Telangana Liquor Price
Telangana Liquor Price: తెలంగాణలో మందుబాబులకు గట్టి షాక్ తగలనుందని సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం ధరలను భారీగా పెంచేందుకు ప్రభుత్వ యోచనలో ఉంది. ఈ పెంపు ధరలను వచ్చే నెల ఫిబ్రవరి నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు ఎక్సైజ్ శాఖ నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఎక్సైజ్ శాఖ ఇప్పటికే ధరల పెంపుపై కసరత్తు పూర్తి చేసిందని సమాచారం. ఈ మేరకు, మద్యం ధరలు పెంచాలంటూ త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. బ్రాండెడ్ మద్యం, బ్రాండెడ్ బీర్లు, చీప్ లిక్కర్ ధరలను పెంచాలని ఈ కమిటీ సిఫార్సు చేసింది.
ఈ అంశంపై ఇటీవల ఎక్సైజ్ అధికారులు సచివాలయంలో సమావేశమై చర్చించినట్లు తెలిసింది. ప్రీమియం బ్రాండ్లపై, బీర్లపై దాదాపు 15 శాతం వరకు ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా, చీప్ లిక్కర్ రేట్లను తక్కువ శాతం పెంచాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం మరికొద్ది రోజుల్లో తుది నిర్ణయం తీసుకోనుంది.
ముఖ్యంగా బీర్ల ధరలను గట్టిగా పెంచేందుకు సర్కార్ యోచనలో ఉంది. రాష్ట్రానికి బీర్లు సరఫరా చేసే బ్రూవరీలు, ఉత్పత్తి కేంద్రాలకు చెల్లించే ధరలను ప్రభుత్వమే ప్రతి రెండేళ్లకోసారి పెంచుతోంది. ఈ సారి వివిధ రకాల బ్రాండ్లపై 20 రూపాయల నుంచి 150 రూపాయల వరకు ధరలను పెంచాలని బ్రూవరీలు కోరినట్లు సమాచారం. ఈ పెంపుదలలో భాగంగా, మద్యం ధరలు సుమారు 15 శాతం పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ మద్యం ధరలను 15 శాతం పెంచితే, ఎక్సైజ్ శాఖకు ప్రస్తుతం ఉన్న ఆదాయానికి అదనంగా మరో రూ. 5 వేల కోట్లు వచ్చే అవకాశముంది. ప్రస్తుతం ప్రభుత్వానికి మద్యం నుంచి వస్తున్న ఆదాయాన్ని 5318 కోట్ల రూపాయలు పెంచాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది.
తెలంగాణ వ్యాప్తంగా 2260 మద్యం దుకాణాలు, 1171 బార్లు ఉన్నాయి. వీటికి 6 బ్రూవరీల నుంచి ప్రతి సంవత్సరం 88 కోట్ల లీటర్ల బీరు ఉత్పత్తి అవుతుంది. మద్యం అమ్మకాల ద్వారా ఆదాయం భారీగా పెరుగుతోంది. ఇటీవల దసరా పండుగ సమయంలో 10 రోజుల్లో రూ. 1,100 కోట్లకు పైగా మద్యం అమ్మకాలయ్యాయి. అందులో 17.59 లక్షల బీర్ల కేసులు అమ్మకాలు జరిగాయి. ఈ ధరల పెంపు, ముఖ్యంగా బీర్లపై ప్రభావం చూపించనుంది. ఇందులో 15 శాతం వరకు ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.