Cold Wave: పంజా విసురుతున్న చలి పులి… భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు..

శనివారం కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని సిర్పూర్, గిన్నెదరి ప్రాంతాల్లో అతి తక్కువగా 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆసిఫాబాద్‌ 8.8, తిర్యానీలో 8.9, సోనాలలో 8.5, బేల 9.2, బజార్‌ హత్నూర్‌లో 9.3, పొచ్చెరలో 9.5, పెంబిలో 9.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

Written By: Raj Shekar, Updated On : December 25, 2023 1:20 pm

Cold Wave

Follow us on

Cold Wave: చలి పులి పంజా విసురుతోంది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ప్రజలు గజగజ వణుకుతున్నారు. రాబోయే రెండు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ చలి తీవ్రత పెరుగుతోంది. విశాఖ, శ్రీకాకులం జిల్లాలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ముఖ్యంగా రాత్రుళ్లు చలి ఇబ్బంది పెడుతుంది. శనివారం రాత్రి నుంచే చలి తీవ్రత పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని చాలా జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకు దిగువన నమోదువుతున్నాయి. మరోవైపు శీతలగాలులు వీస్తుండడంతో పిల్లలు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు.

కోహిర్‌లో 7.4 డిగ్రీలు..
శనివారం కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని సిర్పూర్, గిన్నెదరి ప్రాంతాల్లో అతి తక్కువగా 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆసిఫాబాద్‌ 8.8, తిర్యానీలో 8.9, సోనాలలో 8.5, బేల 9.2, బజార్‌ హత్నూర్‌లో 9.3, పొచ్చెరలో 9.5, పెంబిలో 9.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఆదివారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని కోహిర్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 7.4 డిగ్రీలుగా నమోదైంది. ఇక హైదరాబాద్‌లోనూ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి.

శీతలగాలులతో పగలు కూడా..
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో శీతల గాలుల ప్రభావం పెరిగింది. రాబోయే 2–3 రోజులు ఇదే విధంగా చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర, ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా చలి ప్రభావం అధికంగా ఉందని తెలిపారు. చలికితోడు పొగ మంచు కూడా కమ్మేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 8 గంటల వరకు కూడా ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. చలిలో బయటకు రావడం కూడా మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే.. స్వెట్టర్లు ధరించాలని, చల్లగాలి చెవుల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఏపీలోనూ పడిపోతున్న ఉష్ణోగ్రతలు
ఇదిలా ఉంటే మరోపక్క ఏపీలోని చలి గాలుల తీవ్రత పెరిగింది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన లంబసింగిలో చలితీవ్రత పెరిగింది. చింతపల్లి, పాడేరు తదితర ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.