
TSPSC Paper Leak: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్న పత్రాల లీకేజీ తో రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ఇంటా బయటా విమర్శలు వస్తున్నాయి. మంత్రి కేటీఆర్ ఈ వ్యవహారంతో ప్రభుత్వానికి ఏం సంబంధమని దబాయిస్తున్నప్పటికీ.. ప్రభుత్వం నియమించిన చైర్మన్, సభ్యులే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను నడిపిస్తున్నారు. ఈ విషయం తెలియక ఆయన ఏదో ఫ్రస్టేషన్లో మాట్లాడాడు కానీ.. ప్రస్తుత లీకేజీ వ్యవహారం నేపథ్యంలో ప్రభుత్వం చేతులు కాలిన తర్వాత తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు ఇటువంటి పోసే ప్రయత్నం చేస్తోంది.
ప్రశ్న పత్రాలు లీకేజీ అవుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పరీక్ష పేపర్లతో పాటు ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్ల పరిరక్షణ కోసం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలో ఐఏఎస్ స్థాయి కస్టోడియన్ అధికారిని నియమించాలని భావిస్తోంది. దీంతోపాటు పరీక్షల నిర్వహణకు ప్రత్యేక కంట్రోలర్ ను కూడా నియమించే యోచనలో ఉన్నది. ప్రస్తుతం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో కార్యదర్శి పేరిట ఒక ఐఏఎస్ అధికారి పోస్ట్ ఉంది. కొన్ని పరిపాలన వ్యవహారాలను కార్యదర్శి పర్యవేక్షిస్తున్నారు. మిగతా వ్యవహారాలను చైర్మన్ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా పరీక్షల నిర్వహణ, ప్రశ్న పత్రాల భద్రత వంటి అంశాలను నేరుగా చైర్మన్ పర్యవేక్షిస్తున్నారు.. పని ఒత్తిడి ఉన్న సమయంలో ప్రశ్నపత్రల భద్రతా బాధితులను ఇతర అధికారులకు చైర్మన్ బదలాయిస్తున్నారు. ఈ విధానం గతంలో నుంచే కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ప్రస్తుత చైర్మన్ జనార్దన్ రెడ్డి కూడా ప్రశ్నాపత్రాల భద్రత బాధ్యతను సెక్షన్ అధికారి శంకర లక్ష్మికి అప్పగించారు. నిందితులు ఆమె కంప్యూటర్ నుంచే ప్రశ్నపత్రాల వంటి ముఖ్యమైన డాక్యుమెంట్ల లీకేజీకి పాల్పడ్డారు. ఈ క్రమంలో వాటి భద్రత కోసం ఒక కస్టోడియన్ అధికారిని నియమించాలని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో జరిగిన సమావేశంలోనూ ఈ అంశం తెరపైకి వచ్చినట్టు తెలుస్తోంది.

ఇక కమిషన్ లో ప్రస్తుతం కార్యదర్శిగా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారిని బదిలీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆమె స్థానంలో మరో అధికారిని నియమించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. మరోవైపు పరీక్షల రీ షెడ్యూల్ పై అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. సోమవారం కమిషన్ పాలకమండలి ప్రత్యేకంగా సమావేశమై దీనిపై సుదీర్ఘంగా చర్చించింది. ప్రస్తుతం రద్దు అయిన పరీక్షలను మళ్లీ నిర్వహించాలంటే జరగబోయే పరీక్షలను కూడా దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంది. వీటితోపాటు రాష్ట్రస్థాయిలో నిర్వహించే ఎంసెట్, లాసెట్ వంటి పరీక్షలు, జాతీయస్థాయిలో ఉద్యోగాల నియామకాల పరీక్ష షెడ్యూల్ కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. నేపథ్యంలో పరీక్షలకు ఇబ్బంది కలగకుండా రద్దయిన పరీక్షల తేదీలను ప్రకటించడం పై అధికారులు దృష్టి కేంద్రీకరించారు.