Telangana: ఇంతకీ ఎవరి పాలనలో మన నీళ్లు మనకు దక్కాయి?

హరీష్ రావు మాట్లాడిన అనంతరం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఆయనదైన స్పందన వినిపించారు.." 2014_22 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు 512 టీఎంసీల నీరు ఇచ్చేందుకు ఒప్పుకుంది.

Written By: Anabothula Bhaskar, Updated On : February 12, 2024 3:17 pm
Follow us on

Telangana: కృష్ణా నది పై నిర్మించిన ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించే విషయంలో జరుగుతున్న గొడవ తారాస్థాయికి చేరింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్నాయి. కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగిస్తామని గత ప్రభుత్వం చెప్పిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణానది ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగిస్తున్నదని భారత రాష్ట్ర సమితి విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలో కృష్ణ నది ప్రాజెక్టులపై వాస్తవాలు అనే పుస్తకాన్ని ప్రభుత్వం శాసనసభ వేదికగా సోమవారం ఆవిష్కరించింది. అయితే ఈ పుస్తకం పై నీటిపారుదల శాఖ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. శాసనసభ వేదికగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను ఆయన పూర్తిగా ఖండించారు. ” రెండవ అపెక్స్ కమిటీ మీటింగ్లో కృష్ణా నది నీటి ప్రాజెక్టులను కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగించేందుకు గత ప్రభుత్వం ఒప్పుకున్న విషయం అర్థరహితం. దీనికి ప్రస్తుత ప్రభుత్వంలోని నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా రాసిన లేఖ నిదర్శనం. పేజీ నెంబర్:3 లోని పేరాగ్రాఫ్: సీ లో ఈ వివరాలు ఉన్నాయి. 17వ కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ మీటింగ్ లోను గత ప్రభుత్వం ప్రాజెక్టులను అప్పగించేందుకు ఒప్పుకోలేదన్న విషయాన్ని రాహుల్ బొజ్జా రాశారని” హరీష్ రావు పేర్కొన్నారు. అంతేకాదు నీటి వాటాల పంపకంపై 50:50 నిష్పత్తిలో ఇవ్వాలని తాము కేంద్రానికి 26 లేఖలు రాశామని హరీష్ రావు శాసనసభలో వెల్లడించారు.

హరీష్ రావు మాట్లాడిన అనంతరం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఆయనదైన స్పందన వినిపించారు..” 2014_22 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు 512 టీఎంసీల నీరు ఇచ్చేందుకు ఒప్పుకుంది. గత సంవత్సరం నుంచి మాత్రమే 50:50 నిష్పత్తిలో వాటా అడుగుతోంది. అంతేకాదు ఎన్నికలకు ముందు ఏపీ ప్రభుత్వ పోలీసులు నాగార్జునసాగర్ ప్రాజెక్టు మీదికి వచ్చి హంగామా సృష్టించారు. దీనిని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు భారత రాష్ట్ర సమితి ప్రయత్నించింది. ఇప్పుడు అధికారంతో పోగానే కృష్ణా నిర్మించిన ప్రాజెక్టుల విషయంలో అనవసరమైన హంగామా చేస్తున్నది. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తోంది” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించలేదని నీటిపారుదల శాఖ మంత్రిగా తాను చెబుతుంటే.. హరీష్ రావు అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు.

మరోవైపు ఈ వివాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు.. తెలంగాణకు కృష్ణా నది నీళ్లు ప్రాణప్రదమని అన్నారు. ఎట్టి పరిస్థితిలో కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించబోమని స్పష్టం చేశారు. కృష్ణా నది నీళ్లపై చర్చ జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రాలేదని ప్రశ్నించారు..కృష్ణా నది నీళ్లపై తెలంగాణకు 68 శాతం వాటా ఇవ్వాలని ప్రభుత్వం తీర్మానం పెడుతుంటే.. దానిని ఆమోదించకుండా.. సభకు రాకుండా.. వ్యవసాయ క్షేత్రంలో పడుకున్నారని కెసిఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాదు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి సభలో ప్రవేశపెట్టిన “551 టీఎంసీల నీరు తెలంగాణకు రావాలి” అనే తీర్మానానికి కెసిఆర్ అనుకూలమా? కాదా? అనే విషయాన్ని తేల్చాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఇక రేవంత్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. జనవరి 17 2024న కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ జరిగిందని.. కృష్ణ నదిపై నిర్మించిన ప్రాజెక్టులు కేంద్రం చేతుల్లోకి వెళ్లిపోతున్నాయని.. తెలంగాణకు అన్యాయం జరుగుతోందని.. వంటి విషయాలపై పత్రికలలో కథనాలు వచ్చినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదని హరీష్ రావు అన్నారు. ఈ వ్యవహారంపై తాము ఆందోళనలు చేస్తే ప్రభుత్వం అప్పుడు మేల్కొందని.. జనవరి 27 2024న ప్రస్తుత ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందన్నారు. అయితే ఆ లేఖలో మాత్రమే కేంద్రానికి ప్రాజెక్టులు అప్పగించడం లేదని ఉందన్నారు. ఇక ఫిబ్రవరి 1 2024న జరిగిన రెండవ సమావేశంలో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ కు అప్పగించేందుకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకుందని హరీష్ రావు అన్నారు.