BRS: గత మెంతో ఘనం.. నేడు మాత్రం అధ్వానం.. ఇప్పుడు ఈ మాట తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితికి అచ్చు గుద్ది నట్టు సరిపోతుంది. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 2014లో భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత రాజకీయ పరిణామాలను.. రాజకీయ పరిస్థితులను పూర్తిగా తనకు అనుకూలంగా మార్చుకుంది. రాజకీయ పునరేకీకరణ పేరుతో ప్రతిపక్ష పార్టీలలో ఉన్న ఎమ్మెల్యేల కొంతమందిని తన పార్టీలో చేర్చుకుంది. ఆ తర్వాత జరిగిన అనేక ఎన్నికల్లో గులాబీ పార్టీ ఏకపక్ష విజయాలను సాధించింది. మున్సిపల్ ఎన్నికల్లో కూడా అన్నింట్లో గెలుపు సాధించడానికి ఏకంగా నిబంధనలు కూడా సవరించింది. సరికొత్త విధానాలను తెరపైకి తీసుకొచ్చింది.
2014లో అధికారంలోకి వచ్చిన గులాబీ పార్టీ.. 2018లో కూడా అదే స్థాయిలో అధికారాన్ని దక్కించుకుంది. తద్వారా తెలంగాణ రాష్ట్రంలో రెండుసార్లు అధికారాన్ని అనుభవించింది. తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి ఏలుబడిలో అనేక రకాల విమర్శలు వచ్చాయి. ఆరోపణలు కూడా వినిపించాయి. వీటన్నిటిని కాంగ్రెస్ పార్టీ జనంలోకి బలంగా తీసుకెళ్లగలిగింది. ఫలితంగా 2023లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.
ఉప ఎన్నికలు.. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చూపించింది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికలు జరిగాయి. 116 మున్సిపాలిటీలతో పాటు, ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఏడు కార్పొరేషన్లలో ఐదు కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంటుందని.. బిజెపి, సిపిఐ చెరొక కార్పొరేషన్ లో విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ లో వచ్చేవి వాస్తవం కాదని గులాబీ పార్టీ నేతలు వాదిస్తున్నారు. అయితే గతంలో అనేక సంస్థలు ఎన్నికలు జరిగినప్పుడు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఆ సమయంలో వాస్తవానికి దగ్గరగా ఫలితాలను చెప్పాయి. భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ను ఆ పార్టీకి అనుకూలంగా వెల్లడించాయి.
కార్పొరేషన్ లను భారత రాష్ట్ర సమితి గెలుచుకునే అవకాశం లేదని దాదాపుగా తేలిపోయింది. ఈ నేపథ్యంలో 2024 లో జరిగిన ఎన్నికల్లో ఒక్క పార్లమెంటు స్థానాన్ని కూడా గులాబీ పార్టీ గెలుచుకోలేకపోయింది. ఆ పార్టీ చరిత్రలో తొలిసారిగా సున్నా స్థానాలు వచ్చాయి. ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఆ పార్టీకి 0 ఫలితాలు వస్తున్నాయి. దీంతో భారత రాష్ట్ర సమితి భవితవ్యం ఏమిటో అర్థం కావడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
కేటీఆర్, హరీష్ రావు ముందుండి పార్టీని నడిపిస్తున్నారు. కల్వకుంట్ల కవిత పార్టీ నుంచి బయటికి వచ్చి అనేక రకాల విమర్శలు చేస్తున్నారు. పార్టీ నాయకత్వం తీరును ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ పై.. హరీష్ రావు పై విమర్శలు చేయడంలో ఆమె ఏమాత్రం తగ్గడం లేదు. హరీష్ రావును ఏకంగా ఆమె గుంట నక్క అని పోల్చుతున్నారు. ఈ క్రమంలో ఆమె ఆరోపిస్తున్నట్టుగానే భారత రాష్ట్ర సమితి పనితీరు ఉంటున్నది. కేటీఆర్ సోషల్ మీడియాలో మాత్రమే పార్టీకి బలం ఉన్నట్టు చూపిస్తున్నారని.. క్షేత్ర స్థాయిలో మాత్రం అందుకు విరుద్ధమైన ఫలితాలు వస్తున్నాయని.. ఇప్పటికైనా కేటీఆర్ ఈ వాస్తవాన్ని గ్రహించాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు మున్సిపల్ ఎన్నికల్లో మొన్నటిదాకా గులాబీ పార్టీలో పనిచేస్తున్న కొంతమంది.. కేటీఆర్ కు ఒక లేఖ రాశారు. ఈసారి కారు పార్టీకి ఓటు వేసేది లేదని అందులో స్పష్టం చేశారు. కారు పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు దందాలకు పాల్పడుతున్న నేపథ్యంలోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ లేఖ రాసిన వ్యక్తులు పేర్కొన్నారు. కేటీఆర్ సొంత నియోజకవర్గంలోనే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు భిన్నంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.