Jagtial Accident: “అతి బలవంత అంజన్న.. కాపాడు మమ్మల్ని అంజన్న” ప్రసిద్ధ హనుమత్ క్షేత్రం కొండగట్టును దర్శించుకోవడానికి వచ్చే ముందు భక్తులు ఇలానే మనసులో అనుకుంటారు. కొండగట్టు అంజన్న ను దర్శించుకున్న తర్వాత.. కొండంత బలం వచ్చినట్టు సంబరపడిపోతుంటారు.. అలా ఈ దంపతులు కూడా కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. కనుల నిండా స్వామి వారి రూపాన్ని నింపుకొని.. ఆనందంతో తిరుగు ప్రయాణమయ్యారు. కానీ అంతలోనే దారుణం జరిగింది.
జగిత్యాల జిల్లాలో మాటలకు అందని విషాదం చోటుచేసుకుంది. కొండగట్టు ప్రాంతంలో కొలువై ఉన్న అంజన్నను దర్శించుకున్న ఓ కుటుంబం.. తమ కారులో తిరిగి సొంత ప్రాంతానికి వెళ్తుండగా దారుణం చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు దంపతులు సంఘటన స్థలంలోనే కన్నుమూశారు. ఇందులో వారి కూతురు పరిస్థితి విషమంగా ఉంది. ఉమ్మడి మెట్ పల్లి మండలం చౌల మద్ది అనే గ్రామం శివారు ప్రాంతంలో జాతీయ రహదారిపై ఘోరమైన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మందని అనే గ్రామానికి చెందిన కోటగిరి మోహన్, లావణ్య అనే దంపతులు కనుమూశారు. వీరి కుమార్తె కీర్తన పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. కీర్తనకు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
మోహన్, లావణ్య దంపతులు ఎప్పటినుంచో కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకోవాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఖాళీ సమయం దొరకడంతో వారు కుమార్తె కీర్తనతో కలిసి స్వామి వారి దర్శనానికి వచ్చారు. ముందుగా బస్సులో వద్దామని అనుకున్నప్పటికీ.. ఆ తర్వాత తమకు సొంత కారు ఉండడంతో అందులో వచ్చారు.. స్వామివారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత స్వగ్రామానికి బయలుదేరారు. ఈ సమయంలోనే మెట్ పల్లి మండలంలోని జాతీయ రహదారిపైకి కారు ప్రవేశించగానే.. లారీ మృత్యువు రూపంలో వచ్చింది. హఠాత్తుగా లావణ్య దంపతులు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. ఆ సమయంలో లారీ డ్రైవర్ విపరీతమైన వేగంతో వాహనాన్ని తోలుతున్నట్టు స్థానికులు తెలిపారు. లారీ ఢీ కొట్టిన తీరును చూస్తే అత్యంత దారుణంగా ఉంది. కారు పూర్తిగా ధ్వంసం అయిపోయింది. లారీ ఢీకొట్టిన వెంటనే లావణ్య దంపతులు సంఘటన స్థలంలోనే కన్నుమూశారు. కుమార్తె కీర్తన కూడా తీవ్రంగా గాయపడింది. ఆమె అపస్మారక స్థితిలో ఉండడంతో వెంటనే నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కొండగట్టు అంజన్న దర్శనానికి వచ్చి.. ఇలా లావణ్య దంపతులు అనంత లోకాలకు వెళ్లడాన్ని వారి బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. అప్పటిదాకా తమతో ఫోన్లో మాట్లాడారని.. ఇంతలోనే వారి చావు వార్త వినాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదని బంధువులు అంటున్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత అతి కష్టం మీద లావణ్య దంపతుల మృతదేహాలను పోలీసులు బయటికి తీశారు.