TS TET 2024: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)–2024 దరఖాస్తు గడువు ముగిసింది. శనివారం సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరించారు. మొత్తం 2,83,441 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పేపర్–1కి 99,210 దరఖాస్తులు రాగా, పేపర్–2కి 1,84,231 దరఖాస్తులు వచ్చాయి. ఇక ఎడిట్ ఆప్షన్‌ను పేపర్ –1కు 6,626 మంది ఉపయోగించుకోగా, పేపర్–2కు 11,428 మంది సద్వినియోగం చేసుకున్నారు. కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించే టెట్ పరీక్ష మే 20 నుంచి జూన్ 3వ తేదీ వరకు నిర్వహిస్తామని విద్యాశాఖ తెలిపింది. జూన్ 12న ఫలితాలు విడుదల చేస్తారు.
టెట్ మినహాయింపునకు వినతి..
ఇక టెట్‌కు ప్రభుత్వ ఉపాధ్యాయుల నుంచి కూడా భారీగా దరఖాస్తులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. వారిని దృష్టిలో పెట్టుకుని దరఖాస్తు ఫీజును రూ.1000గా నిర్ణయించింది. అయితే ఉపాధ్యాయుల నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉంది. పదోన్నతులకు టెట్ తప్పనిసరి కావడంతో తమకు ప్రత్యేకంగా టెట్ నిర్వహించాలని, లేదా మినహాయింపు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. ఈమేరకు తాజాగా టీపీయూఎస్ జాతీయ వ ఇద్యా మండలిని కోరింది. తపస్ రాష్ట్ర అధ్యక్షుడు హన్మంతరావు, ప్రధాన కార్యదర్శి నవాత్ సురేశ్, ఇతర నేతలు శనివారం ఢిల్లీలో ఎన్‌సీటీఈ చైర్మన్ యోగేశ్‌సింగ్‌ను కలిశారు. టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఇన్‌సర్వీస్‌లో ఉన్న ఎస్జీటీ ఉపాధ్యాయులకు, స్కూల్ అసిస్టెంటు పదోన్నతులకు మాత్రమే టెట్ రాసేలా నిబంధనలు మార్చాలని విన్నవించారు. బదిలీలకు టెట్‌తో ముడి పెట్టొద్దని కోరారు.