GHMC New Commissioner: ఏపీకి వెళ్లకుండా తెలంగాణలోనే కొనసాగేలా ఐఏఎస్‌లు చేసిన ప్రయత్నాలకు బ్రేకులు పడ్డాయి. ఆమ్రపాలి, రోనాల్డ్ రోస్, వాకాటి కరుణ సహా ఏడుగురు ఐఏఎస్‌లు దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. దీంతో నలుగురు ఐఏఎస్‌లు ఏపీకి వెళ్లాల్సిన తప్పనిసరి పరిస్థితులు ఏర్పడ్డాయి. దాంతో నిన్ననే తెలంగాణ ప్రభుత్వం కూడా వారిని రిలీవ్ చేయాల్సి వచ్చింది. ఆ నలుగురు కూడా తక్షణమే ఏపీలో రిపోర్టు చేయాల్సి ఉండడంతో.. ఎక్కడా ఆలస్యం జరగకుండా అన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే.. ఈ నలుగురిలో ఆమ్రపాలి కాటా జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఉన్నారు. అలాగే.. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీగానూ కొనసాగుతున్నారు. వాకాటి కరుణ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శిగా, వాణీప్రసాద్ యువజన సర్వీసులు, టూరిజం, కల్చరల్ డిపార్ట్‌మెంట్ ప్రధాన కార్యదర్శిగా, రొనాల్డ్ రోస్ విద్యుత్ శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.
ఈ నాలుగు స్థానాలు కూడా కీలకమే కావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాటిని ఎవరితో భర్తీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. అందులోనూ ముఖ్యంగా జీహెచ్ఎంసీ కమిషనర్ స్థానంపైనే ఇప్పుడు అందరి దృష్టి పడింది. 2013 వరకు కేంద్ర సర్వీసులోనే ఉన్న ఆమ్రపాలిని ఆ తరువాత కేంద్రానికి లేఖ రాసి రాష్ట్రానికి రప్పించారు. ఇప్పుడు ఆమె ఏపీకి వెళ్లిపోవడంతో ఆ పోస్టును ఎవరితో భర్తీ చేస్తారని అధికార వర్గాల్లో టాక్ నడుస్తోంది. ప్రస్తుతానికి ఇన్చార్జి బాధ్యతలను సర్ఫరాజ్ అహ్మద్‌కు అప్పగించారు. గతంలో జీహెచ్ఎంసీలో అడిషనల్ కమిషనర్‌గా పనిచేసిన వారిలో సీనియర్‌కు కమిషనర్ బాధ్యతలు అప్పగించాలని రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో దాసరి హరిచందన, భారతి హోలికేరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
మరోవైపు.. జలమండలి ఎండీగా పనిచేసిన వారిని కూడా జీహెచ్ఎంసీ కమిషనర్‌గా నియమించిన దాఖలాలు ఉన్నాయి. గతంలో జలమండలి ఎండీగా పనిచేసిన దానకిషోర్, జనార్దన్ రెడ్డిలకు జీహెచ్ఎంసీ కమిషనర్‌గా అవకాశం దక్కింది. ఏపీ నుంచి శివశంకర్, సృజన తెలంగాణకు వచ్చి బుధవారం సాయంత్రమే సీఎస్ శాంతికుమారకి రిపోర్టు చేశారు. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ పోస్టు వీరిలో ఎవరికైనా దక్కుతుందా అన్న సందేహాలు కూడా వినిపిస్తున్నాయి.
ఇవన్నీ ఇలా ఉంటే.. హైడ్రా కమిషనర్‌గా ఉన్న రంగనాథ్‌కు ఇన్చార్జి ఇస్తారనే టాక్ కూడా నడుస్తోంది. ఇప్పటికే హైడ్రాకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీలు అధికారాలను బదలాయించారు.దాంతో హైడ్రాను మరింత పటిష్టం చేశారు. ఈ క్రమంలో రంగనాథ్‌కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడంపైనా ప్రభుత్వంలో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ రంగనాథ్‌ను ఇన్చార్జిగా నియమిస్తే హైడ్రాతోపాటు ఆయన జీహెచ్ఎంసీ అదనపు బాధ్యతలు కానున్నాయి. దాంతో అక్రమ కట్టడాల విషయంలో ఇక స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కూడా దొరకనుంది. ప్రధానంగా మూసీ ప్రక్షాళన, వచ్చే గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పెద్దలు ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఆమ్రపాలి స్థానంలో కొత్తవారిని నియమించడమా..? లేదంటే గట్టి పర్సన్‌కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడమా అని సతమతం అవుతున్నట్లుగా సమాచారం.