KTR Comments : ఏపీలో వరద సహాయ చర్యలపై ఇక్కడి విపక్షం విమర్శిస్తుంటే.. పొరుగు రాష్ట్రంలోని విపక్షం మాత్రం ప్రశంసిస్తోంది. విజయవాడలో దారుణ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. దాదాపు నగరమంతా వరద ముంపు లో ఉంది. ప్రభుత్వం తరఫున సహాయ చర్యలు జరుగుతున్నాయి. స్వయంగా చంద్రబాబు విజయవాడ కలెక్టరేట్లో బస చేశారు. అక్కడే బస్సులో ఉండి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. నేరుగా బాధిత ప్రాంతాలను సందర్శిస్తున్నారు. అర్ధరాత్రి పర్యటనలు చేస్తున్నారు. వీలైనంతవరకు బాధిత ప్రాంతాల్లో గడిపేందుకు ప్రయత్నిస్తున్నారు. తద్వారా అధికారులు సైతం పరుగులు పెడతారని భావిస్తున్నారు. మరోవైపు వైసీపీ అధినేత జగన్ బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. చంద్రబాబు వైఖరి వల్లే విజయవాడ నగరానికి ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపణలు చేశారు.సహాయ,పునరావాస చర్యల్లో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.అయితే తెలంగాణలో ప్రతిపక్ష నేత కేటీఆర్ మాత్రం చంద్రబాబు చర్యలను ప్రశంసించారు.ఏపీలో వరద సహాయ స్థితిగతుల పర్యవేక్షణ, బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, ఆహార పదార్థాల పంపిణీ వంటి చర్యల విషయంలో చంద్రబాబు సర్కార్ అనుసరిస్తున్న తీరును అభినందించారు. సీఎం అంటే అలా ఉండాలి అనేలా మాట్లాడారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని తక్కువ చేసి చూపేలా చంద్రబాబును కేటీఆర్ ప్రశంసించడం విశేషం. ఇక్కడ విపక్ష నేత జగన్ చంద్రబాబు చర్యలను తప్పు పట్టినా.. తెలంగాణలో అతని రాజకీయ స్నేహితుడు కేటీఆర్ మాత్రం ప్రశంసించడం వైసీపీ శ్రేణులకు ఎంత మాత్రం మింగుడు పడడం లేదు.
* చాలాసార్లు ప్రశంసించిన కేటీఆర్
అయితే చంద్రబాబును కేటీఆర్ ప్రశంసించడం ఇదే తొలిసారి కాదు. చాలా సందర్భాల్లో చంద్రబాబు చర్యలను అభినందించారు కేటీఆర్. ఆయన ఆలోచన తీరును ప్రశంసించిన సందర్భాలు అధికం. అయితే ఏపీలో జగన్ సర్కార్ చంద్రబాబును అరెస్టు చేసిన సమయంలో కేటీఆర్ కొంచెం భిన్నంగా వ్యవహరించారు. దీంతో తెలంగాణ ఎన్నికల్లో ఆ ప్రభావం కనిపించింది. బిఆర్ఎస్ కు ప్రతికూల ఫలితాలు రావడం వెనుక చంద్రబాబు విషయంలో.. తాము నడుచుకున్న వ్యవహారం కూడా కారణమని తరువాత బీర్ఎస్ నేతలు గుర్తించారు. అందుకే చంద్రబాబు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ వచ్చారు. ఇప్పుడు ఏకంగా వరద సహాయ చర్యల్లో చంద్రబాబు చొరవ పై ప్రశంసించారు. తన ట్విట్టర్ ఖాతాలో అభినందించారు. అయితే రేవంత్ రెడ్డి చర్యలను తప్పు పడుతూ మాత్రమే చంద్రబాబును ప్రశంసించడం విశేషం.
* మంచి ప్రయత్నం
గత రెండు రోజులుగా విజయవాడ కలెక్టరేట్లో గడుపుతున్నారు చంద్రబాబు. నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఏకంగా ఆరు హెలికాప్టర్లు, 150 రెస్క్యూ బోట్లతో సహాయ చర్యలు చేపడుతున్నారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, వారికి సరైన ఆహార పదార్థాలను అందించడం వంటివి చేపడుతున్నారు. డ్రోన్ల ద్వారా సైతం ఆహారాన్ని, నిత్యవసరాల కిట్లను పంపిస్తున్నారు. దానినే గుర్తు చేస్తున్నారు కేటీఆర్. చంద్రబాబు చర్యలను ప్రతి ఒక్కరూ మెచ్చుకుని తీరాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. ఏపీ ప్రజల ప్రాణాలను కాపాడుతూ వారికి తగిన సహాయం చేయడంలో అక్కడి ప్రభుత్వం ముందంజలో ఉందని కొనియాడారు కేటీఆర్.
* జగన్ చెబుతున్నది తప్పు అనేలా
అయితే నిన్ననే బాధిత ప్రాంతాల్లో పర్యటించారు వైసీపీ అధినేత జగన్. బాధితుల పరామర్శకు కేటాయించిన సమయం కంటే.. చంద్రబాబు సర్కార్ పై విమర్శలకి ఎక్కువ సమయాన్ని కేటాయించారు. అధికారంలో ఉన్నప్పుడు మీడియాకు దూరంగా ఉండే జగన్.. అదే మీడియాకు పిలిచి మరి మాట్లాడడం విశేషం. అయితే జగన్ చంద్రబాబు సర్కార్ పై విమర్శించిన కొద్ది గంటల్లోనే కేటీఆర్ స్పందించారు. జగన్ చెప్పినది తప్పు అనేలా మాట్లాడారు. వరద బాధిత ప్రాంతాల్లో చంద్రబాబు చేపడుతున్న చర్యలను అభినందించాల్సిందేనని తేల్చి చెప్పారు. దీంతో వైసీపీలో కేటీఆర్ పై ఒకరకమైన ఆగ్రహం కనిపిస్తోంది. ఏపీలో తమ ప్రత్యర్థిని పొగుడుతావా అన్నట్టు వారు వ్యవహరిస్తున్నారు. అదేపనిగా సోషల్ మీడియా వేదికగా కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు.