BRS Dispute: భారత రాష్ట్ర సమితి రెండు పర్యాయాలు తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చలాయించింది. రెండు పర్యాయాలు కూడా ప్రతిపక్షాన్ని తొక్కి అవతలపడేసింది. ఇతర పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా చేర్చుకుంది. 2023లో మాత్రం భారత రాష్ట్ర సమితి పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో వ్యతిరేకమైన ఫలితం వచ్చింది. హ్యాట్రిక్ సాధించాలని కలలు గన్న గులాబీ పార్టీకి చుక్కెదురైంది.
ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉంది గులాబీ పార్టీ. పార్టీ అధికారం లేకపోయినప్పటికీ.. సోషల్ మీడియా మాత్రం బలంగా ఉంది. గులాబీ పార్టీ సోషల్ మీడియాను ఈ స్థాయిలో బలోపేతం చేసిన వ్యక్తుల్లో క్రిషాంక్ కచ్చితంగా ఉంటారు. ఈయన కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ అల్లుడు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. అనేక పర్యాయాలు జైలుకు కూడా వెళ్లి వచ్చారు. గులాబీ పార్టీకి కీలకమైన సమాచారం అందించడంలో ఈయన దిట్ట అని చెబుతుంటారు.
క్రిషాంక్ కంటోన్మెంట్ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా గెలవాలని భావిస్తున్నారు. 2023లో టికెట్ లభిస్తుందని అనుకున్నప్పటికీ అవకాశం రాలేదు. అప్పుడు గులాబీ పార్టీ సాయన్న కుమార్తెకు అవకాశం ఇచ్చింది. సాయన్న కుమార్తె చనిపోవడంతో.. మళ్లీ క్రిషాంక్ కు టికెట్ ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ, ఈసారి కూడా రిక్త హస్తమే మిగిలింది. దీంతో క్రిషాంక్ ఎమ్మెల్యే ఆశలు నెరవేరలేదు.
ప్రస్తుతం గులాబీ పార్టీలో సోషల్ మీడియాను ముందుండి నడిపిస్తున్నారు క్రిషాంక్. అయితే ఆయన ఎంతో శ్రమ పడుతున్నప్పటికీ.. గులాబీ పార్టీలో కొంతమంది వ్యక్తులు ఆయనను నాయకుడిగా చూడడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు క్రిషాంక్ కు టికెట్ లభించలేదు. అప్పుడు ఆయన మామ సర్వే సత్యనారాయణకు టికెట్ ఇచ్చారు. దీంతో దానిని కారణంగా చూపి క్రిషాంక్ గులాబీ పార్టీలో చేరారు. అక్కడ కూడా ఆయనకు అవకాశం లభించడం లేదు. సికింద్రాబాద్ నగరానికి సంబంధించి గులాబీ పార్టీని పర్యవేక్షిస్తున్న తలసాని శ్రీనివాస్ యాదవ్.. కంటోన్మెంట్ ఏరియా కు గులాబీ పార్టీకి సంబంధించి కొత్త బాధ్యులు వస్తారని ప్రకటించారు. ఆ సమావేశానికి క్రిషాంక్ ను పిలవలేదు. క్రిషాంక్ ఆశల మీద తలసాని శ్రీనివాస్ యాదవ్ నీళ్లు చల్లుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్రిషాంక్ పార్టీ కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు. అనేక కేసులను ఎదుర్కొంటున్నారు. కొన్ని సందర్భాలలో దాడులకు కూడా గురయ్యారు. ఈ పరిణామాలు క్రిషాంక్ ను ఆవేదనకు గురి చేస్తున్నాయని అతడి అభిమానులు అంటున్నారు. ఆయన చేస్తున్న పోరాటానికి గుర్తింపు ఏ మాత్రం లభించడం లేదని అభిమానులు వాపోతున్నారు. కేటీఆర్ తో బలమైన బంధం ఉన్నప్పటికీ.. క్రిషాంక్ ను పార్టీ అధిష్టానం ఎందుకు గుర్తించడం లేదో అర్థం కావడం లేదు. కేటీఆర్ మీద సంపూర్ణ విశ్వాసంతో ఉన్నానని అనేక సందర్భాలలో క్రిషాంక్ చెప్పారు. క్రిషాంక్ కు కూడా కేటీఆర్ హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు ఆ హామీ కార్యరూపం దాల్చలేదు. దీనికి తోడు తలసాని శ్రీనివాస్ యాదవ్ కంటోన్మెంట్ విషయంలో వేలు పెట్టడంతో అసలు క్రిషాంక్ రాజకీయ భవిష్యత్తు ఏమిటో అర్థం కావడం లేదు.