Homeజాతీయ వార్తలుTelangana New Secretariat Water Leakage: ఇది మన కేసీఆర్ కట్టించిన కొత్త సచివాలయంపై జలపాతం...

Telangana New Secretariat Water Leakage: ఇది మన కేసీఆర్ కట్టించిన కొత్త సచివాలయంపై జలపాతం కథ

Telangana New Secretariat Water Leakage: ఈ శీర్షిక చూసి ఆశ్చర్యపోతున్నారా.. ఎప్పుడూ వినలేదు.. ఎక్కడా చదవలేదని ఆలోచిస్తున్నారా.. ఆలోచించకండి. ఎందుకంటే పైన రిజర్వాయర్‌ ఏమీ లేదు. హైదరాబాద్ నడిబొడ్డున తెలంగాణ నూతన సచివాలయంలో పనిచేసే వేలాది మంది ఉద్యోగుల అవసరాలు, ప్రాంగణంలో చెట్లు, పచ్చిక నీటి అవసరాల కోసం భవనం కింద రెండున్నర లక్షల లీటర్ల సామర్థ్యంతో స్టోరేజీ ట్యాంక్ నిర్మించారు. ఇది దాదాపు ఓ మినీ రిజర్వాయర్ లా ఉంటుంది. వాన నీటిని ఒడిసి పట్టేలా దీన్ని నిర్మించారు. సచివాలయ భవనం నలువైపుల నుంచి వాన నీరు ఇందులోకి వచ్చేలా ప్రత్యేక పైప్‌లైన్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. కానీ, ఈ వీడియోలో సెక్రటేరియేట్‌ పైనుంచి నీటిని తోడుతున్నారు. అదేంటి అంటే నిర్మాణ లోపంతో భవనంపై భాగంలో వాననీరు నిలిచి గదులు లీక్‌ అవుతున్నాయి. దీంతో భవన నిర్వహణ సిబ్బంది నీటిని ఎత్తిపోస్తున్నారు.

ఇంద్రభవనంలా పాలనా సౌధం..
తెలంగాణ కొత్త సెక్రటేరియేట్‌ను ప్రభుత్వం రూ.1600 కోట్లతో నిర్మించింది. ఇంద్రభవనాన్ని తలపించేలా నిర్మించిన ఈ సెక్రటేరియేట్‌ను ఏప్రిల్‌ 30న దీనిని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. ఇందులో 635 గదులు. 30 సమావేశ మందిరాలు. 34 గుమ్మటాలు ఉన్నాయి. సచివాలయ ప్రధాన భవనం ఆరు అంతస్తుల్లో ఉంటుంది. ప్రధాన గుమ్మటం వద్ద మరో ఐదు అంతస్తులతో 11 అంతస్తుల నిర్మాణంగా కనిపిస్తుంది. ముందువైపు 10 ఎకరాల్లో పచ్చిక మైదానం ఉండగా, కోర్ట్ యార్డులో 2 ఎకరాల్లో లాన్ ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ట మహోన్నతంగా వెలుగులీనేలా, ప్రజల ఆత్మగౌరవం మరింత ఇనుమడింపజేసేలా, ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా, వినూత్న రీతిలో అత్యద్భుతంగా నిర్మించుకున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఇది యావత్ తెలంగాణ సమాజం గర్వించదగ్గ గొప్ప సందర్భమని సీఎం అన్నారు.

ఒక్క వానకే లీక్‌..
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయంలో వర్షపు నీరు కురుస్తోంది. గత ఆదివారం కురిసిన వర్షానికి సచివాలయం లోపల వర్షపు నీరు లీకైంది. దీంతో ఈ బిల్డింగు నాణ్యతపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. పర్యావరణ హితంగా దీన్ని రూపొందించినట్లు, దీనికి గ్రీన్ బిల్డింగ్ ఇండియా సర్టిఫికెట్ కూడా లభించినట్లు చెప్పింది. దేశంలోనే తొలి గోల్డ్ రేటెడ్ సెక్రటేరియట్ బిల్డింగ్ కాంప్లెక్స్‌గా నిలిచిందని వెల్లడించింది. ఇంత గొప్పగా చెప్పుకొంటున్న నూతన సచివాలయం బిల్డింగులోని డొల్లతనం తాజాగా బయటపడింది. బిల్డింగు లోపల అనేక చోట్ల వర్షపు నీరు లీకవుతోంది. ఈ విషయం మీడియాకు తెలియకుండా ఆంక్షలు విధించినప్పటికీ విషయం బయటకు రాకుండా దాచలేకపోయింది ప్రభుత్వం. మరోవైపు సచివాలయం ప్రారంభమైన రోజునే ఒక పిల్లర్‌కు పగుళ్లు కనిపించాయి. అంతకుముందు మొదటి ఫ్లోర్‌లో కూడా ఇలాగే వాటర్ లీకైనట్లు తెలుస్తోంది.

తాజాగా నీటి ఎత్తిపోత..
ఇక సోమవారం రాత్రి కురిసిన వర్షానికి సెక్రటేరియేట్‌ భవనంపై భారీగా నీరు నిలిచింది. మొన్నటి లీకేజీల నేపథ్యంలో భవన నిర్వహణ సిబ్బంది నీటిని ఎత్తిపోయించే చర్యలు చేపట్టారు. ఈ దృశ్యాన్ని చిత్రీకరించిన వారు సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. పాత సినిమాలోని పాటను జోడించి నీటిని ఎత్తిపోసే దృశ్యం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. పైకి మెరుస్తూ.. అందంగా కనిపిస్తున్న సచివాలయం.. లోపల మాత్రం అంతా డొల్లేనా అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. వేసవి కాలం ఒకట్రెండు రోజులు కురిసిన వర్షానికే పరిస్థితి ఇలా ఉంటే.. వర్షాకాలం భారీ వానలకు సచివాలయం ఏమవుతుందో అని పేర్కొంటున్నారు.

 

Water Leakage Telangana Secretariat |నూతన సెక్రటేరియట్ లో నీళ్లు నిల్వ..ఇందులో వాస్తవమెంత..? | ABP

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version