Homeక్రైమ్‌Hyderabad: కష్టపడి కానిస్టేబుల్ అయింది.. నచ్చినవాడిని మనువాడింది.. అదే ఆమె చేసిన నేరమైంది.. చివరికి ఏం...

Hyderabad: కష్టపడి కానిస్టేబుల్ అయింది.. నచ్చినవాడిని మనువాడింది.. అదే ఆమె చేసిన నేరమైంది.. చివరికి ఏం జరిగిందంటే..

Hyderabad: నాగమణిది దిగువ మధ్యతరగతి కుటుంబం. ఆమెకు చిన్నప్పటినుంచి పోలీస్ శాఖలో పని చేయాలని కలగా ఉండేది. దానిని నెరవేర్చుకునేందుకు తీవ్రంగా కష్టపడింది. చివరికి కానిస్టేబుల్ గా ఎంపికైంది. ప్రస్తుతం హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కానిస్టేబుల్ గా పనిచేస్తోంది. అయితే ఈమె కొంతకాలంగా ఓ యువకుడితో ప్రేమలో ఉంది. ఆ యువకుడు వేరే కులం కావడంతో పెళ్లి చేయడానికి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. కుటుంబ సభ్యులను ఒప్పించడానికి నాగమణి ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. దీంతో విసిగి వేసారి 15 రోజుల క్రితం తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అతనితో వేరే కాపురం పెట్టింది. నాగమణి కులం కాని వ్యక్తిని పెళ్లి చేసుకోవడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. ముఖ్యంగా ఆమె సోదరుడు పరమేష్ నాగమణిపై కోపంతో రగిలిపోయేవాడు. ఎలాగైనా నాగమణిని మట్టు పెట్టాలని నిర్ణయించాడు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం దారుణానికి పాల్పడ్డాడు.

ఏం జరిగిందంటే

నాగమణి తనకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకున్న తర్వాత ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ లో కాపురం పెట్టింది. అక్కడి నుంచే హయత్ నగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్తోంది. సోమవారం విధి నిర్వహణలో భాగంగా రాయపోలు ప్రాంతం నుంచి తన స్కూటీ మీదుగా హయత్ నగర్ బయలుదేరింది. రాయపోల్ ప్రాంతం దాటుతుండగా నాగమణి ప్రయాణిస్తున్న స్కూటీని ఆమె తమ్ముడు పరమేష్ తన కారు ద్వారా ఢీకొట్టాడు. దీంతో ఆమె ఒక్కసారిగా కింద పడిపోయింది . వెంటనే కారు నుంచి దిగిన పరమేష్ తన వద్ద ఉన్న కొడవలిని బయటకు తీసి నరికి చంపేశాడు. అతడు కొడవలితో ఒక్కసారిగా మెడ ప్రాంతం వద్ద వేటు వేయడంతో తీవ్ర గాయమైంది. రక్తస్రావం తీవ్రంగా కావడంతో నాగమణి అక్కడికక్కడే చనిపోయింది. ఈ విషయం తెలియడంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. పరమేష్ ను అదుపులోకి తీసుకున్నారు.. నాగమణి వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఆమె కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. గతంలో ఇదే విషయంపై ఇంట్లో ఆమె చెప్పగా కుటుంబ సభ్యులు వారించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అతడిని పెళ్లి చేసుకోవద్దని సూచించారు. అయినప్పటికీ నాగమణి వినిపించుకోలేదు. చివరికి ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకోవడంతో కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో తన అక్క చేసిన వ్యవహారం ఊళ్లో తలవంపులు తెచ్చిందని భావించి పరమేష్.. ఆమెను కారు తో ఢీ కొట్టించి.. కొడవలితో నరికిచంపాడు. వాజేడు ఎస్ఐ ఆత్మహత్య చేసుకోవడం.. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ మహిళా కానిస్టేబుల్ హత్యకు గురి కావడం.. ఇలా రెండు ఘటనలు తెలంగాణ పోలీస్ శాఖలో కలకలం సృష్టిస్తున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular