Telangana Weather : తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. శీతాకాలంలో ముసురు వానలు కురుస్తున్నాయి. మొన్నటి వరకు పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రతలతో ప్రజలు గజ గజ వణికారు. ఇప్పుడు అల్పపీడనం ప్రభావంతో ముసురుకున్న వానలు, వీస్తున్న చల్లగాలులతో మళ్లీ ఇబ్బంది పడుతున్నారు. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని, దీని ప్రభావంతో తెలంగాణ అంతటా జల్లులు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా తెలిపింది. రానున్న 24 గంటల్లో అల్పపీడనం బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుతం పశ్చిమ మధ్య – నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతోందని వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. చాలాచోట్ల తేలికపాటి జల్లులు, అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతాయని, చలి పెరుగుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
మారిన వాతావరణం..
అల్పపీడనం ప్రభావంతో మంగళవారం సాయంత్రం నుంచే తెలంగాణ వాతావరణంలో మార్పులు వచ్చాయి. పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ములుగు, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం పూర్తిగా చల్లబడింది. డిసెంబర్ చివరి వారంలో ముసురు వానలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. బుధవారం ఉదయం నుంచే కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయి చలి ప్రభావం పెరిగింది. పగలు కూడా చల్లగాలి వీస్తోంది.
హైదరాబాద్‌లో వర్షం..
ఇక బుధవారం ఉదయం హైదరబాద్‌లో వాతావరణం మారిపోయింది. మేఘాలు ఆవరించి వాతావరణం చల్లబడింది. రాత్రి నుంచి నగరం వ్యాప్తంగా జల్లులు కురుస్తున్నాయి. దీంతో నగరవాసులు బయటకు రాలేకపోతున్నారు. గురువారం కూడా జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ అంతటా కూడా జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈనెల 28 వరకు వాతావరణం ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ప్రజలకు ఇబ్బంది..
మారిన వాతావరణంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. చలి తీవ్రత కారణంగా జ్వరాలు ముసురుకునే అవకాశం ఉందని, జలుబు, దగ్గుతోపాటు జ్వరం వచ్చే అవకాశం ఉందని వెల్లడిస్తున్నారు. వేడి ఆహారం, కాచి చల్లార్చిన నీటిని తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. బయటకు వెళ్లేవారు స్వెట్టర్లు, మఫ్లర్లు ధరించాలని తెలిపారు.