https://oktelugu.com/

Tiger Attack : పత్తి చేసులో మాటు వేసి.. కూలీపై దాడిచేసి.. పులి ప్రాణం తీసింది..

తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో నెల రోజులుగా పులుల సంచారం పెరిగింది. అటవీ గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇంతకాలం జంతువులపై పులులు దాడి చేశాయి. ఇప్పుడు రక్తం మరిగిన ఓ పులి కూలీలపై పంజా విసిరింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : November 30, 2024 / 11:39 AM IST

    Tiger Attack

    Follow us on

    Tiger Attack : చలికాలం వచ్చిందటే.. అడవుల జిల్లా ఆదిలాబాద్‌ చలితో వణుకుతుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో నమోదవుతాయి. అర్లిటి, గన్నెదరిలో ఇప్పుడు కూడా 10 డిగ్రీలకు దిగువన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లా ప్రజలు గజ గజ వణుకుతున్నారు. మరోవైపు నెల రోజులుగా ఉమ్మడి జిల్లాలో సంచరిస్తున్న పులులు అటవీ గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఇంతకాలం మేతకు వెళ్లిన ఆవులు, గేదెలు, మేకలపై దాడి చేసిన పులులు.. ఇప్పుడు మనుషులపై దాడి చేస్తున్నాయి. తాజాగా కాగజ్‌నగర్‌లో పత్తి చేనులో మాటు వేసిన ఓ రక్తం మరిగిన పులి.. కీలలపై పంజా విసిరింది. కాగజ్‌నగర్‌ మండలం నజ్రుల్‌నగర్‌ గ్రామ శివారులోని చేనులో పత్తి ఏరేందుకు గన్నారం గ్రామానికి చెందిన లక్ష్మి(21) శనివారం(నవంబర్‌ 29న) వెళ్లింది. చేనులోనే మాటువేసి ఉన్న పులి.. కాసేపటికే లక్ష్మిపై దాడిచేసింది. నోట కరుచుకుని వెళ్లింది. అక్కడే పనిచేస్తున్నవారు అరవడంతో కొంత దూరం వెల్లి వదిలేసింది. పులి పంజాతో లక్ష్మి మెడపై తీవ్ర గాయాలయ్యాయి. కొన ఊపిరితో ఉన్న లక్ష్మిని స్థానిక యువకులు ద్విచక్రవాహనంపై కాగజ్‌ నగర్‌కు తరలించారు. మార్గమధ్యలోనే లక్ష్మి ప్రాణాలు వదిలింది.

    అటవీశాఖ నిర్లక్ష్యంపై ఆందోళన..
    పులి సంచారంపై అటవీశాఖ అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని గ్రామస్తులు ఆందోళన చేశారు. కాగజ్‌నగర్‌ అటవీశాఖ కార్యాలయం ఎదుట మృతదేహంతో ధర్నా చేశారు. పులి కదలికపై శుక్రవారం సమాచారం ఇచ్చామని , అయినా అటవీ అధికారులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతి మృతికి కారణమైనవారిపై చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

    బాధిత కుటుంబానికి సాయం..
    ఇదిలా ఉంటే.. బాధితురాలు లక్ష్మి కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షల ఆర్థికసాయం ప్రకటించింది. ఐదెకరాల భూమి ఇస్తామని హామీ ఇచ్చింది. కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని తెలిపింది. దీంతో ఆందోళన విరమించారు.

    ఏడాది క్రితమే వివాహం..
    గన్నారం గ్రామానికి చెందిన వసంర్రావు–విమల దంపతుల కూతురు అయిన లక్ష్మికి ఏడాది క్రితమే గ్రామానికి చెందిన వాసుదేవ్‌తో వివాహమైంది. ఇదిలా ఉంటే.. లక్ష్మిపై దాడిచేయడానికి కొద్ది సేము ముందు అదే ప్రాంతంలో ఓ ఆవుపై పులి దాడిచేసిందని, తర్వాత లక్ష్మిపై దాడిచేసిందని స్థానికులు తెలిపారు.

    నాలుగేళ్లలో నలుగురు మృతి..
    ఇక పొరుగున ఉన్న మహారాష్ట్రలోని అడవుల నుంచి వస్తున్న పెద్ద పులులు మనుషులపై దాడిచేయడం ఆందోళన కలిగిస్తోంది. నాలుగేళ్లలో నలుగురిని చంపేశాయి. అందరూ పత్తిచేనుకు వెళ్లిన కూలీలే. 2020, నవంబర్‌ 11న ఓ మగ పులి దహెగాం మండలం దిగిడకు చెందిన సిడాం విగ్నేశ్‌(21)పై దాడిచేసి చంపింది. ఈ ఘటన జరిగిన 18 రోజులకే అంటే నవంబర్‌ 29న పెంచికల్‌పేట్‌ మండలం కొండపల్లికి చెందిన పసుల నిర్మల(18)పై పత్తిచేనులో దాడిచేసింది. పులిని బంధించేందుకు అధికారులు ప్రయత్నించినా చిక్కలేదు. ఇక 2022 నవంబర్‌ 15న వాంకిడి మండలం ఖానాపూర్‌కు చెందిన సిడాం భీము(69)పై పులి దాడిచేసింది. తాజాగా మోర్లె లక్ష్మి(21)ని మట్టుపెట్టింది.