Telugu Print Media : ఆ వార్తాపత్రిక మేనేజ్మెంట్ పరిస్థితి కూడా అలానే ఉంది. పేరుకేమో కార్పొరేట్ అని చెబుతుంది. చేసే చేష్టలు మాత్రం బజారు స్థాయి పత్రిక లాగా ఉంటాయి. రిపోర్టర్లకు లైన్ ఎకౌంట్ ఇవ్వదు. ఒకవేళ ఇచ్చినా అవి బైక్ పెట్రోల్ కు కూడా సరిపోవు.. లైన్ ఎకౌంట్ గురించి ఎప్పుడైనా ఎవరైనా రిపోర్టర్ అడిగితే పాత బకాయి కింద చూసుకున్నామని చెబుతారు. ప్రతి ఏడాది అక్టోబర్ వస్తే ఆ పత్రికకు ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే యాడ్స్ పేరుతో రిపోర్టర్లను జనం మీదకి వదులుతుంది. ఈసారి రెండు రాష్ట్రాలలో అనుకూల ప్రభుత్వాలు ఏర్పడటంతో అమాంతం టార్గెట్ పెంచింది. భారీ లక్ష్యాలను ఆయా యూనిట్లకు విధించింది. మేనేజ్మెంట్ చెప్పింది కాబట్టి బ్రాంచ్ మేనేజర్లు మీటింగులు పెట్టి మరీ రిపోర్టర్లకు లక్ష్యాలను విధించారు. నెల రోజుల నుంచి యాడ్స్ తతంగం మొదలుపెట్టారు.. అయితే మేనేజ్మెంట్ విధించిన లక్ష్యంలో ఇప్పటివరకు 50 శాతం మాత్రమే పూర్తయిందట. అటు ఆంధ్రప్రదేశ్లోనూ అంతంత మాత్రమే సాధ్యమైందట. ఇది ఆ పత్రిక మేనేజింగ్ డైరెక్టర్ కు కోపం తెప్పించిందట. అక్టోబర్ నెల పూర్తి నాటికే టార్గెట్ మొత్తం పూర్తి చేయాలని నిర్ణయించిన ఆ మేనేజ్మెంట్.. ఇప్పుడు నవంబర్ మొదటివారం వచ్చినప్పటికీ 50% మాత్రమే టార్గెట్ పూర్తి కావడంతో గడువు మళ్లీ పెంచిందట.
లైన్ ఎకౌంట్ మాత్రం ఇవ్వరు..
ఆ పత్రిక వ్యవహార శైలి జర్నలిజం ప్రమాణాలకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది. వ్యక్తుల వ్యక్తిగత జీవితాలలో భూతద్దాలు పెట్టుకుని చూడటం ఆ పత్రిక యాజమాన్యానికి మొదటి నుంచి అలవాటు. కనీసం అత్యాచారానికి గురైన ఒక మహిళ పేరు రాయకూడదు అనే కనీస ఇంగితం కూడా ఆ పత్రికకు ఉండదు. కానీ ఆ పత్రిక యజమాని ప్రతిరోజు నీతులు వల్లిస్తుంటారు. సర్వపరిత్యాగిలాగా గొప్పలు చెబుతుంటారు. గతంలో అంటే 2015లో ఓ యూనిట్లో సిబ్బందితో ఆ పత్రిక ఎండి మీటింగ్ పెట్టారు. ఈసారి యాడ్స్ టార్గెట్స్ ఉండవని స్పష్టం చేశారు. దీంతో విలేకరులు మొత్తం సంతోషపడ్డారు. కానీ ఆయన అలా హైదరాబాద్ వెళ్లారో లేదో.. వెంటనే న్యూస్ నెట్వర్క్ ఇన్చార్జి నుంచి సర్కులర్ వచ్చింది. దీంతో ఆ సంస్థ ఎండి మాటమీద నిలబడడని విలేకరులు ఒక అంచనాకొచ్చారు. ఒత్తిడి తట్టుకోలేక, యాడ్స్ చేయలేక చాలామంది వెళ్లిపోగా.. మిగతావారు మాత్రం అందులోనే ఉండిపోయారు. సంవత్సరాలుగా విలేకరి కొలువు చేసుకుంటూ.. బయట దొరికే పది, పాతికకు అలవాటు పడి అందులోనే మగ్గుతున్నారు.
యాడ్స్ ఇవ్వకుంటే…
యాడ్స్ ఇవ్వకుంటే ఆ పత్రికలో వ్యతిరేక కథనాలు వస్తాయి. వివరణతో పని లేకుండా అడ్డగోలుగా వార్తలు రాస్తుంటారు. పేరుకేమో పెద్ద పత్రిక అని చెబుతుంటారు కాని.. బజారు బూతు పదజాలాన్ని వాడడంలో ఆ పత్రిక తర్వాతే మిగతావన్నీ.. ఇప్పుడు యాడ్స్ టార్గెట్ పూర్తి కాకపోవడంతో రిపోర్టర్లను జిల్లాలోని బ్రాంచ్ మేనేజర్లు ఒత్తిడికి గురిచేస్తున్నారు. బ్యూరో చీఫ్ లు నానా మాటలు అంటున్నారు. అయితే ఈ ఒత్తిడి తట్టుకోలేక ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో రిపోర్టర్లు బయటికి వెళ్లిపోయారని తెలుస్తోంది. ” సోషల్ మీడియా పెరిగింది. పేపర్ చదివేవారు లేరు. మొన్నటిదాకానేమో సర్క్యులేషన్ అన్నారు. ఇప్పుడేమో యాడ్స్ టార్గెట్ అంటున్నారు. మనకు పైసా వచ్చేది లేదు. లైన్ ఎకౌంట్ గురించి అడిగితే వేధింపులకు గురి చేస్తున్నారు. ఇలాంటి పని కంటే అడ్డా మీద కూలి పనులకు పోవడం నయం అని” విలేకరులు వారిలో వారే అంతర్గతంగా సంభాషించుకుంటున్నారు.. రెండు రాష్ట్రాలలో అనుకూల ప్రభుత్వాలు ఏర్పడినప్పటికీ ఇప్పటివరకు 50% మాత్రమే యాడ్స్ టార్గెట్ పూర్తయింది. నెల రోజులు కిందా మీదా పడితే గాని 50% కాలేదు. పదిహేను రోజులు గడువులో 50 శాతం ఎలా పూర్తవుతుందో ఆ యాజమాన్యానికి తెలియాలి. ఇదే విషయాన్ని ఎవరైనా నేరుగా ప్రస్తావిస్తే.. ఆ సంస్థలో పనిచేసే ఒక మిడిల్ పెద్ద తలకాయకి “కామెడీ” లాగా అనిపిస్తుంది.