BRS Party reputation crisis: తెలంగాణ రాజకీయ చరిత్రలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఒకప్పుడు అజేయ శక్తిగా ఉండేది. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)గా ఉన్న సమయంలో, ఈ పార్టీ తెలంగాణ ఉద్యమానికి పర్యాయపదంగా మారింది. అయితే, 2023 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ పార్టీ ఊహించని రీతిలో దిగజారింది. ఒకప్పుడు ఆకాశాన్ని తాకిన ఈ పార్టీ ఇప్పుడు దినదినం రాజకీయ పతనం దిశగా పయనిస్తోంది.
తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పుట్టిన పార్టీ బీఆర్‌ఎస్ అలియాస్ టీఆర్‌ఎస్. తెలంగాణ ఉద్యమమే లక్ష్యంగా కేసీఆర్ నాయకత్వంలో ఈ పార్టీ 2001లో స్థాపించబడి, రాష్ట్ర ఏర్పాటు కోసం నిరంతరం పోరాడింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, బీఆర్‌ఎస్ రాజకీయంగా బలపడింది. కేసీఆర్ నాయకత్వంలో ఈ పార్టీ రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చి, తెలంగాణలో ఏకపక్ష ఆధిపత్యాన్ని స్థాపించింది. ఇతర పార్టీల నాయకులను ఆకర్షించి, వారిని కలుపుకుని, బీఆర్‌ఎస్ ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదిగింది. అయితే, ఈ వేగవంతమైన ఎదుగుదలే దాని పతనానికి మూలంగా మారింది. రాజకీయంగా అత్యంత ఆధిపత్యం కోసం చేసిన ప్రయత్నాలు, ప్రత్యర్థి పార్టీలను బలహీనపరచడం, ఒకే పార్టీ వ్యవస్థను సష్టించాలనే ఆలోచన ప్రజలలో వ్యతిరేకతను రేకెత్తించాయి.
ఊహించని ఓటమి..
2023 అసెంబ్లీ ఎన్నికలు బీఆర్‌ఎస్‌కు ఊహించని దెబ్బను ఇచ్చాయి. ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం ఇవ్వడంతో, బీఆర్‌ఎస్ అధికారాన్ని కోల్పోయింది. ఈ ఓటమి ఒక్కసారిగా పార్టీని కుదేలు చేసింది. దీనికి తోడు, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది, చాలా నియోజకవర్గాల్లో డిపాజిట్లు కూడా కోల్పోయింది. ఈ ఫలితాలు పార్టీ బలం, ప్రజాదరణ గణనీయంగా తగ్గాయని స్పష్టం చేశాయి. ఈ ఓటముల వెనుక ప్రజలలో వచ్చిన అసంతృప్తి, అధికార దుర్వినియోగ ఆరోపణలు, పార్టీ నాయకత్వం ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకపోవడం ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. బీఆర్‌ఎస్ తమను తెలంగాణకు పర్యాయంగా చూపించుకోవడం ప్రజలకు ఇకపై ఆమోదయోగ్యంగా లేదని ఈ ఎన్నికలు స్పష్టం చేశాయి.
కుటుంబ రాజకీయాలు..
బీఆర్‌ఎస్ పతనానికి మరో కీలక కారణం కుటుంబ రాజకీయాలు. కేసీఆర్ కుటుంబం పార్టీలో ప్రధాన పాత్ర పోషిస్తుండటం, ముఖ్యంగా కవిత, కేటీఆర్‌లు కీలక బాధ్యతలు నిర్వహిస్తుండటం విమర్శలకు దారితీసింది. ఇటీవల కవిత చుట్టూ ఉన్న వివాదాలు, ఆమె కొత్త పార్టీ పెట్టే అవకాశం గురించి వస్తున్న వార్తలు పార్టీలో అంతర్గత చీలికను సూచిస్తున్నాయి. ఇది బీఆర్‌ఎస్‌కు నైతికంగా, రాజకీయంగా ఒక పెద్ద దెబ్బగా చెప్పవచ్చు. ఈ చీలిక పార్టీ క్యాడర్‌లో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. కేసీఆర్ కుటుంబంలోనే ఐక్యత లేనప్పుడు, పార్టీ బలోపేతం కావడం కష్టమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
నాయకత్వ సంక్షోభం..
కేసీఆర్ ఎన్నికల ఓటమి తర్వాత రాజకీయంగా పార్టీని పట్టించుకోవడం మానేశారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటికీ, ఆయన సమావేశాలకు హాజరు కావడం లేదు. పార్టీ వ్యవహారాల్లో చురుకుగా పాల్గొనడం మానేశారు. ఇది పార్టీ క్యాడర్‌లో నిరాశను పెంచింది. పైగా, కేటీఆర్ నాయకత్వం కూడా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోంది. ఆయన భావోద్వేగ నిర్ణయాలు, తిట్ల రాజకీయాలు పార్టీ ఇమేజ్‌ను మరింత దెబ్బతీశాయి. బీఆర్‌ఎస్ ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభంలో ఉంది. పార్టీ ఉనికిని కాపాడుకోవడం ఒక పెద్ద సవాల్‌గా మారింది. ప్రజలలో తిరిగి విశ్వాసం పొందడం, అంతర్గత చీలికలను అధిగమించడం, కొత్త నాయకత్వాన్ని రూపొందించడం బీఆర్‌ఎస్ ముందున్న ప్రధాన సవాళ్లు. పార్టీ తన పాత ఉద్యమ శైలిని వదిలి, ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త వ్యూహాలను రూపొందించాల్సి ఉంది.