Telangana Assembly Elections 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. సోమవారం కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి 5 రాష్ట్రాలకు సంబంధించిన షెడ్యూల్ ను ప్రకటించారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మిజోరాం తో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30న జరగనున్నాయి. వచ్చేనెల 3న నోటిఫికేషన్ వెలువడడంతో నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. ఆ తర్వాత 10 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 15న నామినేషన్ల ఉపసంహరణ జరుగుతుంది. ఈ నేపథ్యంలో 5 రాష్ట్రాల్లో ఎన్నికల వాతావరణం నెలకొంది.
తెలంగాణలో ఎన్నికల కోలాహాలం మొదలైన నేపథ్యంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అప్రమత్తమైంది. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువైన ఆ పార్టీ నాయకులు ఇక ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు తాము చేసిన అభివృద్ధిని ప్రచారం చేయనున్నారు. అటు కాంగ్రెస్, బీజేపీలో పోటాపోటీగా వివిధ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే రెండు సార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టేందుకు విపరీతంగా ప్రయత్నిస్తోంది.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తరువాత కోడ్ అమల్లోకి వస్తుందని ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. దీంతో బహిరంగంగా ప్రభుత్వం పథకాలు, ప్రకటనలు ఇవ్వడానికి ఆస్కారం లేదు. కానీ డిజిటల్ మీడియా ద్వారా ప్రకటనలు ఇచ్చే ఆస్కారం ఉండడంతో బీఆర్ఎస్ టెక్నాలజీని విపరీతంగా వాడుకోవాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా సోషల్ మీడియాలను విపరీతంగా వాడుకోవాలని భావిస్తోంది.
ఇప్పటికే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న బీఆర్ఎస్ ఇక నుంచి ప్రజలను ఆకట్టుకోవడానికి వివిధ వీడియోలు, ఇప్పటి వరకు చేపట్టిన పనులను పరిచయం చేయనున్నారు. ముఖ్యంగా యూట్యూబ్ లో ఏ వీడియో ఓపెన్ చేసినా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు సెట్ చేయనున్నారు. ఇప్పటికే ఓ ప్రముఖ కంపెనీతో ప్రచారానికి సంబంధించిన వీడియోలు తయారు చేసి ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. కేవలం యూట్యూబ్ మాత్రమే కాకుండా ట్విట్టర్, పే టీఎం, ఫేస్ బుక్ ఇలా ఏ సోషల్ మీడియాను వదలకుండా ప్లాన్ చేసినట్లు సమాచారం.