Telangana Municipal Elections Voter List: తెలంగాణలో మరో ఎన్నికల సమరం మొదలవనుంది. మొదటి వరకు పంచాయతీ ఎన్నికల హడావుడి సాగింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎంతోకాలంగా మునిసిపల్, కార్పొరేషన్లలో ఎన్నికలు ఎప్పుడు? అని ఎదురుచూస్తున్న ప్రజలు, నాయకులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించినట్లు అయింది. రాష్ట్రంలో మున్సిపల్ ఓటర్ల డ్రాప్ లిస్టును రిలీజ్ చేయడంతో ఇక ఎన్నికల సమరం మొదలైనట్లేనని కొందరు చర్చించుకుంటున్నారు. జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఓటర్ల జాబితా సిద్ధం చేయనున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా 117 మున్సిపాలిటీలు ఉన్నాయి. అలాగే ఆరు కార్పొరేషన్లు ఉన్నాయి. వీటిలో డ్రాప్ ఓటర్ల జాబితాలను రిలీజ్ చేశారు. ఇప్పటివరకు నమోదు చేసుకొని వారు.. ఓటర్ల జాబితాలో సవరణలు చేసుకోవాలని అనుకునే వారికి ప్రభుత్వం అవకాశమిచ్చింది. ఇందుకోసం ప్రభుత్వ వెబ్సైట్ https:tsec.gov.in/home.do అనే వెబ్సైట్లోకి వెళ్లి తమ ఓటర్ లిస్ట్ ను చెక్ చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. డ్రాప్ లిస్టు ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 45 లక్షల ఓటర్లు ఉన్నట్లు తెలిపింది. ఇందులో 23 లక్షల మంది మహిళలు, 22 లక్షల మంది పురుషులు ఉన్నట్లు పేర్కొంది. మున్సిపాలిటీల్లో 26 90, కార్పొరేషన్లలో 366 వార్డులు ఉన్నాయి. వీటికి ఒకేసారి ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎన్నికలలోగా ఓటర్లు తమ ఓటర్ లిస్టును సవరించుకోవడం లేదా కొత్తగా చేర్చుకోవడం వంటివి జనవరి 10వ తేదీలోగా చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది.
అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ముందుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని అనుకున్నారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల కు మరో ఏడాది సమయం పట్టి అవకాశం ఉందన్నట్లు చర్చించుకున్నారు. కానీ మున్సిపల్, కార్పొరేషన్ల పాలకవర్గాల పదవీకాలం 2025 జనవరి 26వ తేదీతో ముగిసింది. మరో ఏడాది పెంచితే ఆలస్యం అయ్యే అవకాశం ఉందని భావించి ముందుగా కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారు.
మున్సిపల్ , కార్పొరేషన్ల ఓటర్ల జాబితా రిలీజ్ కావడంతో ఆయా ప్రాంతాల్లోని రాజకీయ నాయకులు అప్రమత్తమయ్యారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇప్పటినుంచే ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల న్యూ ఇయర్ సందర్భంగా ఫ్లెక్సీలతో చాలామంది హడావుడి చేశారు. ప్రజల్లో కలిసిపోవడానికి వారిని గుర్తించడానికి ఫోటోలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ ప్రజలను ఆకట్టుకునే విధంగా మెసేజ్ ల రూపంలో శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు వచ్చే ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం సైతం సిద్ధమవుతోంది. పంచాయతీ ఎన్నికల లాగే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలను విజయవంతం చేయడానికి అధికార వర్గాలను అప్రమత్తం చేస్తోంది. ఇక ఈ ఎన్నికల్లో గెలుపొందేందుకు పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. మొన్నటి వరకు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పార్టీల ప్రభావం లేకపోవడంతో జెండాలు ఎక్కువగా కనిపించలేదు. కానీ ఎన్నికల్లో పార్టీల హడావుడి ఎక్కువగా కల్పించే అవకాశం ఉందని తెలుస్తోంది.