Revanth Reddy : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా రెండుసార్లు అధికారం చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆ తరువాత ప్రత్యేక రాష్ట్ర పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కాస్త రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. దాంతో ప్రత్యేక రాష్ట్రానికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర అపజయాన్ని చూడాల్సి వచ్చింది. అలా రెండు పర్యాయాలు కూడా కాంగ్రెస్ పార్టీ కనీసం గట్టి పోటీని కూడా ఇవ్వలేకపోయింది. గతం.. గతః అన్నట్లు.. దశాబ్ద కాలం తరువాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టింది. తిరుగులేని మెజార్టీ సాధించి కాంగ్రెస్ జెండా ఎగురవేసింది.
రెండు పర్యాయాలు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీని మట్టికరిపించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే దాని వెనుక ఉన్నది ముమ్మాటికీ రేవంత్ రెడ్డి అనే చెప్పాలి. ఎప్పుడైతే ఆయన టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారో.. అప్పటి నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఊపు వచ్చినట్లయింది. ఆ వెంటనే ఆయనకు పీసీసీ పదవి ఇవ్వడం మరింత కలిసొచ్చింది. కనుమరుగైన పార్టీ కాస్త మరోసారి ఊపిరిపీల్చుకున్నంత పానైంది. పార్టీ గెలుపును నెత్తిన వేసుకున్న రేవంత్ రెడ్డి.. అదే లక్ష్యంతో ముందుకు సాగారు. రాష్ట్రం మొత్తం చుట్టివచ్చారు. చివరకు పార్టీని అధికారంలోకి తెచ్చారు. అలా కేవలం అసెంబ్లీ ఎన్నికల్లోనే కాకుండా పార్లమెంట్ ఎన్నికల్లోనూ పార్టీకి మెజార్టీ స్థానాలు తీసుకువచ్చారు. చేసిన చాలెంజ్ ప్రకారం బీఆర్ఎస్ పార్టీకి ఒక్కటంటే ఒక్క ఎంపీ సీటు కూడా రాకుండా అడ్డుకోగలిగారు.
దశాబ్ద కాలం తరువాత కాంగ్రెస్ పార్టీకి అధికారం చేజిక్కింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి పది నెలలు మాత్రమే కావస్తోంది. అయితే.. ఈ కాలంలో ఎన్నికల వేళ ఇచ్చిన హామీలన్నింటినీ దాదాపు నెరవేర్చడంలోనూ ఆయన సక్సెస్ అయ్యారు. ఆరు గ్యారంటీలలో ఒకటి రెండు మినహా.. అన్నింటినీ విజయవంతంగా అమలు చేస్తున్నారు. అటు రైతులకు సైతం రుణమాఫీ చేసి శెభాష్ అనిపించుకున్నారు. మహిళలకు బస్సుల్లో ఫ్రీ జర్నీతో వారి ఆశీస్సులు పొందారు. అటు.. వేల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ యువతను కూడా చేరదీశారు.
ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. రేవంత్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ఇప్పుడు ఆయన మనుగడనే ప్రశ్నార్థకంలో పడేసింది. అదే హైడ్రా. హైడ్రా ఇప్పుడు రేవంత్‌కు సంకటంగా మారిందనే చెప్పాలి. హైడ్రా మొదటి నెల కార్యకలాపాలకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. ఇక సినీనటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చిన వేళ మరింత మద్దతుగా నిలిచారు. దాంతో హైడ్రాకు రేవంత్ రెడ్డి సర్వాధికారాలు కట్టబెట్టారు. అదనపు సిబ్బందిని సైతం నియమించారు. చట్టానికి కూడా సవరణ చేసి జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారాలనూ బదిలీ చేశారు. దీంతో ముందు ముందు కేటీఆర్ ఫామ్ హౌజ్, బీఆర్ఎస్ నేతలు మల్లారెడ్డి కాలేజీలు, ఎంఐఎం నేతల కబ్జాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుందని అందరూ భావించారు. కానీ.. హైడ్రా అనూహ్యంగా టర్న్ తీసుకొని నిరుపేద, మధ్యతరగతి ఇళ్లను కూల్చేయడం ప్రారంభించింది. దాంతో వందలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వారంతా ఇప్పుడు రేవంత్ రెడ్డిపై, ఆయన ప్రభుత్వంపై శాపనార్థాలు పెడుతున్నారు. అప్పో సప్పో చేసి ఇల్లు కొనుక్కొని, నెలనెలా ఈఎంఐలు చెల్లిస్తూ బతుకుతున్నామని కొందరు ఏడిస్తే.. తమకు ఉపాధి లేకుండా చేశారని మరికొందరు ఏడువడం కనిపించింది.
హైడ్రాపై ఇంతలా వ్యతిరేకత వస్తున్నప్పటికీ ఇంతవరకు ఏ ఒక్క కాంగ్రెస్ నేత కూడా నోరు మెదపడం లేదు. బహుశా రేవంత్ రెడ్డికి కూడా ఈ ఫీడ్ బ్యాక్ ఇస్తలేరేమోనన్న అనుమానాలు సైతం ఉన్నాయి. కొన్నికొన్ని సందర్భాల్లో పార్టీ వైఖరిని సైతం తప్పుపట్టిన సీనియర్లు కూడా ఇప్పుడు ఏం మాట్లాడడం లేదు. అయితే.. వారందరికీ రేవంత్ రెడ్డిపై ఉన్న కోపమా..? లేక రేవంత్ రెడ్డి ఆ పదవి దిగిపోవాలని కోరుకుంటున్నారా..? అనేది తెలియకుండా ఉంది. మొత్తానికి సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతున్న ప్రభుత్వానికి ఇప్పుడు హైడ్రా పెద్ద తలనొప్పిలా తయారైందనే విమర్శలూ వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రజల రోదనలు విని రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గుతారా..? అక్రమాలను వదిలేదే లేదు అని అలానే ముందుకు సాగుతారా..? అనేది చూద్దాం.