Revanth Reddy: శాస్త్ర సాంకేతికత పెరుగుతున్నప్పుడు దానిని అందిపుచ్చుకోవాలి. కాకపోతే ఆ టెక్నాలజీని ఈ ఎదుగుదల కోసం మాత్రమే వాడుకోవాలి. అందులో ఉన్న మంచిని మాత్రమే స్వీకరించగలగాలి. అప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయి. పనులు వేగవంతంగా జరిగి.. అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి. అటువంటిదే ఇప్పుడు జరిగింది.
గతంలో విద్యార్థులకు వార్షిక పరీక్షలు జరిగిన తర్వాత.. వారి ప్రగతి పత్రాలను అందించడంలో జాప్యం జరిగేది. దీనికి తోడు ప్రభుత్వ పాఠశాలల్లో సిబ్బంది కొరత వల్ల ప్రగతి పత్రాలను రూపొందించడంలో ఆలస్యం చోటు చేసుకునేది. దీనివల్ల విద్యార్థులు కూడా ప్రగతిపత్రాలను అంతగా పట్టించుకునేవారు కాదు. విద్యాశాఖలో జవాబుదారీతనం అంతగా లేకపోవడంతో తల్లిదండ్రులు కూడా ప్రగతిపత్రాల గురించి అంతగా అడిగే వారు కాదు.. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అంతేకాదు, పెరిగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థుల కోసం ప్రభుత్వం వాడుకుంటున్నది.
ప్రస్తుతం వాట్సాప్ అనేది మనిషి జీవితంలో అత్యవసరమైన సాధనంగా మారిపోయింది. దీని ద్వారా ఆటల నుంచి మొదలు పెడితే ఫోటోలు వరకు అన్ని బట్వాడా అవుతున్నాయి. ఇటీవల పలు రాష్ట్ర ప్రభుత్వాలు వాట్స్అప్ ద్వారా సేవలు కూడా అందిస్తున్నాయి. ఈ జాబితాలోకి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా చేరిపోయింది. కాకపోతే మిగతా రాష్ట్ర ప్రభుత్వాల కంటే భిన్నంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ ద్వారా సరికొత్త సేవలను అందిస్తోంది. డిజిటల్ పరిపాలన పేరుతో తెలంగాణ ప్రభుత్వం కీలకమైన ముందడుగు వేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఐదు నుంచి తొమ్మిదవ తరగతి విద్యార్థుల వార్షిక ప్రగతి పత్రాలను నేరుగా తల్లిదండ్రులకు పంపించింది.
పాఠశాలకు వెళ్లే అవసరం లేకుండానే 18 లక్షల మందికి పైగా విద్యార్థుల ప్రగతి పత్రాలను వారి తల్లిదండ్రుల వాట్సప్ నెంబర్ కు పంపించేసింది. ఐటి శాఖ ఆధ్వర్యంలో ఈ సేవలను ప్రభుత్వం అందించింది. దీంతో విద్యార్థుల ప్రగతిని తల్లిదండ్రులు అంచనా వేశారు. అంతేకాదు వారి ప్రగతిని మెరుగుపరచడంలో… తల్లిదండ్రులకు ఇది ఒక సాధనంగా ఉపయోగపడుతుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.