Telangana Municipal Elections 2026: ఎద్దు అరక లాగాలి. రైతు వ్యవసాయం చేయాలి. కమ్మరి పనిముట్టును రూపొందించాలి.. ఇలా ఎవరి పని వారు చేస్తే బాగుంటుంది. అలా కాకుండా ఒకరి దాంట్లో మరొకరు వేలు పెడితే వాసన వస్తుంది. పచ్చిగా చెప్పాలంటే పని కాస్త పనికిమాలిన పని అవుతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే.. ఈ కథనం చదివిన తర్వాత.. పై ఉపోద్ఘాతం జస్టిఫై అవుతుందో? లేదో? మీకే తెలుస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. దాదాపు అన్ని సర్వే సంస్థలు కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ స్థానాలకు మించి వస్తాయని స్పష్టం చేశాయి. ఇందులో కొన్ని సంస్థలు వాస్తవానికి దగ్గరగా తమ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఎన్నికలు జరిగిన తర్వాత అనేక సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించడం సర్వసాధారణం. ఇదేమీ కొత్త కాదు.. వింత అంతకంటే కాదు.
తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రకు సరిహద్దులో ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓ సంస్థ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది. ఆ ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించిన సమాచారాన్ని ఓ డిజిటల్ పత్రికకు అందించింది. ఆ పత్రిక కాస్త ఆ వివరాలను బొంబాట్ గా ప్రచురించింది. గణాంకాల విషయంలో.. క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేయడంలో ఆ సంస్థ అడ్డంగా విఫలమైంది. ఫలితంగా అటూ ఇటూ కాని ఎగ్జిట్ పోల్స్ జనాల్లో నవ్వు తెప్పిస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో 74 స్థానాలలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని.. 36 స్థానాలలో గులాబీ పార్టీ విజయం సాధిస్తుందని.. ఏడు కార్పొరేషన్లలో ఐదు కాంగ్రెస్ దక్కించుకుంటుందని.. బిజెపి, సిపిఐ చెరో కార్పొరేషన్ సొంతం చేసుకుంటారని ఆ సర్వే సంస్థ స్పష్టం చేసింది.
క్షేత్రస్థాయిలో పరిస్థితులను.. నమూనాలను సేకరించిన తర్వాత ఈ విషయం చెబుతున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది.. సర్వే జరిగిన తీరు కూడా ఓ డిజిటల్ పత్రికకు అందించి గొప్పగా ప్రచారం చేస్తుంది చేసుకుంది. ఆ సంస్థలో దాదాపు 800 మంది పగలు రాత్రి తేడా లేకుండా పనిచేశారట. 134 రోజులుగా కేవలం మున్సిపల్ ఎన్నికలు లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పనిచేశారట. ఓటర్ల నుంచి కచ్చితమైన అభిప్రాయాలను తీసుకున్నారట. చదవడానికి.. వినడానికి ఇది గొప్పగా ఉన్నప్పటికీ అసలు ఫలితాలే విచిత్రంగా ఉన్నాయి.
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ కార్పొరేషన్, ఏడు మున్సిపాలిటీల ఫలితాలను ఈ సంస్థ వెల్లడించింది. కొత్తగూడెం నగర పాలక సంస్థలో కమ్యూనిస్టు పార్టీ జెండా ఎగరవేస్తుందట. ఈ కార్పొరేషన్ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి, సిపిఐ కి పొత్తు లేదు కాబట్టి.. పోరు హోరాహోరీగా జరిగింది కాబట్టి.. కాసేపు ఇది నిజం అనుకుందాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు పురపాలకాన్ని కమ్యూనిస్టు పార్టీ ఖాతాలో వేసింది ఈ సంస్థ.
ఇల్లందు మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులు ఉన్నాయి. ఇక్కడ ఐదు స్థానాలలో సిపిఎం రెండు, సిపిఐ 2, మాస్ లైన్ పార్టీ ఒక స్థానంలో కలిసి పోటీ చేశాయి. ఒకవేళ ఈ ఐదు వార్డులను కమ్యూనిస్టులు సొంతం చేసుకున్నప్పటికీ.. మున్సిపల్ చైర్ పర్సన్ స్థానం కమ్యూనిస్టు పార్టీకి లభించే అవకాశం లేదు. ఒకవేళ ఇక్కడ గులాబీ పార్టీతో కలిసి ఆ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి అని ఆ సంస్థ వాదించినప్పటికీ.. అలాంటప్పుడు ఆ పీఠం గులాబీ పార్టీ ఖాతాలోకి వెళ్తుంది కదా.. అలాకాకుండా కమ్యూనిస్టు పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని చెప్పడమేంటి?
పాలేరు నియోజకవర్గంలో ఏదులాపురం మున్సిపాలిటీ ఉంది. ఈ సర్వే సంస్థ ఈ మున్సిపాలిటీని ఏకంగా గులాబీ పార్టీ దక్కించుకుంటుందని చెప్పింది. వాస్తవానికి ఈ మున్సిపాలిటీ పరిధిలో గులాబీ పార్టీకి గొప్పగా చెప్పుకునే బలం లేదు. కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం ఇక్కడ బలంగా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇలా ఉంటే ఇక్కడ గులాబీ పార్టీ పీఠాన్ని దక్కించుకుంటుందని చెప్పడం ఏమిటో అర్థం కావడం లేదు.
అన్నట్టు ఈ ఫలితాలను సిపాక్ అనే సంస్థ ప్రకటించింది. ఈ సంస్థ ప్రకటించిన ఫలితాలు వాస్తవానికి అత్యంత దూరంగా ఉన్నాయి. ఇల్లెందు, ఏదులాపురం మున్సిపాలిటీ స్థానాలను కేవలం ఇక్కడ మనం ఉదాహరణగా మాత్రమే చూడవచ్చు. సిపాక్ అనే సంస్థ తన ప్రాబల్యం కోసం ఏదో చెప్పుకుంది అనుకుందాం. కానీ విశ్వసనీయత గల డిజిటల్ పత్రికకు ఆ మాత్రం సోయి ఉండాలి కదా.
క్షేత్రస్థాయి పరిస్థితి తెలియకుండానే వార్తలను ప్రచురిస్తున్నారా.. ఈ విషయం ఆ పత్రికలో పనిచేసే పెద్దలకు తెలియదా.. ఇలాంటప్పుడే జనాలు నవ్వుకుంటారు.. కాదు కాదు జాలి పడతారు.. సర్వే చేసిన వాడి మీద కాదు.. సర్వే ఫలితాన్ని ప్రచురించిన వాడి మీద..