https://oktelugu.com/

Hyderabad Real Estate: హైదరాబాద్ ‘రియాల్ ఎస్టేట్’ పరిస్థితి ఏంటి? పుంజుకుంటుందా?

హైడ్రా రాకతో హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా తగ్గిపోయిందని, ప్రభుత్వానికి ఆదాయం గణనీయంగా పడిపోయిందన్న ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి దేశమంతా ఇదే పరిస్థితి.

Written By:
  • Raj Shekar
  • , Updated On : October 5, 2024 / 12:56 PM IST

    Hyderabad Real Estate

    Follow us on

    Hyderabad Real Estate: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి పది నెలలు అయింది. పదేళ్ల తర్వాత పార్టీని అధికారంలోకి తెచ్చి సీఎం అయిన రేవంత్‌రెడ్డి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా కీలకమైన చెరువుల ఆక్రమణల తొలగింపు, మూసీ సుందరీకరణ ప్రాజెక్టులు చేపట్టారు. ఆక్రమణల తొలగింపు కోసం హైడ్రా ఏర్పాటు చేశారు. ఇక మూసీ ప్రక్షాళన కోసం మూసీ శివారులో ఇళ్లు నిర్మించుకున్నవారిని ఖాళీ చేయిస్తున్నారు. అయితే హైడ్రా కూల్చివేతలు, మూసీ ఆక్రమణల తొలగింపుతో ప్రభుత్వంపై కాస్త వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయినా సీఎం రేవంత్‌రెడ్డి తగ్గేదే లే అంటున్నారు. ఆరు నూరైనా హైడ్రా ఆగదంటున్నారు. ప్రత్యేక అధికారాలు కట్టబెట్టారు. ఆర్డినెన్స్‌ తెచ్చారు. చట్టం చేసే ఆలోచనలో ఉన్నారు. అయితే కొంతమంది, కొన్ని మీడియా సంస్థలు హైడ్రా కారణంగా హైదరాబాద్‌లో భూముల ధరలు భారీగా పడిపోయాయని, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కుదేలైందని, ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందని కథనాలు రాస్తున్నాయి. అయితే వాస్తవానికి దేశమంతా రియల్‌ రంగం కాస్త మందగించింది. ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం, ఐటీ రంగంలో ఉద్యోగాల తొలగింపు వంటి అంశాలు రియల్‌ రంగంపై ప్రభావం చూపుతున్నాయి. అయితే మందగమనం తాత్కాలికమే అని త్వరలోనే పుంజుకుంటుందని మార్కెట్‌ నిపుణుల పేర్కొంటున్నారు. హైదరాబాద్‌లో అయితే రియాలిటీ పునాదులు బలంగా ఉన్నాయని, సెంటిమెంటు మాత్రమే బలహీనంగా ఉందని చెబుతున్నారు. ప్రతికూల మార్కెట్‌ సెంటిమెంట్‌ కారణంగా పెట్టుబడులు పెట్టడం లేదని చెబుతున్నారు. తేలికైన పెట్టుబడులతో ప్రస్తుత పరిస్థితిని సువర్ణావకాశాలుగా మలుచుకుంటారని అంచనా వేస్తున్నారు.

    హైదరాబాద్‌కు అనుకూలత..
    దేశంలోని మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌కు మౌలిక వసతుల పరంగా ఎన్నో అనుకూలతలు ఉన్నాయి. కొత్తగా మరిన్ని మౌలిక వసతులు రాబోతున్నాయి. ఫలితంగా నగరం నలువైపులావిస్తరించే అవకాశం ఉంది. ట్రిపుల్‌ ఆర్‌ వరకు విస్తరించడం ఖాయం. హైదరాబాద్‌లో నీటి సమస్య చాలా తక్కువ. కృష్ణ, గోదావరి జలాలు వస్తున్నాయి. ఇక నగరానికి ఓ ఆర్‌ఆర్‌ మణిహారంగా ఉంది. మెట్రో విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ప్రభుత్వం. ఇవన్నీ భవిష్యత్‌ అనుకూలతలని మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు.

    దీర్ఘకాలానికి స్థిరాస్తిలో..
    ఇంటి అవసరం ఉన్నవారు మార్కెట్‌తో సంబంధం లేకుండా కొనుగోళ్లు చేస్తున్నారు. మిగులు నిధులు ఉన్నవారు దీర్ఘకాలిక అవసరాల కోసం పెట్టుబడులు పెడుతున్నారు. ప్రస్తుతం పెట్టుబడులకు చాలా అనుకూలమని అంటున్నారు. మంచి లాభాలు వస్తాయని పేర్కొంటున్నారు. అభివృద్ధికి ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో పెట్టుబడులు పెడితే మంచిదని సూచిస్తున్నారు. ధరలు తగ్గించడానికి యజమానులు, రియల్టర్లు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక పెట్టుబడికి అనువైన సమయమని పేర్కొంటున్నారు. వడ్డీ రేట్లు దగ్గడం, ప్రపంచ పరిణామాల్లో మార్పులతో రియల్‌ రంగం పుంజుకుంటుందని నిపుణులు చెబుతున్నారు.