Future City Hyderabad: ఫోర్త్‌సిటీ.. ఫ్యూచర్ ఇటీ.. ఇదిప్పుడు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో హాట్‌టాపిక్‌గా మారిన అంశం. కాంగ్రెస్‌అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎత్తుకున్న ఈ ఫోర్త్‌సిటీపై అందరిలోనూ ఆసక్తి నెలకొన్నా.. మరోవైపు దీనిని పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ దందా కోసమే తెరపైకి తెచ్చారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం భూముల క్రయ, విక్రయాలు మందగించాయి. కానీ, హైదరాబాద్‌కు దక్షిణాన మాత్రం భూముల ధరలకు అనూహ్యంగా రెక్కలు వచ్చాయి. రంగారెడ్డి జిల్లా కందుకూరు, ముచ్చర్ల, తుక్కుగూడ నుంచి యాచారం వరకు భూములు చేతులు మారుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడి భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. దీనివెనుక పెద్ద దందా నడుస్తున్నదని, ఫార్మాసిటీకి కేటాయించిన భూములను బలవంతంగా లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకే కాంగ్రెస్ నాయకులు ఫోర్త్‌సిటీ పాటపాడుతున్నారని బీఆర్‌ఎస్ నిప్పులు కురిపిస్తున్నది.
బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో చేసిన రీజినల్ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌ను ప్రస్తుత ప్రభుత్వం మార్చడం కూడా ఇందులో భాగమేనని ఆరోపిస్తున్నది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం దాదాపు 14వేల ఎకరాల భూమిని సేకరించి ఫార్మాసిటీ ఏర్పాటుకు సన్నద్దమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే దాన్ని రద్దు చేసి అదే భూములను ఆసరా చేసుకొని ఫ్యూచర్ సిటీని తలపెట్టింది. కొత్త ప్రాజెక్టులను ఇక్కడే ఏర్పాటు చేయాలని తలచింది. స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఏఐ సిటీని ఈ ప్రాంతానికే తరలిస్తున్నది. అంతర్జాతీయ కంపెనీలకు కూడా ఇక్కడి భూములనే కేటాయిస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలే ఫోర్త్‌సిటీపై విపరీతమైన ప్రచారం కల్పిస్తున్నారు. మౌలిక వసతుల కల్పనకు నడుం బిగించారు. ఆక్యుపెన్సీ లేదని కారణాలు చూపుతూ రాయదుర్గం ఎయిర్‌పోర్టు మెట్రోను రద్దు చేసి, ఫోర్త్ సిటీ వైపు మాత్రం మెట్రో రైలును తీసుకెళ్లే పనిలో పడింది. 300 ఫీట్ల గ్రీన్‌ఫీల్డ్ రోడ్లు నిర్మిస్తున్నది. ఇక్కడ వసతులు లేకున్నా కొన్ని కంపెనీలు వందలాది ఎకరాలు కొనుగోలు చేశాయి. కందుకూరు నుంచి యాచారం దాక అసైన్డ్‌భూములు కూడా కొనుగోలు చేస్తున్నట్టు తెలుస్తున్నది.
మరోవైపు గతంలో తమ ప్రభుత్వం ప్రతిపాదించిన భూమిని ఇతర అవసరాలకు ఎలా వాడుకుంటారని బీఆర్‌ఎస్ ప్రశ్నిస్తున్నది. ఫార్మాసిటీని రద్దు చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల ముందు చెప్పిందని వాదిస్తున్నది. ఫార్మాసిటీ రద్దుపై సీఎం, మంత్రి శ్రీధర్‌బాబు చేసిన ప్రకటనలపై తేల్చుకోవడానికి భూములిచ్చిన రైతులు ఇటీవల హైకోర్టుకు వెళ్లగా ఫార్మాసిటీ రద్దు కాలేదని ప్రభుత్వం పిటిషన్ వేసి వారిని ఆయోమయానికి గురిచేసింది. ఫార్మాసిటీ కోసం సేకరించిన 14 వేల ఎకరాల భూమి కండిషనల్ ల్యాండ్ ఆక్విజేషన్ అని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఫార్మాసిటీ కోసం మాత్రమే తీసుకుంటున్నామన్నది స్పష్టంగా జీవోలోనే పేర్కొన్నట్టు చెప్పారు. ఆ భూముల్లో ఫార్మాసిటీ ఏర్పాటు చేయకుంటే వాటిని తిరిగి రైతులకు అప్పగించాలని, లేదంటే వాటిలో ఫార్మాసిటీని మాత్రమే నిర్మించాలని డిమాండ్ చేశారు.
ఫార్మాసిటీ కోసం సేకరించిన వేల ఎకరాల భూమిని రియల్ ఎస్టేట్ దందాల కోసం, ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ కోసం మళ్లించి వేల కోట్లు కొల్లకొట్టాలని కాంగ్రెస్ పెద్దలు కుట్ర చేసున్నట్టు ఆరోపించారు.