https://oktelugu.com/

Telangana New Secretariat : వీడియో : తెలంగాణ అద్భుతం.. కొత్త సచివాలయం.. విశేషాలెన్నో

ఇండో–పర్షియన్‌–అరేబియన్‌ నిర్మాణాల మిశ్రమ శైలి సచివాలయంలో కనిపిస్తుంది. పాతకాలపు ప్యాలెస్‌లు, ఆలయ గోపురాల తరహాలో నిర్మించారు.

Written By:
  • NARESH
  • , Updated On : April 29, 2023 / 10:23 PM IST
    Follow us on

    Telangana New Secretariat : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయ ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. తెలంగాణకే మకుఠంగా ఈ అద్భుత సచివాలయం నిలవనుంది. దాదాపు 650 కోట్లకు పైగా నిధులు వెచ్చించి పార్లమెంట్ తరహాలో నిర్మించిన ఈ సచివాలయం ఎన్నో విశేషాలను కలిగి ఉంది.

    ఆదివారం ఈ తెలంగాణ నూతన సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. హుస్సేన్ సాగర్ తీరాన ఈ సగర్వంగా నిలుస్తున్న ఈ అద్భుత నిర్మాణం డెక్కన్ కాకతీయ ఆర్కిటెక్చర్ తో రూపుదిద్దుకుంది. ఈ కొత్త సచివాలయం ప్రత్యేకతలు ఎన్నో కలిగి ఉంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పాత సచివాలయం స్థానంలో కొత్తది నిర్మించారు. ఆదివారం ఈ నూతన సచివాలయ భవనం ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 28 ఎకరాల సువిశాల ప్రాంగణం.. 10.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునికంగా రూపుదిద్దుకుంది నూతన సెక్రటేరియేట్‌. తెలంగాణ సహా విభిన్న సంస్కృతులకు అద్దం పట్టే నిర్మాణ శైలులు ఉన్నాయి. ఇంద్ర భవనాన్ని తలపిస్తున్న నూతన పాలనా సౌధం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    సాగర తీరంలో..
    హుస్సేన్‌సాగర్‌ సమీపంలో పాత సచివాలయ భవనాలను తొలగించి కొత్త సముదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఆరు అంతస్తులుగా నిర్మితమైన ఈ భవనంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రవేశద్వారాలు మొదలు.. ముఖ్యమంత్రి కొలువుదీరే ఆరో అంతస్తు వరకు అడుగడుగునా ఆధునిక సౌకర్యాలు, సౌందర్యాల కలబోతగా నిర్మించారు. 650 మంది సిబ్బందితో సచివాలయానికి భద్రత కల్పించనున్నారు. నీటి సరఫరా, వాననీటి సంరక్షణ.. ఇలా పలు అంశాల్లో నూతన ప్రాంగణం తన ప్రత్యేకతను చాటనుంది.

    తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే చిత్రాలు..
    సచివాలయంలోనికి ప్రవేశించగానే తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే కళాకృతులు, పెయింటింగ్స్‌ అమర్చాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన చేర్యాల పెయింటింగ్స్‌ను ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. కొన్ని నమూనాలను ఇప్పటికే పరిశీలిస్తున్నారు.

    Telangana New Secretariat

    34 డోమ్స్‌.. రెండు జాతీయ చిహ్నాలు
    నూతన సచివాలయం మరో ప్రత్యేత 34 గుమ్మటాలు(డోమ్స్‌), జాతీయ చిహ్నమైన సింహాల బొమ్మలు. ఇవి కొత్త సచివాలయానికి మకుటాల్లా నిలిచాయి. కింది నుంచి ఎలాంటి ఆధారాలు లేకుండా నిర్మించిన డోమ్స్‌ నిర్మాణ కౌశలానికి నిదర్శనం. 165 అడుగుల ఎత్తున ప్రధాన గుమ్మటం నిర్మించారు. ఇలా సచివాలయానికి ముందు, వెనుక ప్రధాన గుమ్మటాలు కనిపిస్తాయి. ఇవి కాక మరో 32 ఉన్నాయి. ప్రధాన గుమ్మటాలపై జాతీయ చిహ్నమైన సింహాల విగ్రహాలను ఏర్పాటు చేశారు. 2.5 టన్నుల బరువుండే ఈ సింహాల బొమ్మలను ఢిల్లీలో సిద్ధం చేయించి తీసుకువచ్చి అమర్చారు.

    బాహుబలి మహాద్వారం
    సచివాలయ భవనం ఎంత చూడముచ్చటగా కనిపిస్తోందో అంతకు దీటుగా బాహుబలి మహాద్వారం చూపరులను ఆకట్టుకునేలా రూపొందించారు. 29 అడుగుల వెడల్పు, 24 అడుగుల ఎత్తున నాలుగు తలుపులతో దీన్ని తీర్చిదిద్దారు. ఆదిలాబాద్‌ అడవుల్లోని టేకు కలపను నాగ్‌పుర్‌ పంపి అక్కడ మహాద్వారాన్ని తయారు చేయించారు. కలపపై ఇత్తడి పోతతో నగిషీలు చెక్కించారు. మొత్తం సచివాలయ ప్రాంగణంలో 875కి పైగా తలుపులున్నాయి. అన్నీ టేకు కలపతో చేసినవే.

    ఆరో అంతస్తులో ముఖ్యమంత్రి కార్యాలయం..
    ఆరో అంతస్తులో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఏర్పాటైంది. పూర్తిగా తెల్లటి మార్బుల్‌ పరిచిన ఆ ప్రాంతం చూపరులను ముగ్ధులను చేస్తోంది. సీఎం కార్యాలయం, ఆయన సిబ్బందికి ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి ప్రజలను కలిసేందుకు, ప్రజాదర్బారు నిర్వహించేందుకు ‘జనహిత’ పేరిట కనీసం 250 మంది కూర్చునేలా ఒక హాలును ఏర్పాటు చేశారు. 25 మంది మంత్రులు, 30 మందికి పైగా అధికారులు కూర్చునేందుకు వీలుగా కేబినెట్‌ హాలును సిద్ధం చేశారు. కలెక్టర్లతో సమావేశాల నిర్వహణ కోసం 60 మంది కూర్చునేలా ఒక హాలు, 50 మంది సమావేశమయ్యేందుకు మరో హాలును నిర్మించారు. ఈ నాలుగు మందిరాలతోపాటు సీఎం విశిష్ట అతిథులతో కలిసి భోజనం చేసేందుకు.. సుమారు 25 మంది ఆసీనులయ్యేలా అత్యాధునిక డైనింగ్‌ హాల్‌ నిర్మించారు.

    Telangana New Secretariat

    విశాలమైన పార్కింగ్‌
    కొత్త సచివాలయ ప్రాంగణంలో వాహనాల కోసం విశాలమైన పార్కింగ్‌ సదుపాయం ఏర్పాటు చేశారు. ప్రాంగణంలో కేవలం సీఎం, మంత్రులు, అధికారులు, సిబ్బందికి మాత్రమే పార్కింగ్‌ సదుపాయం ఉంటుంది. సుమారు 2.5 ఎకరాల్లో అధికారులు, సిబ్బందికి చెందిన 560 కార్లు, 720 ద్విచక్ర వాహనాలు, నాలుగు బస్సులు ఏక కాలంలో పార్కింగ్‌ చేసేందుకు అవకాశం ఉంది. కనీసం 300 కార్లు పట్టే 1.5 ఎకరాల ప్రాంతాన్ని సందర్శకులకు కేటాయించారు. సాధారణ రోజుల్లో రోజుకు 700–800 మంది, అసెంబ్లీ సమావేశాల సమయంలో 1000 మంది వరకు సచివాలయానికి వస్తారన్న అంచనా వేశారు.

    హైటెక్‌ సెక్యూరిటీ..
    సచివాలయ భద్రతకు ప్రభుత్వం అత్యాధునిక వ్యవస్థను ఏర్పాటు చేసింది. సందర్శకుల వివరాలన్నీ భద్రతాధికారుల కంప్యూటర్‌ స్క్రీన్‌పై క్షణాల్లో ప్రత్యక్షమవుతాయి. ఆ భద్రతా వలయాన్ని దాటిన తరువాతే ఎవరైనా సచివాలయంలోనికి ప్రవేశించే అవకాశం ఉంటుంది. నిత్యం సుమారు 650 మందికిపైగా భద్రతా సిబ్బంది పహారా కాయనున్నారు. రాత్రీపగలూ నిరంతరాయంగా పనిచేసే పటిష్ఠమైన సీసీటీవీల కెమెరా వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేశారు. సందర్శకుల ఫేస్‌ రికగ్నిషన్‌ ద్వారా వారి సమాచారం ఆధార్‌ డేటాతో అనుసంధానమవుతుంది. పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంలో నిక్షిప్తమై ఉండే డేటా ద్వారా సందర్శకుని పూర్తి వివరాలు అప్పటికప్పుడే కంప్యూటర్‌ తెరపై కనిపిస్తాయి.

    గ్రంథాలయం.. బ్యాంకు.. క్యాంటీన్‌
    మునుపటి సచివాలయంలో కంటే నూతన ప్రాంగణంలో గ్రంథాలయాన్ని అధిక విస్తీర్ణంలో నెలకొల్పుతున్నారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ వైపు వచ్చేలా 2,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో క్యాంటీన్‌ నిర్మించారు. మరికొంత విస్తీర్ణంలో ఓపెన్‌ కిచెన్‌ను కూడా సిద్ధం చేశారు. బ్యాంకు, ఏటీఎంలకు సైతం కొంత స్థలాన్ని ప్రత్యేకించారు.

    ప్రత్యేక మార్గాలు
    తూర్పు వైపు నిర్మించినదే ప్రధాన ప్రవేశ ద్వారం(గేటు). ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారుల కోసం ఈ ద్వారాన్ని కేటాయించారు. ఈశాన్యంలో ఉన్న గేటు.. కింది స్థాయి అధికారులు, సిబ్బందికి, ఆగ్నేయం వైపు ఏర్పాటు చేసిన గేటు సందర్శకులకు కేటాయించారు. వాయవ్యంలో నిర్మించిన ద్వారం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వినియోగిస్తారు. ప్రధాన భవనం ముంగిట శాశ్వత హెలిప్యాడ్‌ను కూడా సిద్ధం చేస్తున్నారు.

    అందంగా ప్రార్థన మందిరాలు
    సచివాలయంలో మునుపటి మాదిరిగా హిందూ, ముస్లిం, క్రై స్తవ ప్రార్థన మందిరాలను ప్రభుత్వం నిర్మించింది. గతం కంటే విశాలంగా, సుందరంగా వీటిని తీర్చిదిద్దారు. ఆయా మత పెద్దల ఆకాంక్షల మేరకు నిర్మాణాలు చేయించుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. దేవాలయం, మసీదు, చర్చి కోసం సుమారు తొమ్మిది వేల చదరపు అడుగులను కేటాయించారు.

    రికార్డు సమయంలో పూర్తి
    ఇండో–పర్షియన్‌–అరేబియన్‌ నిర్మాణాల మిశ్రమ శైలి సచివాలయంలో కనిపిస్తుంది. పాతకాలపు ప్యాలెస్‌లు, ఆలయ గోపురాల తరహాలో నిర్మించారు. ఇలాంటి నిర్మాణాలు కొలిక్కి రావాలంటే నాలుగేళ్లకు పైగా సమయం పడుతుందని నిపుణుల అంచనా. కానీ సచివాలయం పనులు ప్రారంభమైన నాటి నుంచి 26 నెలల్లో పూర్తి చేయటం రికార్డేనని అధికారులు చెబుతున్నారు. సచివాలయ ఆకృతుల రూపకల్పనలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనేక గంటల సమయాన్ని వెచ్చించారు. ఆర్కిటెక్టులు, ఇంజినీర్లతో పలు దఫాలు చర్చించి తుదిరూపు ఇచ్చారు.

    Telangana New Secretariat

    వినూత్నంగా నీటి సరఫరా
    భవనంలోని వివిధ ప్రాంతాలకు నీటిని సరఫరా చేయాలంటే ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌ ఉండాలి. దాని నుంచి బాత్‌రూమ్స్, వాష్‌బేసిన్ల వంటి అన్ని అవసరాలకు నీరు సరఫరా అవుతుంది. సచివాలయంలో మాత్రం ఓవర్‌ హెడ్‌ ట్యాంకును అత్యవసర సందర్భాలకు మాత్రమే పరిమితం చేశారు. సాధారణ సందర్భాల్లో దీనికి బదులు హైడ్రో న్యుమేటిక్‌ సిస్టం ద్వారా అన్ని అంతస్తులకు నీటిని పంపిణీ చేయనున్నారు. భవనం సమీపంలో భారీ సంపును ఏర్పాటు చేసి అక్కడి నుంచి నీరు సరఫరా అయ్యేలా వ్యవస్థను నెలకొల్పారు.

    వాన చినుకులను ఒడిసిపట్టి..
    ఈ సౌధం పరిసరాల్లో కురిసిన ప్రతీ వాన చినుకునూ ఒడిసి పట్టేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రతి నీటి చుక్కా భూగర్భ సంపులో మిళితమయ్యేలా పైప్‌లైన్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇటీవల వర్షాలు కురిసిన సమయంలో.. సుమారు అడుగున్నర ఎత్తున వర్షపు నీరు సంపులోకి చేరటాన్ని అధికారులు గుర్తించారు.

    ఇక, ప్రాంగణానికి మరింత వన్నె తెచ్చేందుకు రెండు భారీ ఫౌంటెన్లు నిర్మించారు. పార్లమెంటులో ఉన్న మాదిరిగానే అదే ఎత్తు, అదే వైశాల్యంతో వాటిని ఏర్పాటు చేశారు. పార్లమెంటులో ఉపయోగించిన రెడ్‌ శాండ్‌ స్టోన్‌తోనే నిర్మించటం విశేషం.