Shakeel: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ షకిల్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. బియ్యం అక్రమ రవాణా కేసులో ఆయన,ఆయన కుటుంబ సభ్యుల మెడకు చుట్టుకుంటోంది. షకీల్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేశారంటూ.. ఆయనపై సివిల్ సప్లై అధికారులు వర్ని,కోటగిరి పోలీసు స్టేషన్లో ఫిర్యాదులు చేశారు. అయితే ఈ కంప్లైంట్స్ ను ఆయా పోలీస్ స్టేషన్స్ లోని ఎస్.హెచ్.ఓలు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించి కేసులు నమోదుకు ఆదేశాలు జారీ చేయాల్సిందిగా అభ్యర్థించారు.
ఇక వారి అభ్యర్థనను పరిశీలించిన హైకోర్టు..మహమ్మద్ షకీల్ పై వచ్చిన ఫిర్యాదుల్లో ప్రైమ్ ఆఫ్ పైసీ ఉన్నందున వెంటనే షకీల్ పై కేసులు నమోదు చేసి..41ఎ సిఆర్పిసి కింద నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా ఎస్పీకి హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. అంతేకాక ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నివేదికను ఈనెల 21వ తేదీన హైకోర్టుకు సమర్పించాలని ఉత్తరుల్లో పేర్కొంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుటుంబ సభ్యులకు రైస్ మిల్లు ఉన్నాయి. ఈ రైస్ మిల్లులకు రైతుల నుంచి కొనుగోలు చేసిన 50,732 టన్నులు ధాన్యాన్ని సరఫరా చేయడం జరిగింది.
అయితే ఈ స్థాయిలో సరఫరా చేసిన ధాన్యంలో షకీల్ కుటుంబ సభ్యులు భారీ అవకతవకలకు పాల్పడినట్లు సివిల్ సప్లై అధికారులు తేల్చారు. మొత్తం 30 వేల టన్నుల ధాన్యం విషయంలో గోల్మాల్ జరిగినట్లు తేలింది. అంతేకాక 70 కోట్ల విలువైన బియ్యంకు సంబంధించిన వ్యవహారంలో లెక్కా పత్రం లేకపోవడంతో..పౌరసరఫరాల అధికారులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక ఇప్పుడు ఇదే కేసు విషయంలో హైకోర్టు సీరియస్ గా ఉండడంతో.. షకీల్ కుటుంబం ఆందోళన గురవుతుంది. ఎప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడతాయోనని టెన్షన్ పడుతోంది.