Hyderabad Metro Telangana Government: భారత రాష్ట్ర సమితి కొద్ది రోజులుగా చేస్తున్న ప్రచారమే నిజమైంది. హైదరాబాద్ మెట్రో మొదటి దశ ప్రాజెక్టు నుంచి ఎల్ అండ్ టి సంస్థ తప్పుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఎల్ అండ్ టి సంస్థ సిఎండి, ప్రభుత్వ మధ్య అంగీకారం కుదిరింది. తద్వారా మెట్రో మొదటి దశ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి రంగం సిద్ధమైంది. ఎల్ అండ్ టి కి ప్రస్తుతం 13 వేల కోట్ల అప్పు ఉంది. ఈ అప్పును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేయనుంది. అంతేకాదు ఎల్ అండ్ టి కి తెలంగాణ ప్రభుత్వం ఏకంగా 2,100 కోట్లు నగదు చెల్లించనుంది..
హైదరాబాద్ మెట్రో దశను ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ₹22 వేల కోట్లతో నిర్మించారు. మెట్రో నిర్మాణం నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని ఆస్తులను ఎల్ అండ్ టి సంస్థకు కేటాయించింది. అయితే మొదటి నుంచి కూడా మెట్రో నిర్వహణ విషయంలో ఎల్ అండ్ టి సంస్థ అసంతృప్తిగా ఉంది. అనుకున్న స్థాయిలో టికెట్ల రేట్లు పెంచడానికి ప్రభుత్వం ఒప్పుకోకపోవడం.. ఇతర ఖర్చులు పెరిగిపోవడంతో ఎల్ అండ్ టీ సంస్థ ప్రారంభం నుంచి కాస్త ఇబ్బందిగానే వ్యవహరించింది. ఇటీవలి కాలంలో మెట్రో రెండో దశను నిర్మించడానికి ప్రభుత్వం నేరుగా ముందుకు రావడంతో ఎల్ అండ్ టీ లో అసహనం మరింత పెరిగిపోయింది. దీంతో మొదటి దశ నుంచి తప్పుకోవడానికి తాము సుముఖంగా ఉన్నట్టు ప్రభుత్వానికి తెలియజేసింది. దీంతో ప్రభుత్వం కూడా ఎల్ అండ్ టీ సంస్థ నిర్ణయానికి అంగీకారం తెలిపింది.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో హర్షాన్ని నింపుతుండగా.. గులాబీ నేతలు మాత్రం మండి పడుతున్నారు. రాజకీయంగా ఈ విమర్శల సంగతి ఎలా ఉన్నప్పటికీ.. మెట్రో ను ప్రభుత్వం శ్రద్ధ చేసుకోవడం పట్ల రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే మన దేశంలో మెట్రో కొన్ని నగరాలలో మాత్రమే లాభదాయకంగా ఉంది. మిగతా ప్రాంతాలలో నష్టాలలోనే ఉంది. అందువల్లే ప్రభుత్వం దీనిని సొంతం చేసుకోవడం వల్ల రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. ఇలాంటి స్థితిలో మెట్రోను సొంతం చేసుకోవడం.. ఆ స్థాయిలో డబ్బులు చెల్లించడం సాధ్యమేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎల్ అండ్ టి సంస్థ వల్ల కానప్పుడు.. ప్రభుత్వ మాత్రం ఎలా లాభదాయకంగా మారుతుందనేది చూడాల్సి ఉంది. మరోవైపు ఆస్తుల నిర్వహణ ప్రభుత్వం చేతికి వస్తే పరిస్థితి మారుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ అదే గనుక జరిగితే రేవంత్ తీసుకునే నిర్ణయం గేమ్ చేజర్ అవుతుందని విశ్లేషకులు అంటున్నారు.. ప్రభుత్వం చేతికి మెట్రో వచ్చిన తర్వాత చార్జీలు పెంచుతారా? ఇంకా ఏమైనా అదనపు ఆదాయ మార్గాలు అన్వేషిస్తారా? లేక సొంతం చేసుకున్న ఆస్తులను విక్రయిస్తారా? ఈ ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభించనుంది.. మరోవైపు మెట్రో రెండవ దశకు కేంద్రం అంతగా ఆసక్తి చూపించని స్థితిలో నిధులు లభ్యత ఎలా సాధ్యమనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.