TV9 Rajinikanth : పాత్రికేయులు నిష్పక్షపాతంగా ఉన్నప్పుడు నిజాలు వెలుగులోకి వస్తాయి. అబద్ధాలు మరుగున పడిపోతాయి. వెరసి సమాజం అనేది అభివృద్ధి చెందుతుంది. నిజం ఎలాగూ తెలుస్తుంది కాబట్టి ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది. నీతి, న్యాయం అనేవి అందరికీ లభిస్తాయి.. అలాంటప్పుడు అంతరాలు ఉండవు. కానీ, పాత్రికేయులు నీతి తప్పితే, భజనకు అలవాటు పడితే, అబద్దాలను వ్యాప్తి చేయడంలో పోటీపడితే సమాజం గతి తప్పుతుంది. దురదృష్టవశాత్తు తెలుగు నాట ప్రస్తుతం మీడియాలో పనిచేస్తున్న పాత్రికేయులు మొత్తం పై అవ లక్షణాలను అలపరుచుకున్నారు. ఏదో ఒక పార్టీకి భజన చేయడం, నిరాధారమైన వార్తలను నిజాలుగా ప్రచారం చేయడం, గిట్టని వారిపై బురద చల్లడం అలవాటుగా మార్చుకున్నారు. ఇది ఎంతవరకు దారితీస్తుందో తెలియదు కాని.. ఇలాంటి పాత్రికేయుల వ్యవహార శైలి వల్ల పాత్రికేయం అంటేనే జనాలు అసహ్యించుకునే పరిస్థితి ఏర్పడింది..
చర్చనీయాంశంగా రజనీకాంత్ మాటలు
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ సర్కులేట్ అవుతోంది. ఇందులో టీవీ9 తెలుగు కు సంబంధించి మేనేజింగ్ ఎడిటర్ గా పనిచేస్తున్న వెల్లాల చెరువు రజనీకాంత్ మాట్లాడుతున్న మాటలు చర్చనీయాంశంగా మారాయి. అందులో ఆయన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వ్యాప్తిలో ఉన్నాయి.. ” తెలుగు రాష్ట్రాలలో.. అటు తెలంగాణ, ఇటు ఆంధ్ర ప్రదేశ్ పై సంపూర్ణ అవగాహన ఉంది కేవలం ఇద్దరు నాయకులకు మాత్రమే. అందులో ఒకరు కెసిఆర్.. మరొకరు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు సుదీర్ఘకాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. అందులో ఆయనకు అవగాహన ఉండడంలో పెద్దగా ఆశ్చర్యం లేదు. కానీ కెసిఆర్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పెద్దగా సంబంధం లేదు. అయినప్పటికీ ఆయన ఆ రాష్ట్రంపై సంపూర్ణంగా మాట్లాడగలరు.” అని రజనీకాంత్ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో కెసిఆర్ తో మీరు చేసిన ఇంటర్వ్యూ ప్రతి సెకండ్ చూశానని.. ఓ వ్యక్తి అనగా.. దానికి రజనీకాంత్ దగ్గరగా నవ్వారు. ఎన్నికలకు ముందు ఈ ఇంటర్వ్యూ చేసి ఉంటే బాగుండేదని ఆ వ్యక్తి చెప్పగా.. దానికి రజనీకాంత్ మరోసారి బిగ్గర గా నవ్వారు. అయితే ఈ వీడియోను భారత రాష్ట్ర సమితి అనుకూల నెటిజెన్లు సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ చేస్తున్నారు..
అసెంబ్లీ ఎన్నికల సమయంలో..
అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీవీ9 భారత రాష్ట్ర సమితి అభ్యర్థులకు అనుకూలంగా వార్తలు ప్రసారం చేసిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. దానికి తగ్గట్టుగానే టీవీ9 లో కేటీఆర్ ఇంటర్వ్యూను రజనీకాంత్ చేశారు. ఆయనకు అనుకూలంగా ప్రశ్నలు వేసి కాంగ్రెస్ నాయకులను తిట్టించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక అప్పట్లో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా టీవీ9 విస్తృతంగా వార్తలు ప్రసారం చేసిందని, ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడిందని విమర్శలున్నాయి. ఇదే క్రమంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి తో టీవీ 9 ఒక ఇంటర్వ్యూ చేసింది. ఈ క్రమంలో రజినీకాంత్ అడిగిన ఓ ప్రశ్నకు రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి అనేతీరుగా సమాధానం చెప్పారు. దీనిని అప్పటినుంచి భారత రాష్ట్ర సమితి నాయకులు తెగ ట్రోల్ చేస్తున్నారు.. ఇక పార్లమెంటు ఎన్నికల సమయంలో టీవీ9 రేవంత్ రెడ్డితో ఇంటర్వ్యూ జరిపింది. అయితే ఎన్నికలకు ముందు కెసిఆర్ తో రజనీకాంత్ ఇంటర్వ్యూ చేసినప్పటికీ.. పెద్దగా ఉపయోగం ఉండేది కాదని.. అప్పటికే జనాలకు భారత రాష్ట్ర సమితి అంటే ఏవగింపు మొదలైందని.. రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.. మొత్తానికి గులాబీ పార్టీ అనుకూల జర్నలిస్టుగా ముద్రపడిన రజనీకాంత్.. కెసిఆర్ పై తన భక్తిని ఇలా చాటుకున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఒక మీడియాలో పనిచేస్తున్న వ్యక్తి ఇలా రాజకీయ నాయకులపై తన అనుకూల వ్యాఖ్యలు చేయడం సరికాదని విన్నవిస్తున్నారు. ఇది కావాలని చేసిన వీడియో అని.. దానిని భారత రాష్ట్ర సమితి అనుకూల నెటిజన్లు సర్కులేట్ చేస్తున్నారంటే.. దాని వెనుక కారణం ఏంటో తెలుసుకోలేనంత అమాయకులు తెలంగాణ ప్రజలు కారని వారు చెబుతున్నారు.
కేసీఆర్ కి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో తనకంటూ ఒక ఇమేజ్ ఉంది..
పొలిటికల్ స్పీచెస్ కానీ, మాట్లాడటం కానీ, థాట్ ప్రాసెస్… ఈ రెండు రాష్ట్రాల మీద మంచి గ్రిప్ ఉన్న వ్యక్తి కేసీఆర్ pic.twitter.com/0tG3JromTp
— (@Nallabalu1) August 7, 2024