేసుకున్నా , పేలవమైన వ్యూహాలు, గతితప్పిన ఎత్తుగడలతో ప్రభావం కోల్పోయారు. రేవంత్ రెడ్డి పార్టీలో చేరడం మొదలు సీఎం అయ్యేంతవరకు బహిరంగంగా ఆయన్ని వ్యతిరేకిస్తూ వచ్చిన బ్రదర్స్ ఆ స్థాయిలో పార్టీలో పట్టు సాధించలేకపోవడంతో ప్రతిష్ట కోల్పోయారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన కొత్తలో మాజీ సీఎం వైఎస్ అనుచరులుగా, తెలంగాణ కాంగ్రెస్కి పెద్ద దిక్కుగా ఉంటామని చెప్పినా ఆచరణలో క్యాడర్ని నిలబెట్టుకునే చర్యలు చేపట్టకపోవడం కోమటిరెడ్డి బ్రదర్స్ కి మైనస్ పాయింట్. మరోవైపున రేవంత్ కి పీసీసీ పగ్గాలిచినప్పుడు బహిరంగంగా వ్యతిరేకిస్తూ, డబ్బులిచ్చి పీసీసీ పదవి తెచుకున్నాడని అటు అధిష్టానం పరువుని బజారుకి ఈడవడంతో పాటు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ని వీడి బీజేపీ లో చేరడంతో బ్రదర్స్ పార్టీలో విశ్వాసం కోల్పోయారు.తన చేరికతో తెలంగాణ లో బీజేపీ బలోపేతం అవుతుందని, కాంగ్రెస్ ని ఖాళీ చేస్తానని డైలాగులు వేసిన రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి పాలవడంతో అభాసుపాలయ్యారు. చివరకు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తున్నదనే వాతావరణంతో అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి , ఖమ్మం నేత పొంగులేటి ద్వారా రాజగోపాల్ మళ్ళీ హస్తం గూటికి చేరినా పార్టీలో గతంలో ఉన్న పట్టు కోల్పోయారు.
■ వ్యూహాత్మకంగా కోమటిరెడ్డి బ్రదర్స్ ను కట్టడి చేసిన రేవంత్:
కోమటిరెడ్డి బ్రదర్స్ ఒకవైపు స్వీయ తప్పిదాలతో ఒక్కొమెట్టు దిగుతూ వస్తే, రేవంత్ రెడ్డి తనదైన వ్యూహాలతో బ్రదర్స్ ని కట్టడి చేశారు. రాష్ట్రంలో నాయకత్వం దేవుడెరుగు సొంత జిల్లా నల్లగొండలోనే కోమటిరెడ్డి సోదరులకు ధీటుగా తన టీమ్ ని బలోపేతం చేసుకున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ అడ్డుపడకుండా వారిని నొప్పించకుండా బీఆర్ఎస్ నుంచి వేముల వీరేశం, మందుల సామెల్ కి కాంగ్రెస్ కండువా కప్పడమే కాకుండా ఎమ్మెల్యే టికెట్లిచ్చి గెలిపించుకున్నారు. మరోవైపు పార్టీ వీడి వెళ్లిన కుంభం అనిల్ రెడ్డి ని మళ్ళీ వెనక్కి రప్పించి టికెట్ ఇచ్చి తన ఖాతాలో వేసుకున్నాడు. ఏకైక బీసీ అభ్యర్థిగా బీర్ల ఐలయ్య కి టికెట్ ఇచ్చి గెలిపిచుకోవడమే కాకుండా విప్ గా అవకాశం కల్పించి తన వైపు తిప్పుకున్నాడు. ఇంకోవైపు తనకు కాంగ్రెస్ లో అండగా నిలిచిన సీనియర్ నేత జానారెడ్డి తనయులు, తన స్నేహితులైన రఘువీర్, జయవీర్ ని యంపీ, ఎమ్మెల్యేలుగా తెరమీదకు తెచ్చాడు. తన ఇంకో స్నేహితుడు చామల కిరణ్ రెడ్డి ని భువనగిరి ఎంపీగా గెలిపించుకొని కోమటిరెడ్డి బ్రదర్స్ పై పై చేయి సాధించారు.
■ శాసనమండలి చైర్మన్ వద్ద ఇంకో అధికార కేంద్రం ఏర్పాటు:
కోమటిరెడ్డి బ్రదర్స్ కి మొదటి నుంచి సరైన సంబంధాల్లేని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కండువా కప్పుకోకుండా కాంగ్రెస్కి మద్దతు ఇస్తుండడం తో నల్గొండ లో బ్రదర్స్ కి పోటీగా మరో పవర్ పాయింట్ ఏర్పాటైనట్లే. సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి కి ఇటీవలే రాష్ట్ర డైరీ డేవోలప్మెంట్ ఫెడరేషన్ చైర్మన్ గా నియమితులయ్యారు. ఈ నియామకం బ్రదర్స్కి కంటగింపు కలిగించినా చేసేదేమీలేక మిన్నకుండిపోయారు. మరో వైపు తనతో పాటు కాంగ్రెస్ లో చేరి, అసెంబ్లీ టికెట్లు పొందలేకపోయిన పూర్వపు టీడీపీ నేతలు పటేల్ రమేష్ రెడ్డి, బండ్రు శోభారాణి కి కార్పొరేషన్ల చైర్మన్ పదవులు, పాల్వాయి రజనీకుమారికి టీఎస్ పీఎస్సీ సభ్యురాలిగా అవకాశాలు కల్పించారు. వెంకట రెడ్డి కి మంత్రి పదవి ఇచ్చి రాజగోపాల్ కి రేవంత్ చెక్ పెడితే , మరోవైపున అదే జిల్లాలో, అదే సామజిక వర్గం, ఇంకో సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి కి కీలకమైన శాఖలిచి అధిష్టానం ఆయనకి గుర్తింపు ఇచ్చింది. మొత్తంగా అటు అధిష్టానం వద్ద ప్రాబల్యం కోల్పోవడం, ఇటు రేవంత్ వ్యూహాలు ముందు చతికలబడడం, అటు క్యాడర్ లో విశ్వాసం కోల్పోవడంతో ప్రస్తుతానికి కోమటిరెడ్డి బ్రదర్స్ నల్లగొండ కె పరిమితం అవ్వాల్సిన అనివార్యస్థితిని ఎదుర్కొంటున్నారు.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read More