Raithu Barosa : రైతులకు పంటల సాగుకు అవసరమైన పెటుట్బడి అందించేందుకు గత ప్రభుత్వం రైతుబంధు(Raithu Bhandu) పేరుతో రెండు పంటలకు మొదట ఎకరాకు రూ.4 వేల చొప్పున పెట్టుబడి అందించింది. తర్వాత రూ.5 వేలరకు పెంచింది. ఇక గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తమను గెలిపిస్తే ఏటా రూ.15 వేల పెట్టుబడి అందిస్తామని హామీ ఇచ్చింది. పంటకు రూ.7,500 చొప్పున చెల్లిస్తామని ప్రకటించింది. కానీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా పెట్టుబడి సాయం పెంచలేదు. గత యాసంగిలో పాత పద్ధతిలోనే కొందరికే రైతుబంధు అందించింది. దీంతో ప్రతిపక్షాలు రైతుబంధు ఎగ్గొట్టాలని రేవంత్ సర్కార్ చూస్తోందని మండిపడుతున్నాయి. ఈ క్రమంలో గత ప్రభుత్వం తరహాలో కాకుండా సాగు చేసే భూములకు మాత్రమే రైతుబంధు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ప్రణాళిక సిద్ధం చేసింది. జనవరి 26 (January 26)నుంచి ఎకరాకు రూ.6 వేల చొప్పున పెట్టుబడి సాయం ఇస్తామని ప్రకటించింది.
సాగు యోగ్యమైన భూములకే..
ఇందిరమ్మ రైతుభరోసా కింద ఈ పెటుట్బడి సాయం అందించనుంది. ఇది పూర్తిగా సాగుయోగ్యమైన భూములకే ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గత ప్రభుత్వం కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు రైతుబంధు ఇచ్చిందని సీఎం రేవంత్‌రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేని శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. తామ అలా కాకుండా సాగు యోగ్యమైన భూములకే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రూ.12 వేలు ఇస్తామని ప్రకటించారు. వ్యవసాయానికి పనికిరాని(Non Agricultar) భూములకు ఒక్క రూపాయి కూడా ఇవ్వొద్దని సీఎం రేవంత్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. మంత్రి పొంగులేటి కూడా మరోసారి ఇదే విషయం స్పష్టం చేశారు. వ్యవసాయం చేసే ప్రతీ ఎకరాకు రైతు భరోసా ఇస్తామని తెలిపారు. వ్యవసాయ యోగ్యం కాని భూముల జాబితా పక్కాగా తయారు చేయాలని ఆదేశించారు. గ్రామ సభల్లో చర్చించి వివరాలు వెల్లడించాలని సూచించారు. ఎలాంటి అనుమానాలు, అపోహలు ఉండొద్దని తెలిపారు.
పంట వేసినా, వేయకపోయినా..
ఇక సాగు భూమి అయితే.. పంట వేసినా, వేయకపోయినా రైతు భరోసా ఇవ్వాలని స్పష్టం చేశారు. సాగు భూమి కాకుంటే మాత్రం జాబితా నుంచి తొలగించాలని ఆదేశించారు. అనర్హులకు ప్రయోజనం అందించకూడదని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి పొరపాట్ల జరగకుండా చూడాలని ఆదేశించారు.