Kaloji Narayana Rao : పుట్టుక నీది కావచ్చు. చావు కూడా నీది కావచ్చు. బతుకు మొత్తం దేశానిది.. ఇలా రాయాలంటే గుండె ధైర్యం కావాలి. అలా చెప్పాలంటే ఆ మనిషికి జనం బాధ తెలిసి ఉండాలి. కన్నీటి కష్టాల నుంచి వచ్చిన వాడై ఉండాలి. అలాంటివాడే కాలోజి నారాయణరావు. అన్యాయాన్ని ఎదిరించి.. గొడవకు సంతృప్తిని ఇచ్చుకున్న మహాకవి. అన్యాయాన్ని అంతరించి.. తనకు ముక్తి ప్రాప్తి కలిగించాలని కోరుకున్న కవి. ఆయన జయంతి నేడు.. ఆయన జయంతి రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికార భాషా దినోత్సవం గా నిర్వహిస్తోంది.
ఉద్యమమే కాళోజీ నారాయణరావు ఊపిరిగా జీవించారు. 1914 సెప్టెంబర్ 9 కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలోని రట్టి హళ్లి గ్రామంలో ఆయన జన్మించారు. నారాయణరావు తల్లి రామాబాయమ్మ . ఈమె పూర్వీకులు కన్నడ వాసులు.. కాళోజి తండ్రి పేరు రంగారావు. ఈయన స్వస్థలం మహారాష్ట్ర. మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, జమలాపురం కేశవరావు, బూర్గుల రామకృష్ణారావు, పీవీ నరసింహారావు వంటి వారితో కాళోజి అనేక ఉద్యమాలు చేశారు. ఆయన విద్యార్థి దశలో ఉన్నప్పుడు నిజాం ప్రభుత్వ నిషేధాన్ని ఉల్లంఘించారు. వరంగల్ లో గణపతి ఉత్సవాలను నిర్వహించారు. తెలంగాణ లో ప్రజలకు అక్షర జ్ఞానాన్ని కలిగించాలని కోరికతో ఆంధ్ర సారస్వత పరిషత్ ను ఏర్పాటు చేసిన వారిలో కాళోజీ ముందు వరుసలో ఉంటారు. రజాకర్ల దౌర్జన్యాన్ని వ్యతిరేకిస్తూ 1945లో ఆంధ్ర సరస్వతి పరిషత్ ద్వితీయ మహాసభలను విజయవంతంగా నిర్వహించడంలో నారాయణరావు అనితర సాధ్యమైన తెగువను ప్రదర్శించారు. నాటి ధైర్య సాహసాలను ఆయన అభిమానులు కథలుగా చెప్పుకుంటున్నారు. వరంగల్ కోటలో జాతీయ జెండాను ఎగరవేసేందుకు ఆరోజు ఆయన విశ్వ ప్రయత్నాలు చేశారు. ఈ సందర్భంగా ఆయనను నాటి నిజాం ప్రభుత్వం నగర బహిష్కరణ చేసింది. స్వరాజ ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు బహిష్కరణకు గురైనప్పుడు వారిని మహారాష్ట్రలోని నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేర్పించారు. 1953లో తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యక్షుడిగా ఆయన ఎన్నికయ్యారు. 1958 లో ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసన మండల కి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.. కాళోజీని కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది. భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారంతో గౌరవించింది.
రాజ్య హింస తప్పు
హింసను తప్పుడు మార్గముగా కాళోజీ భావించారు. రాజహింసను మరింతగా తప్పుడు పట్టేవారు. సామాన్యుడు తన దేవుడని కొనియాడేవారు. 22 నవంబర్ 13న ఆయన కన్నుమూశారు. ఆయన మరణం అనంతరం పార్థివ దేహాన్ని కాకతీయ వైద్య కళాశాలకు అందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడుగా 1958 నుంచి 1960 వరకు కాళోజి పని చేశారు. దాదాపు రెండు సంవత్సరాలపాటు స్వతంత్ర శాసనమండలి సభ్యుడుగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీలో సభ్యుడిగా కొనసాగారు. తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడిగా 1957 నుంచి 1960 వరకు గ్లోసరి కమిటీ సభ్యుడిగా ఉన్నారు. 1977 లో స్వతంత్ర అభ్యర్థిగా సత్తుపల్లి నియోజకవర్గం నుంచి నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావుపై పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు. కాళోజి జయంతిని పురస్కరించుకొని తెలంగాణ భాషా దినోత్సవం గా ప్రభుత్వం ప్రకటించింది. నెంబర్ 9న కాళోజీ 100 జయంతి సందర్భంగా అప్పటి ప్రభుత్వం ఆయన జయంతిని తెలంగాణ భాష దినోత్సవంగా ప్రకటించి నిర్వహిస్తోంది. తెలంగాణ సాహిత్యంలో విశేష కృషి చేసిన వారికి కాళోజి పురస్కారాన్ని రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ అందిస్తుంది.