CM Revanth Reddy: “చెయ్యేమో పెట్టాలంటోంది.. కన్నేమో జాగ్రత్త అంటూ సూచనలు చేస్తోంది.” ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు అప్పటి ఆర్థిక శాఖ మంత్రి కొణిజేటి రోశయ్య చేసిన వ్యాఖ్యలవి. ఆయన గతించి పోయినప్పటికీ కూడా ఇప్పటికీ రాజకీయ నాయకులు ఆ వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటారు. మంగళవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ఈ వ్యాఖ్యలు గుర్తుకు వచ్చినట్టు ఉన్నాయి. అందుకే చాలా స్పష్టంగా మాట్లాడారు. ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉన్నప్పటికీ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎన్నికలకు ముందు ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని, ఇందిరమ్మ సంక్షేమ రాజ్యాన్ని స్థాపిస్తామని రేవంత్ రెడ్డి పదేపదే ప్రకటించారు. ప్రజలు కూడా రేవంత్ చెప్పిన మాటలు విని కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారు.
అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అన్ని హామీలు అమలు చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. ” అధికారంలోకి వచ్చిన తర్వాత లంకె బిందెల కంటే ఖాళీకుండలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవడం వల్ల ఉద్యోగులకు సకాలంలో వేతనాలు కూడా వచ్చేవి కాదు.. ఒక్కో జిల్లాకు ఒక్కో రోజు వేతనాలు వేసేవారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులకు ఒకటి నుంచి 5వ తారీఖు లోపు వేతనాలు వేస్తున్నాం. గత ప్రభుత్వం మొత్తం అప్పులే చేసింది. అందుకే మెల్లిమెల్లిగా అన్నిటినీ సరి దిద్దుకొని వస్తున్నాం. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినప్పటికీ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని” రేవంత్ రెడ్డి అంటున్నారు. ఆరు గ్యారంటీల అమలులో భాగంగా ఉచిత విద్యుత్, 500 కే గ్యాస్ సిలిండర్ పథకాలను ఆయన మంగళవారం సచివాలయం వేదికగా ప్రారంభించారు. వాస్తవానికి ఈ పథకాలను చేవెళ్ల లో భారీ సభ నిర్వహించి రాష్ట్రవ్యాప్తంగా అమలుకు శ్రీకారం చుట్టాలనుకున్నారు. కానీ ఎమ్మెల్సీ కోడ్ వల్ల చివరి నిమిషంలో చేవెళ్ల సభ రద్దు చేసుకొని సచివాలయంలో ప్రారంభించారు.
వాస్తవానికి ఆరు గ్యారంటీల అమలకు ప్రభుత్వానికి అదనంగా నిధులు కావాలి. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి అంత బాగున్నట్టు కనిపించడం లేదు. పైగా 100 రోజుల్లోనే గ్యారంటీలు మొత్తం అమలు చేస్తామని ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటివరకు మహాలక్ష్మి పథకం మినహా మిగతావేవీ అమలుకు నోచుకోలేదు. అమలు చేయాలని ప్రభుత్వానికి ఉన్నప్పటికీ సరిపడా పైసలు లేకపోవడంతో రేవంత్ మల్ల గుల్లాలు పడుతున్నారు. మరోవైపు భారత రాష్ట్ర సమితి నాయకులు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు హామీలను తుంగలోకి తొక్కి.. ఇప్పుడేమో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. రైతుబంధు, పెంచిన పింఛన్ అమలుకు నోచుకోకపోవడంతో ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి నెలకొంది.. అయినప్పటికీ ఈ పథకాలు మొత్తం అమలు చేస్తామని రేవంత్ రెడ్డి అంటున్నారు. కాగా, గత ప్రభుత్వం రైతుబంధు పథకం అమల్లో ఇష్టానుసారంగా వ్యవహరించిన నేపథ్యంలో.. సరికొత్త విధివిధానాలు రూపొందించి రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామని రేవంత్ రెడ్డి అంటున్నారు. స్థూలంగా చెప్పాలంటే పథకాలు అమలు చేయాలని రేవంత్ రెడ్డికి ఉన్నప్పటికీ.. ఖజానాలో డబ్బులు లేకపోవడం ప్రతిబంధకంగా మారుతోంది. పార్లమెంటు ఎన్నికల ముందు ఈ ప్రతిబంధకాలను రేవంత్ రెడ్డి ఎలా అధిగమిస్తారో వేచి చూడాల్సి ఉంది.