IAS Officers: ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, కాటా ఆమ్రపాలి, వాణి ప్రసాద్, ప్రశాంతి, రోనాల్డ్ రాస్, ఐపీఎస్ అధికారులు అంజనికుమార్, అభిలాష బిస్త్, అభిషేక్ మహంతి ఆంధ్రప్రదేశ్ కేడర్ అధికారులుగా కొనసాగుతున్నారు. వీరు వెంటనే రిలీవ్ కావాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఇక తెలంగాణ కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారులు శ్రీజన, హరి కిరణ్, శివశంకర్ ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్నారు. అయితే వీరంతా తమ క్యాడర్ మార్చాలని గతంలో కేంద్రంలోని అంతర్గత వ్యవహారాల శాఖకు దరఖాస్తు చేశారు. ఈ దరఖాస్తు దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉంది. అయితే దీనిపై వెంటనే తుది నిర్ణయం తీసుకోవాలని ఇటీవల తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది.. ఈ క్రమంలో దీపక్ కండేకర్ ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్ ను ఏర్పాటు చేసింది. రెండు రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్ అధికారులు ఈ ఏడాది జూలైలో ఢిల్లీ వెళ్లారు. తాము క్యాడర్ మార్పు కోరుకుంటున్న నేపథ్యంలో… కమిషన్ ఎదుట తమ వాదనలు వినిపించారు. వారు చేసిన ప్రతిపాదనలను కమిషన్ తిరస్కరించిందని తెలుస్తోంది. అందువల్లే తాము లేఖలు పంపించామని కేంద్రం వెల్లడించింది. రిలీవ్ కావలసిన అధికారులు ఈనెల 16 లోగా.. వారికి బదిలీ జరిగిన రాష్ట్రాలలో రిపోర్ట్ చేయాలి. కొంతమంది ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు తెలంగాణలో పనిచేస్తుండగా.. వారు ఆంధ్రప్రదేశ్ వెళ్ళడానికి ఆసక్తి చూపించడం లేదు. వారు తమకు ఉన్న రాజకీయ పలుకుబడితో తెలంగాణ రాష్ట్రంలోనే పనిచేయడానికి మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.
కేడర్ కేటాయింపు జరిగినప్పటికీ..
రాష్ట్ర విభజన సమయంలో ఆల్ ఇండియా స్టేట్ సర్వీస్ అధికారులకు కేంద్రం పక్క రాష్ట్రంలో పనిచేయాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే వారంతా కూడా తెలంగాణలో పనిచేస్తున్నారు. కొంతమంది తెలంగాణ కేడర్ అధికారులు ఆంధ్రలో పనిచేస్తున్నారు. అయితే వీరంతా కూడా 16 లోపు సొంత కేడర్ రాష్ట్రంలో చేరిపోవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రకారం ఆమ్రపాలి, రోనాల్డ్ రాస్, ప్రశాంతి, వాణి ప్రసాద్, వాకాటి కరుణ, ఐపీఎస్ కు అంజని కుమార్, అభిలాష ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లి పనిచేయాల్సి ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో తెలంగాణకు కేటాయించినప్పటికీ కొంతమంది అధికారులు ఆంధ్రప్రదేశ్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అందులో 2013 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన సృజన విజయవాడ కలెక్టర్ గా పనిచేస్తున్నారు. 2013 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన శివశంకర్ కడప కలెక్టర్ గా పని చేస్తున్నారు.
2009 హరి కిరణ్ ఏపీ ప్రజారోగ్య శాఖ సంచాలకుడిగా పనిచేస్తున్నారు.. 2010 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఆమ్రపాలి కాట గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తున్నారు. 1995 ఐఏఎస్ బ్యాచ్ కి చెందిన వాణి ప్రసాద్ అటవీశాఖ సెక్రటరీగా పనిచేస్తున్నారు. 2004 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన వాకాటి కరుణ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో సెక్రటరీగా పనిచేస్తున్నారు. అయితే తెలంగాణ కేడర్ కు తమన కేటాయించాలని ఏపీకేడర్ ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు రావత్, అనంతరామ్ ను విజ్ఞప్తిని కేంద్రం తిరస్కరించింది. దసరా అనంతరం ఆలిండియా సర్వీస్ అధికారులను తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేస్తుందని సమాచారం.