HomeతెలంగాణMulugu district: గిరి గర్భిణుల ప్రసవ వేదన.. ఆస్పతికెళ్లాలంటే 3 కిలోమీట‌ర్లు ఇలా మోసుకెళ్లాల్సిందే!

Mulugu district: గిరి గర్భిణుల ప్రసవ వేదన.. ఆస్పతికెళ్లాలంటే 3 కిలోమీట‌ర్లు ఇలా మోసుకెళ్లాల్సిందే!

Mulugu district: అడవుల జిల్లాల్లో గిరిజనుల కష్టాలు ఎవరికీ పట్టడం లేదు. ఇటీవలే ఆసిఫాబాద్‌ జిల్లాలో గర్భిణికి పురిటి నొప్పులు వస్తే.. మంచంపై ఎత్తుకుని ఉప్పొంగుతున్న వాగు దాటి ఆస్పత్రికి తరలించారు. ఓ చిన్నారికి జ్వరం వస్తే అంబులెన్స్‌ రాకకు దారి లేక.. బాహుబలి సినిమాను తలపించేలా మెడలోతు వరద ఉధృతిలో చిన్నారిని పైకి ఎత్తుకుని వాగు దాటిన దృశ్యం కనిపించింది. రెండు రోజుల క్రితం అదే జిల్లాలో వాగు దాటుతూ గిరిజన మహిళ కొట్టుకుపోయి మృతిచెందింది. వరుస ఘటనలు జరుగుతున్నా ఏజెన్సీ వాసుల కష్టాలు ఎవరికీ పట్టడం లేదు. తాజాగా ములుగు జిల్లాలో పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని బంధువులు డోలీలో వేసుకుని వాగు దాటించారు.

మూడు కిలో మీటర్లు మోసుకుని..
ఏటూరునాగారం మండలం రాయబంధంకు చెందిన సోది పోసి అనే గొత్తి కోయ తెగకు చెందిన గర్భిణికి సోమవారం వేకువ జామున పురిటినొప్పులు రావడంతో స్థానిక ఆశ వర్కర్‌ కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చారు. ఆమె వచ్చి పరిశీలించి ప్రసవం అయ్యేలా ఉందని ఆస్పత్రికి తీసుకెళ్లాలని 108కు సమాచారం అందించారు. అయితే రాయబంధం గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేక 3 కి. మీ దూరంలోనే అంబులెన్స్‌ను సిబ్బంది నిలిపివేశారు. దీంతో గ్రామస్థులు గర్భిణిని మంచానికి తాళ్లతో కట్టి 3 కి. మీ మోసుకొచ్చి అంబులెన్స్ ఎక్కించి ఏటూరునాగారం ఆసుపత్రికి తరలించారు.

ఎవరికీ పట్టని ఏజెన్సీ కష్టాలు..
ఏజెన్సీ గిరిజనుల కష్టాలను అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. దీంతో కనీసం గిరిజన గ్రామాలు రోడ్లకు కూడా నోచుకోవడం లేదు. దీంతో వానాకాలాం వచ్చిందంటే అత్యవసర పరిస్థితిలో ఆస్పత్రికి వెళ్లలేని పరిస్థితి నెలకొంటోంది.

ఆలస్యమేతే చావే..
గిరిజన గ్రామాలు, తండాల్లో చిన్న పిల్లలకు, వృద్ధులకు, గర్భిణులకు అత్యవసరమైతే పట్టించుకునే నాథుడే లేడు. నెలలు నిండిన గర్భిణులను ముందుగానే ఆస్పత్రులకు తరలించి ప్రీ డెలివరీ వార్డులో ఉంచాలని ప్రభుత్వం ఆదేశించింది. అయినా గిరిజనులు అందుకు అంగీకరించకపోవడం, అధికారులు పట్టించుకోకపోవడంతో ఆదివాసీ బిడ్డలకు అవస్థలు తప్పడం లేదు. ఇక వర్షాలు కురిస్తే ఏజెనీతో బాహ్య ప్రపంచంతో సంబంధాలు ఉండడం లేదు. దీంతో అత్యవసరమైతే ఆస్పత్రికి వెళ్లలేని పరిస్థితి. అష్టకష్టాలు పడి తీసుకెళ్లినా అప్పటికి పరిస్థితి చేయిదాటిపోతోంది. ఏటా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా పాలకులు మాత్రం కళ్లు తెరవడం లేదు. ఓట్ల కోసం మాత్రం గిరిజనుల వద్దకు వెళ్లారు. సమస్యలు చెబితే అటవీశాకపై నెపం వేసి తప్పించుకుంటున్నారు. ఇలా గిరిజనులు ఇంకా ఎన్నాళ్లు కష్టపడాలో ఆ దేవుడికే తెలుసు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version