Medaram Earthquake : ఒక ఘటన జరిగితే ఈ యాదృచ్చికమంటాం.. మరోసారి జరిగితే దురదృష్టం అంటాం. ఇంకోసారి జరిగితే దారుణం అంటాం. ఇప్పుడు మేడారం విషయంలోనూ అదే జరుగుతోంది.. దట్టమైన అడవికి కేంద్రంగా.. సమ్మక్క సారలమ్మ కు విడిదిగా మేడారం ఉంది. ఈ మేడారం లో రెండు సంవత్సరాలకు ఒకసారి ఫిబ్రవరి నెలలో జాతర జరుగుతుంది.. ఇది ఆసియా ఖండంలోనే అత్యంత పెద్దదైన గిరిజన జాతర. ఈ జాతరకు లక్షలాదిమంది భక్తులు వస్తుంటారు. దీనిని తెలంగాణ కుంభమేళాగా పేర్కొంటారు. అటువంటి ఈ ప్రాంతంలో మేడారం జాతరను గిరిజన పూజారులు దగ్గరుండి నిర్వహిస్తారు. వారి పూజా విధానం కూడా భిన్నంగా ఉంటుంది. అయితే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో పూజలు నిర్వహించే పూజారులు ఇటీవల చనిపోయారు. నెలల వ్యవధిలోనే అనారోగ్యానికి గురై కన్నుమూశారు. పూజారులు ఇలా చనిపోవడం మిగతా వారికి సహజ ప్రక్రియ లాగా కనిపించినప్పటికీ.. ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు మాత్రం ఏదో కీడు లాగా అనిపించింది. ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకే ఇటీవల బీభత్సమైన గాలి ఆ ప్రాంతంలో వచ్చింది. మేడారం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న అడవిని నేలమట్టం చేసింది. వేలాది వృక్షాలు నేలకూలాయి. ఈ ఘటన జరిగే ఒకరోజు ముందు అక్కడ ఉండే కోతులు, దుప్పులు, ఇతర అటవీ జంతులు కేకలు వేసుకుంటూ భయపడి దూరంగా వెళ్లిపోయాయి. అవి వెళ్లిపోయిన మరుసటి రోజు అక్కడ చండ ప్రచండమైన వేగంతో గాలులు వీచాయి. వేలాది వృక్షాలు నేలకొరిగాయి. వీటిని ప్రకృతిలో జరిగే మార్పు అని శాస్త్రవేత్తలు కొట్టి పారేసినప్పటికీ.. ఏదో జరుగుతోందనే భయం మాత్రం ఇక్కడి ప్రజల్లో ఉంది.
భూమి కంపించింది
ఇక బుధవారం తెలుగు రాష్ట్రాలలో నమోదైన స్వల్ప భూకంపం మేడారం కేంద్రం గానే మొదలైంది. బుధవారం ఉదయం మేడారం గద్దె స్వల్పంగా ఊగింది. ఉదయమే అమ్మ వార్లకు పూజలు చేయడానికి ఓ మహిళ అక్కడికి వచ్చింది. ఆమె అక్కడికి చేరుకోగానే కొంత సమయం తర్వాత గద్దెలు ఊగినట్టు కనిపించింది. ఆమెలో ఆందోళన మొదలైంది. ఆ తర్వాత ఈ విషయాన్ని బయటికి వచ్చి చుట్టుపక్కల ఉన్న వాళ్లకు చెప్పింది. ఆ తర్వాత వరంగల్, కరీంనగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో భూమి స్వల్పంగా కంపించింది. అయితే ఈ సంఘటనలు మొత్తం మేడారం, దాని చుట్టుపక్కల ప్రాంతాల కేంద్రంగా జరగడం అనేక అనుమానాలకు తావిస్తోంది. “మొన్న పూజారులు చనిపోయారు. నిన్న భారీగా చెట్లు కూలిపోయాయి. ఇవాళ భూకంపం వచ్చింది. చూస్తుంటే ఏదో జరుగుతోంది.. పెనువిపత్తు సంభవిస్తుందా? ప్రకృతి ఏమైనా చెప్పాలి అనుకుంటున్నదా? వీటన్నింటికీ మేడారం, దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు కేంద్రాలు కావడం ఆందోళన కలిగిస్తున్నది. ఇటీవల జరిగిన జాతరలో అమ్మవార్లకు ఏమైనా తక్కువ జరిగిందా? జాతర నిర్వహణలో ఏదైనా అపచారం చోటు చేసుకుందా?” అనే అనుమానాలు మేడారం వాసుల్లో వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇవన్నీ ప్రకృతిలో సంభవించే మార్పులేనని, వీటికి విపరీతార్థాలు తీయొద్దని శాస్త్రవేత్తలు అంటున్నారు. మూఢనమ్మకాలను వ్యాప్తి చేయొద్దని సూచిస్తున్నారు.