KCR Arrest: గులాబీ బాస్.. ఈ పేరు వినగానే తెలంగాణ ప్రజలందరికీ అర్థమవుతుంది.. ఆయనే రెండు పర్యాయాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా, ప్రత్యేక రాష్ట్ర సాధకుడిగా కేసీఆర్‌కు తెలంగాణ ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. కానీ, పదేళ్ల పాలనలో జరిగిన అక్రమాలు.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కోటి తవ్వి తీస్తోంది. ఇందులో ప్రధానమైనది కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటు. దీనిపై ఏర్పాటు చేసిన కమిషన్.. ఇటీవలే నివేదిక ఇచ్చింది. ప్రాజెక్టు కుంగుబాటుకు కర్త, కర్మ, క్రియ కేసీఆర్ అని తేల్చింది. దీంతో గులాబీ బాస్‌కు ఇప్పుడు అరెస్ట్ భయం పట్టుకుంది. ఈ విషయమై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
Also Read: ఘాటీ ట్రైలర్ రివ్యూ…ఆ షాట్స్ ను ఆ సినిమా నుంచి కాపీ చేశారా..?
టార్గెట్ కేసీఆర్..
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం, నిర్మాణంలో అవకతవకలు, ఆర్థిక నష్టాలపై రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఈ ఆరోపణలను విస్తృతంగా అసెంబ్లీలో చర్చించి, కేసీఆర్‌ను ప్రధాన నిందితుడిగా (ఏ1) చిత్రీకరించే అవకాశం ఉంది. హరీశ్‌రావు ఈ చర్యలను కక్షపూరితంగా అభివర్ణిస్తున్నప్పటికీ, ప్రభుత్వం దీనిని అవినీతిపై పోరాటంగా చిత్రీకరిస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ అరెస్టు అనివార్యమైతే, బీఆర్‌ఎస్ దానిని ఎదుర్కొనే వ్యూహాలు రూపొందించడం కీలకం. కేసీఆర్ తెలంగాణ ఉద్యమ నాయకుడిగా, రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. బీఆర్‌ఎస్ ఆయనను ‘తెలంగాణ జాతిపిత‘గా ప్రచారం చేస్తుంది. అయితే, ఆయన అరెస్టు జరిగితే ప్రజల నుంచి స్పందన ఎలా ఉంటుందనేది అనిశ్చితంగా ఉంది. కేసీఆర్ కుమార్తె కవిత అరెస్టు సమయంలో ప్రజలు లేదా బీఆర్‌ఎస్ నాయకుల నుంచి గణనీయమైన స్పందన రాలేదు. ఇది కేసీఆర్ అరెస్టు విషయంలోనూ జరిగే అవకాశం ఉంది. రేవంత్ సర్కార్ కాళేశ్వరం ఆరోపణలను ప్రజల ముందు పారదర్శకంగా చర్చిస్తోంది. దీనివల్ల కేసీఆర్ అరెస్టును ‘అవినీతి నిరోధక చర్య‘గా చాలా మంది అర్థం చేసుకునే అవకాశం ఉంది, ఫలితంగా సానుభూతి తగ్గవచ్చు.
సానుభూతి కష్టమే?
రాజకీయ నాయకుల అరెస్టులను ప్రజలు రెండు దృక్కోణాల నుంచి చూస్తారు. నిజమైన అవినీతి కేసులు లేదా కక్షపూరిత చర్యలు. ఏపీలో చంద్రబాబు అరెస్టు సమయంలో స్పష్టమైన విచారణ లేకపోవడం, రాత్రికిరాత్రి అరెస్టు చేయడం వల్ల ప్రజలు దానిని కక్షపూరితంగా భావించి సానుభూతి చూపారు. కానీ రేవంత్ సర్కార్ కాళేశ్వరం ఆరోపణలను పారదర్శకంగా, విస్తృతంగా చర్చిస్తూ కేసీఆర్‌ను అవినీతి నాయకుడిగా చిత్రీకరిస్తోంది. ఇది ప్రజల్లో ‘అరెస్టు సమంజసం‘ అనే భావన కలిగించవచ్చు, ఫలితంగా సానుభూతి తగ్గే అవకాశం ఉంది. కేసీఆర్ సీఎం హోదాలో ఉన్నప్పుడు విపక్ష నాయకులపై తీసుకున్న చర్యలు ఇప్పుడు బీఆర్‌ఎస్‌కు సవాలుగా మారాయి. రేవంత్‌ను బీఆర్‌ఎస్ ప్రభుత్వం అనేకసార్లు అరెస్టు చేసి, వివాదాస్పద డ్రోన్ కేసులో జైల్లో పెట్టింది. ఆయన కుమార్తె వివాహానికి కూడా స్వేచ్ఛగా హాజరయ్యే అవకాశం ఇవ్వలేదు. ఒక వాట్సాప్ ఫార్వార్డ్ ఆధారంగా అరెస్టు చేయడం వంటి చర్యలు ప్రజల జ్ఞాపకంలో ఉన్నాయి. ఈ గత చర్యలు ప్రజల మనసులో ఉండడం వల్ల, కేసీఆర్ అరెస్టును ‘ప్రతీకారం‘ లేదా ‘కర్మ ఫలం‘గా భావించే అవకాశం ఉంది. ఇది బీఆర్‌ఎస్‌కు సానుభూతిని తగ్గించి, పార్టీ ఉనికికి ముప్పు తెచ్చే ప్రమాదం ఉంది.
బీఆర్‌ఎస్ కిం కర్తవ్యం..?
కేసీఆర్ అరెస్టు జరిగితే బీఆర్‌ఎస్ ఎలాంటి వ్యూహాలు అవలంబించవచ్చు అన్న ప్రశ్న తలెత్తుతోంది. కేసీఆర్‌ను రాజకీయంగా బలిపశువుగా చేస్తున్నారని ప్రచారం చేసి, ప్రజలను రోడ్డెక్కించే ప్రయత్నం చేయవచ్చు. అయితే, కవిత అరెస్టు సమయంలో స్పందన లేకపోవడం ఇందుకు సవాలుగా నిలుస్తుంది. రేవంత్ సర్కార్ చర్యలను కక్షపూరితంగా చిత్రీకరించి, కాంగ్రెస్‌ను రాజకీయంగా ఒంటరి చేయడానికి ప్రయత్నించవచ్చు. పార్టీ క్యాడర్‌లో ఉత్సాహం నింపడానికి కేసీఆర్ స్వయంగా ధైర్యం చెపుతున్నారు. అయితే, సానుభూతి లేకపోతే ఈ ఐక్యత నిలబడటం కష్టం. కేసీఆర్ వయసు, ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం అరెస్టు బదులు విచారణ మాత్రమే నిర్వహించే అవకాశం ఉంది. ఇలా చేయడం వల్ల.. రేవంత్ రెడ్డి ‘సంయమనం‘, ‘మానవీయ దృక్పథం‘ కలిగిన నాయకుడిగా కనిపిస్తారు. దీంతో బీఆర్‌ఎస్‌కు సానుభూతి వచ్చే అవకాశం తగ్గుతుంది. ప్రజల్లో కాంగ్రెస్‌పై సానుకూల భావన పెరుగుతుంది.