Bandi Sanjay : బీజేపీలో పరిణామాలు క్యాడర్‌ను గందరగోళానికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో ఆ పార్టీ పరిస్థితిని రోజురోజుకూ దిగజారుస్తున్నాయి. సరిచేస్తామంటున్న అధిష్టానం.. చక్కదిద్దే చర్యల పేరుతో మరింత నష్టం కలిగిస్తోందన్న అభిప్రాయం క్యాడర్‌లో వ్యక్తమవుతోంది.
నాలుగు రోజుల క్రితం అధ్యక్షుల మార్పు..
ఇటీవలే ఏపీ, తెలంగాణతోపాటు మరో రెండు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులను అధిష్టానం మార్చింది. తెలంగాణ పగ్గాలను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి అప్పగించారు. హఠాత్తుగా బండి సంజయ్‌ను తప్పించారు. దీంతో బీజేపీలో గందరగోళం ఏర్పడింది. గోల్కోండ కోటపై కాషాయ జెండా ఎగురవేస్తామన్న బండి సంజయ్‌ను తప్పించడం చాలా మందికి రుచించలేదు. కొంతమంది ఒత్తిడికి అధిష్టానం తలొగ్గిందన్న చర్చ జరుగుతోంది.
‘బండి’కి ప్రాధాన్యం ఇస్తామని
ఇక బండిని తప్పించడంపై క్యాడర్‌లో నెలకొన్న అసంతృప్తిని గుర్తించిన అధిష్టానం వెంటనే సర్దుబటు చర్యలు చేపట్టింది. బండికి భవిష్యత్‌లో మంచి పదవి ఇస్తామని ప్రకటించింది. కేంద్ర క్యాబినెట్‌లోకి తీసుకుంటారన్న ప్రచారం కూడా జరిగింది. ఈమేరకు నడ్డా పిలిచి మంతనాలు జరుపడం కూడా ఇందుకు బలం చేకూర్చింది.
పార్టీ పదవితో సరిపుచ్చారు..
తమ నేతకు కేంద్ర క్యాబినెట్‌లో స్థానం కన్‌ఫాం అయిందని చాలా మంది నేతలు సంతృప్తితో ఉన్నారు. తమలోని కోపాన్ని అణచివేసుకున్నారు. కానీ, ఇంతలో బీజేపీ అధిష్టానం మరో తప్పు చేసింది. బండి సంజయ్‌ను కేంద్ర క్యాబినెట్‌లోకి తీసుకునే అవకాశం లేదసి సంకేతం ఇచ్చింది. అతడిని పార్టీ జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా నియమించింది. ఏపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు కూడా పార్టీ జాతీయ కమిటీలో స్థానం కల్పించి మమ అనిపించింది.
ఒకరికి ఒక పదవి..
బీజేపీలో ఒకరికి ఒకే పదవి సిద్ధాంతం అమలవుతోంది. ఈ నేపథ్యంలో కిషన్‌రెడ్డిని మంత్రి వర్గం నుంచి తప్పించి బండికి చాన్స్ ఇస్తారని అంతా భావించారు. రాజకీయ విశ్లేషకులు కూడా లెక్కలు వేశారు. బీసీ సామాజికవర్గం కూడా బండికి కలిసి వస్తుందని భావించారు. కానీ పార్టీ అధిష్టానం అనూహ్య నిర్ణయంతో అందరి అంచనాలను తలకిందులు చేసింది. ఒకరికి ఒకే పదవి నిబంధన ప్రకారం.. ఇక బండిని కేంద్ర క్యాబినెట్‌లోకి తీసుకునే అవకాశం లేదని తెలుస్తోంది. మరి పార్టీ అధిష్టానం నిర్ణయంపై బండి సంజయ్ వర్గం ఎలా స్పందిస్తుందో చూడాలి.