Telangana New Secretariat : పరిపాలన వ్యవస్థకు గుండెకాయ లాంటిది రాష్ట్ర సచివాలయం.. తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి ఇంకా కొన్ని గడియలే ఉంది. ప్రభుత్వం ఈ నూతన సచివాలయాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పేరుని కూడా పెట్టారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి సేవలందించిన సెక్రెటేరియట్, ఆ ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక.. విడివిడిగా రెండు సెక్రెటేరియట్లుగా మారి కూడా కొన్నాళ్లపాటు సేవలందించింది. ఓటుకు నోటు కేసు తర్వాత అప్పటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్లిపోయారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఏర్పాటయ్యాక, ఆ అమరావతిలో తాత్కాలిక సచివాలయాన్ని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నిర్మించింది. దీంతో హైదరాబాద్ నుంచి ఏపీ సెక్రెటేరియట్ అమరావతికి తరలి వెళ్లింది. అమరావతిలో సచివాలయం అంటే.. దాంట్లోనే, అసెంబ్లీ అలాగే శాసన మండలి భవనం కూడా వున్నాయి. కానీ, అదంతా ‘తాత్కాలికం’ పేరుతో నిర్మించింది. ఆ తర్వాత గడిచిన నాలుగేళ్లుగా అక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలూ జరగలేదు.
– తెలంగాణ స్వేత సౌధం..
ఇక, తెలంగాణ సెక్రెటేరియట్ విషయానికొస్తే, జ్యోతిష్యం అలాగే వాస్తుని బాగా నమ్మే కేసీయార్, వాస్తు దోషాలున్నాయన్న కారణంగా పాత సెక్రెటేరియట్ మొహం ఎప్పుడూ చూడలేదు. ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియేట్ అమరావతికి తరలిపోయిన తర్వాత ఉమ్మడి రాష్ట్రానికి, ఆ తర్వాత విభజన తెలుగు రాష్ట్రాలకు సెక్రెటేరియేట్‌గా ఉన్న భవనాన్ని కేసీఆర్ ప్రభుత్వం కూల్చివేసింది. దానిస్థానంలో నూతన భవన సముదాయం నిర్మించి పూర్తి చేశారు. ఆదివారం ప్రారంభించేందుకు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.
తాత్కాలిక సెక్రటేరియేట్‌కు రూ.వెయ్యి కోట్లు..
ఇక తెలుగు రాష్ట్రాల సెక్రటేరియేట్‌లను పోల్చుకుంటే.. అమరావతిలో చంద్రబాబు ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లతో ‘తాత్కాలిక’ అసెంబ్లీ, శాసన మండలి, సెక్రటేరియేట్ నిర్మించింది. ఇందుకోసం సినిమా సెట్టింగ్స్ వేసే వారితో డిసైన్లు తయారు చేయించారు చంద్రబాబు. సింగపూర్‌ను తలపించేలా నిర్మాణాలు చేపడతామని చెప్పారు. అప్పటి వరకు తాత్కాలిక భవనాలకు రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేశారని సమాచారం.
తెలంగాణ వైట్ హౌస్‌కు రూ.వెయ్యికోట్లకు పైనే..
ఇక అమెరికా వైట్ హౌస్‌ను తలదన్నేలా.. ఇంద్రభవనాన్ని తలపించేలా నిర్మించిన తెలంగాణ పాలన సౌధానికి కూడా కేసీఆర్ సర్కార్ రూ.1200 కోట్లకు పైగానే ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. గరిష్టంగా రూ.1600 కోట్ల వరకు ఖచ్చయిందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలోని సెక్రటేరియట్‌లలో ఇదే బెస్ట్. ఆరు అంతస్థుల ఈ భవనంలోని ఆరో అంతస్థులో ముఖ్యమంత్రి కార్యాలయం ఉంది.
ప్రదేశమూ ప్రత్యేకమే..
ఈ సచివాలయాన్ని నిర్మించిన ప్రదేశం ప్రత్యేకమైనది. ఓవైపు హుస్సేన్ సాగర్‌లో బుద్ధ విగ్రహం, మరోవైపు నిలువెత్తు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం, ఇంకోవైపు అమరవీరుల త్యాగాలకు గుర్తుగా నిర్మిస్తున్న అమరజ్యోతి.. పక్కనే ఎన్టీఆర్ పార్క్, లుంబినీ పార్క్, ఆ పక్కన నెక్లెస్ రోడ్, ఐమాక్స్.. ఇలా చారిత్రక, పర్యాటక అంశాలతో ముడిపడిన ప్రదేశంలో ఈ సెక్రటేరియట్‌ని నిర్మించారు.
ఇండో–పర్షియన్ స్టైల్‌లో నిర్మాణం..
రూ.1200 కోట్లకు పైగా వెచ్చించి నిర్మించిన తెలంగాణ కొత్త సెక్రటేరియేట్‌ను మూడేళ్లలో పూర్తి చేశారు. ఈ సెక్రటేరియట్ ప్రత్యేకతలు చూస్తే.. దీనికి 2019 జూన్ 27న శంకుస్థాపన జరిగింది. ఇండో పర్షియన్ శైలిలో దీన్ని నిర్మించారు. హైకోర్టు లాగా.. ప్రత్యేక డోమ్‌లతో నిర్మించారు. పెద్ద, చిన్న కలిపి మొత్తం 34 డోమ్లతో నిర్మించారు. రెండు డోమ్‌లపై మూడు సింహాల జాతీయ చిహ్నాలున్నాయి. వీటిని ఢిల్లీ నుంచి తెప్పించారు. అలాగే సచివాలయం ముందు 2 ఫౌంటేన్లు ఉన్నాయి. అవి ఒక్కోటీ 28 అడుగుల ఎత్తు, 58 అడుగుల వెడల్పుతో ఉన్నాయి.
635 గదులు.. 875 తలుపులు..
తెలంగాణ నూతన సచివాలయంలో 635 గదులు, 875 తలుపులు ఉన్నాయి. 4 ఎంట్రన్స్‌లు, ఐదు అంచెల భద్రతా వ్యవస్థ ఉంది. మొత్తం 28 ఎకరాల విశాలమైన విస్తీర్ణంలో సచివాలయం ఉండగా… ఇందులో పచ్చదనం కోసం చుట్టూ 8 ఎకరాలు కేటాయించారు. 265 అడుగుల ఎత్తు ఉన్న సచివాలయాన్ని భూకంపాలను తట్టుకునేలా నిర్మించారు. ప్రత్యేక హెలిప్యాడ్ కూడా ఉంది. రూఫ్ టాప్‌లో స్కై లాంజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
ఆంధ్రప్రదేశ్ శాశ్వత సచివాలయానికి కలగని మోక్షం..
పరిపాలన వ్యవస్థకు గుండెకాయ లాంటిది రాష్ట్ర సచివాలయం.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం సెక్రటేరియేట్.. గ్రామ సచివాలయం కంటే అధ్వానంగా తయారైంది. అమరావాతి రాజధాని కాదంటూ జగ¯Œ తన ఇంటికే పరిమితం కాగా.. మంత్రులు సైతం అదే బాటలో నడుస్తున్నారు. వాళ్లే రాకపోతే మాకేం పనంటూ ఐఏఎస్ అధికారులు కూడా సచివాలయం ముఖమే చూడడం మానేశారు. వచ్చి చేసేదేమీ లేక నిస్సహాయంగా కొందరు అధికారులు రావడం లేదు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తాత్కాలిక సచివాలయం ఓ అనాథగా మారిపోయింది.
జగన్ సీఎం అయ్యాక..
సీఎం జగన్ ఏ ముహూర్తాన మూడు రాజధానుల ప్రస్తావన తెచ్చారో గానీ.. గత మూడేళ్లుగా రాజధాని అమరావతి మూలనపడింది. పరిపాలనకు మూలాధారమైన వెలగపూడి సచివాలయం కూడా సుప్తచేతనావస్థలోకి వెళ్లిపోయింది. దీంతో మిగతా కార్యాలయాలు కూడా పడకేశాయి. గతంలో రాష్ట్ర సచివాలయానికి ప్రతిరోజూ వందల సంఖ్యలో సందర్శకులు వచ్చేవారు. మంత్రులను, అధికారులను కలిసి గోడు చెప్పుకొనేవారు. తమ సమస్యలు పరిష్కరించాలని, తమ ఫైళ్లు కదిలేటట్లు చేయాలని వేడుకునేవారు. ఇప్పుడు ఇక్కడకు వస్తే ఎవరిని కలవాలో తెలియని పరిస్థితి.
ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఇలా..
విజయవాడకు 12 కి.మీ. దూరంలో ఉన్న అమరావతిలో తాత్కాలిక సచివాలయం నిర్మించారు. ఈ సెక్రటేరియేట్‌లోకి అడుగు పెట్టిన వెంటనే తొలుత కనిపించేది నాలుగు, ఐదు బ్లాక్‌లు. నాలుగో బ్లాక్‌లో 8 మంది మంత్రులు, 11 మంది (ఐఏఎస్) కార్యదర్శులు ఉండాలి. ఇక సీఎం జగన్ సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగే రోజున మాత్రమే వస్తారు. ముఖ్యమంత్రి సచివాలయానికి వచ్చిన రోజున, అసెంబ్లీ సమావేశాల సమయంలో తప్ప మిగతా రోజుల్లో ఎవరూ ఇక్కడ కనిపించరు.
మిగతా బ్లాక్‌లలోనూ అంతే..
నాలుగైదు బ్లాక్‌లు దాటి మూడో బ్లాక్‌లో అడుగుపెడితే… నలుగురు మంత్రులు, ఐదుగురు కార్యదర్శుల చాంబర్లు ఉంటాయి. ఇక రెండో బ్లాక్‌లో ఏడుగురు మంత్రుల కార్యాలయాలు ఉన్నాయి. ఈ బ్లాక్‌లో మొత్తం 10 మంది కార్యదర్శుల కార్యాలయాలు ఉన్నాయి.
యథా సీఎం.. తథా మంత్రులు!
ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అనే సామెత సీఎం జగన్, రాష్ట్ర మంత్రులకు సరిగ్గా సరిపోతుంది. జగన్ సచివాలయాన్ని కాదని.. తాడేపల్లిలోని తన ఇంటినే క్యాంపు కార్యాలయంగా మార్చుకుని.. అది దాటి రావడం లేదు. ఆయన అక్కడ సమీక్షలు నిర్వహిస్తే సంబంధిత శాఖల మంత్రులు ఒకరిద్దరు.. కార్యదర్శులు ఇద్దరు–ముగ్గురు వెళ్తుంటారు. తక్కిన మంత్రులు, సెక్రటరీలు సచివాలయంలో ఉండాలి కదా! కానీ డుమ్మా కొడుతున్నారు. ఇక శాశ్వత సచివాలయం ఎప్పుడు నిర్మిస్తారో.. ఎక్కడ నిర్మిస్తారో ప్రజలకే కాదు పాలకులకు కూడా తెలియని పరిస్థితి.