Revanth Reddy : ఇందుగలదు అందులేదు అని సందేహం వలదు.. ఎందు చూసినా అవినీతి కనిపిస్తోంది. ఒక సెక్షన్ నుంచి మరొక సెక్షన్ కు ఫైల్ కదలాలంటే లంచం.. ఇలా తెలంగాణ లో అన్ని శాఖల మొత్తం లంచాల కంపు కొడుతున్నాయి. ముడుపులతో చెడ్డపేరు మోస్తున్నాయి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అవినీతి నిరోధక శాఖ అధికారులతో జరిపిస్తున్న దాడుల్లో లంచగొండి ఆఫీసర్లు దొరుకుతుండటమే పై ఆరోపణలకు బలం చేకూర్చుతోంది. వాస్తవానికి తెలంగాణ చరిత్రలో గతంలో ఎన్నడు లేనివిధంగా ఏసీబీ దాడులు చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ ఏసిబి కి పూర్తిస్థాయిలో స్వేచ్ఛ ఇవ్వడంతో.. అవినీతి అధికారుల బాగోతం బయటపడుతోంది. అవినీతి నిరోధక శాఖ అధికారులు కేవలం దాడులతోనే ఆగరట.. అంతకుమించి చేపడతారట.. ఒక రకంగా తెలంగాణలో అవినీతి అనేది లేకుండా చేయడానికి అడుగులు వేస్తారట.
పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా
పత్రికల్లో వచ్చిన కథను ఆధారంగా ఏసీబీ అధికారులు విచారణ జరిపించి.. ప్రభుత్వానికి నివేదిక అందిస్తున్నారు. ఆయా శాఖలలో జరుగుతున్న అవినీతిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. అవినీతి నిరోధక శాఖ అధికారుల విచారణలో ఎక్కువగా గ్రూప్ 1, గ్రూప్ 2 స్థాయి వారు ఉన్నట్టు తెలుస్తోంది.. పురపాలకం, రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్, ఆర్టిఏ, పోలీస్ శాఖలపై అధికారులు ప్రధానంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు వివిధ శాఖలకు సంబంధించి అవినీతి నిరోధక శాఖ అధికారులు ఏకంగా 18 నివేదికలను ప్రభుత్వానికి సమర్పించారట. వీటి ఆధారంగా ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తున్నట్టు తెలుస్తోంది.. రెగ్యులర్ డ్యూటీలో భాగంగా ఏసీబీ అధికారులు దాడులు చేస్తూనే ఉండగా.. మళ్లీ ఇప్పుడు విజిలెన్స్ పేరుతో అవినీతి అధికారులను అదుపులోకి తీసుకొని.. వారి ఆస్తులను.. ఇతర లావాదేవీలను బయటపెడతారట.. తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు లంచాలు తీసుకుంటూ 167 మంది అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. వీరివి మాత్రమే కాకుండా ఇంకా 177 కేసుల సంబంధించి పూర్తి నివేదికలను ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి ఇచ్చినట్టు తెలుస్తోంది. అవినీతి జరిగే శాఖలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.
టెక్నాలజీని ఉపయోగించుకొని..
లంచాలు తీసుకోకుండా కొంతమంది అధికారులు రకరకాల రూపాలలో ముడుపుల వ్యవహారం సాగిస్తున్నారు. అయితే అటువంటి అధికారులను సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అదుపులోకి తీసుకునేందుకు ఏసీబీ అడుగులు వేస్తోంది. దీనికి తోడు అనేక రకాల సేవలను కూడా ప్రభుత్వం అంతర్జాలంలోకి తీసుకొస్తోంది. అయితే అక్కడ కూడా అధికారులు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్న నేపథ్యంలో.. వారికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం సరికొత్త విధానాలను తెరపైకి తీసుకొస్తుంది అని తెలుస్తోంది. అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మునిసిపాలిటీలు అవినీతికి అడ్డాలుగా మారిపోయాయని తెలుస్తోంది. దీనికి తోడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న టౌన్ ప్లానింగ్ విభాగంలో అడ్డగోలుగా అవినీతి జరుగుతోందని.. దీనికి సంబంధించి తనకు వేలాదిగా ఫిర్యాదులు వస్తున్నాయని ఏసీబీ అధికారులు అంటున్నారు. అన్ని డాక్యుమెంట్లు అందజేసినప్పటికీ ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం లేదని.. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు వస్తున్నాయి. మధ్యవర్తులను కలిస్తే తప్ప బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించిన అనుమతులు ముందుకు కదలడం లేదనిఅధికారుల దృష్టికి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. చివరికి రేషన్ కార్డుల విషయంలో కూడా 5,000 నుంచి 10,000 వరకు తీసుకుంటున్నారని తెలుస్తోంది. అందువల్లే అనర్హులకు రేషన్ కార్డులు మంజూరు చేశారని ఏసీబీ అధికారుల విచారణలో తేలింది. ఇక సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులలో డాక్యుమెంట్ రైటర్లు.. రియల్ ఎస్టేట్ బ్రోకర్లది హవా నడుస్తోందని ఏసీబీ అధికారుల విచారణలో తేలింది. వీరందరిపై కూడా అకస్మాత్తుగా చర్యలు ఉంటాయని ఏసీబీ అధికారులు చెబుతున్నారు.